Share News

అంతా.. ఆన్‌లైన్‌ మాయ

ABN , Publish Date - Jun 03 , 2026 | 05:07 AM

మండల, గ్రామస్థాయిలో ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయి. సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వం, సీసీఎల్‌ఏ నుంచి పుంఖానుపుంఖాలుగా ఆదేశాలు, మార్గదర్శకాలు, ఉత్తర్వులు ఇస్తున్నారు.

అంతా.. ఆన్‌లైన్‌ మాయ

  • ఎక్కడి భూ సమస్యలు అక్కడే.. సర్కారుకేమో ‘ఫీల్‌గుడ్‌’ నివేదికలు

  • పరిష్కారంపై పైనుంచి ఆదేశాలు ఫుల్‌.. మండల, గ్రామస్థాయిలో ఆచరణ నిల్‌

  • గత జగన్‌ ప్రభుత్వ రీ సర్వే 1.0తో వచ్చిన పిటిషన్లు 8.75 లక్షలు

  • 4 లక్షల దరఖాస్తులు తెరవనేలేదు.. మిగిలినవీ సింహభాగం పెండింగ్‌

  • అన్ని సెటిల్‌ అయినట్లుగా నివేదికలు.. సమస్య అంతా క్షేత్రస్థాయిలోనే

  • ఆఫీసుల చుట్టూ తిరుగుతున్న రైతులు

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

  • మరో ఏడాదిలో భూ సమస్యలు లేని రాష్ట్రంగా ప్రకటించేందుకు సర్కారు సన్నద్ధమవుతోంది. వచ్చే ఏడాది మార్చి 31 నాటికి 17 వేల గ్రామాల్లో రీ సర్వే పూర్తి చేసి, ఇక ఏ గ్రామంలోనూ భూ సమస్యలు లేవని, ఆంధ్రప్రదేశ్‌ వివాదాలు లేని రాష్ట్రమని ఘనం చెప్పుకోవడానికి రంగం సిద్ధమవుతోంది. మరి.. ఇదంతా నిజమేనా? ఆచరణలో భూ సమస్యలన్నీ పరిష్కారమవుతున్నాయా? అంటే.. అంతా మిథ్యే.

  • గత జగన్‌ ప్రభుత్వం అనాలోచితంగా చేపట్టిన రీ సర్వే 1.0 వల్ల లేనిపోని సమస్యలు వచ్చాయి. కూటమి ప్రభుత్వానికి ప్రజల నుంచి ఏకంగా 8.75 లక్షల పిటిషన్‌లు వచ్చాయి. ఇందులో ఇప్పటికీ 4 లక్షల దరఖాస్తులు తెరవనేలేదు. తెరిచిన 4.75 లక్షల దరఖాస్తులలో సింహభాగం పెండింగ్‌లో పెట్టి, అవి పరిష్కారం అయిపోయినట్లేనని ప్రభుత్వానికి ఫీల్‌గుడ్‌ నివేదికలు ఇచ్చేశారు. క్షేత్రస్థాయిలో ఇదీ వాస్తవం.

మండల, గ్రామస్థాయిలో ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయి. సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వం, సీసీఎల్‌ఏ నుంచి పుంఖానుపుంఖాలుగా ఆదేశాలు, మార్గదర్శకాలు, ఉత్తర్వులు ఇస్తున్నారు. కానీ అవి గ్రామస్థాయిలో అమలు కావడం లేదు. గత జగన్‌ ప్రభుత్వం చేపట్టిన రీ సర్వే 1.0లో వచ్చిన వాటితో పాటు ప్రస్తుతం అమల్లో ఉన్న 2.0 సర్వేలో వస్తున్న సమస్యలతో గ్రామాల్లో భూ వివాదాలు చెలరేగుతున్నాయి. రైతులు నిరంతరం రెవెన్యూ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. గ్రామ, మం డల స్థాయి అధికారులపై నమ్మకం కోల్పోయిన రైతులు దిక్కుతోచక ఆర్‌డీఓ, జిల్లా కలెక్టర్‌ ఆఫీసులకు పరుగులు తీస్తున్నారు. పరిస్థితి ఇలా ఉంటే.. ఆచరణలో భూ వివాదాలు పరిష్కారమయ్యేదెన్నడు? కనీసం ఒక మండలాన్ని అయినా వచ్చే ఏడాదికి వివాదరహితంగా ప్రకటించగలరా? సర్కారు భూ సమస్యల పరిష్కారంపై గ్రామస్థాయి నుంచే దృష్టిసారించకపోతే అక్కడి నుంచే తీవ్ర వ్యతిరేకత వచ్చే ప్రమాదముందని రెవెన్యూ నిపుణులు చెబుతున్నారు.


జగన్‌ సర్కారు నిర్వాకంతో..

జగన్‌ ప్రభుత్వం 2020-24 కాలంలో 6,675 గ్రామాల్లో తొలిదశ 1.0రీసర్వే చేసింది. అద్భుతంగా చేశామని గొప్పలుచెప్పుకోవడమే కానీ రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. భూమి విస్తీర్ణం తగ్గించడం, సరిహద్దులు మార్చేయడం, సర్వే నంబర్‌ తప్పుగా నమోదు చేయడం, భూమిని మరోచోట చూపించడం.. ఇలా అనేక తప్పులొచ్చాయి. జగన్‌ ఓటమి ఇదీ ఓ కారణం. కూటమి సర్కారు రాగానే పరిస్థితిని అర్థం చేసుకొని రీ సర్వే 1.0 జరిగిన 6,675 గ్రామాల్లో సభలు నిర్వహించింది. 8.75 లక్షల మంది రైతులు భూ సమస్యల పరిష్కారం కోరుతూ పిటిషన్‌లు ఇచ్చారు. రీ సర్వే ద్వారా కొత్తగా తీసుకొచ్చిన జాయింట్‌ ఎల్‌పీఎమ్‌ల విభజన కోరుతూ కూడా భారీగా దరఖాస్తులు వచ్చాయి. ఇందులో అధికారిక లెక్కల ప్రకారమే ఇంతవరకూ 4 లక్షల దరఖాస్తులను మండల, గ్రామ స్థాయిలో తెరవలేదని తెలిసింది. సమస్యల పరిష్కారంపై అమరావతి స్థాయిలో రెవెన్యూ అధికారులు ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, సీసీఎల్‌ఏలు జిల్లాలకు టార్గెట్‌లు పెట్టారు. అయితే క్షేత్రస్థాయిలో అధికారులు లక్షల దరఖాస్తులను తెరవకుండానే పరిష్కరించినట్లుగా, పరిశీలనకు స్వీకరించినట్లుగా నివేదికలు పంపించారు. ఇందులో 8.75 లక్షల పిటిషన్‌లకు గాను 4.75 లక్షలు జాయింట్‌ ఎల్‌పీఎమ్‌లతో ముడిపడినవని, మిగిలిన 4 లక్షల దరఖాస్తులు సెటిల్‌ చేశామని జిల్లాల నుంచి నివే దికలు వచ్చాయి. అమరావతి స్థాయి నుంచి వచ్చిన టార్గెట్‌లు, ఒత్తిళ్లతో.. అధికారులు గ్రామస్థాయికి వెళ్లి సమస్యలను పరిశీలించి పరిష్కరించకుండానే సెటిల్‌ చేసినట్లుగా నివేదికలు పంపించినట్లు తెలిసింది. ఇక ఇలా రీ సర్వే 1.0లో వచ్చిన సమస్యలు పరిష్కరించాలంటూ వచ్చిన ఫిర్యాదులు 3.76 లక్షలపైనే ఉన్నాయని తెలిసింది. అయితే ఈ గణాంకాలేవీ అధికారికంగా వెలుగుచూడకుండా తొక్కిపడేస్తున్నట్లు సమాచారం. డూప్లికేషన్‌ ఆఫ్‌ పిటిషన్స్‌ అనే కోణంలో వాటిని పరిగణించి వెలుగు చూడకుండా చేస్తున్నారని తెలిసింది.


సమస్య అంతా క్షేత్రస్థాయిలోనే: రీ సర్వేలో వస్తున్న సమస్యలు, ఇంకా రైతులు ఎదుర్కొంటున్న భూ వివాదాల పరిష్కారం కోరుతూ పెద్దఎత్తున పీజీఆర్‌ఎ్‌సకు విన్నపాలు వస్తున్నాయి. గ్రామస్థాయిలో వీఆర్‌ఓ, సర్వేయర్‌, ఇంకా సచివాలయం దాకా వచ్చేవి పెద్దగా పరిగణనలోకి తీసుకోవడం లేదని తెలిసింది. ఏదైనా మండలంలో ఎక్కువ పిటిషన్‌లు వచ్చినట్లుగా పీజీఆర్‌ఎస్‌, ఇతర ఆన్‌లైన్‌ ఫార్మాట్‌లో నమోదు చేస్తే సంబంధిత తహశీల్దార్‌ వాటికి జవాబు చెప్పాల్సి ఉం టుంది. అందుకే చాలా వరకు పిటిషన్‌లు రికార్డులకు ఎక్కడం లేదు. దీంతో ఎంతోమంది వ్యయప్రయాసలకు ఓర్చి కలెక్టరేట్లకు వెళ్లి పిటిషన్‌లు ఇస్తున్నారు. వీటిని మళ్లీ మండల, గ్రామ ఆఫీసులకు పంపిస్తున్నారు. ఈ పిటిషన్లు రికార్డుల్లో నమోదై సకాలంలో పరిష్కారం కాకపోతే పైఅధికారులకు జవాబు చెప్పుకోవాల్సి ఉం టుంది. ఈ సమస్య లేకుండా పిటిషన్‌లను పెండింగ్‌లో పెడుతున్న ఉదంతాలు కోకొల్లలు. ఇటు మండల, అటు గ్రామస్థాయిలో లక్షల పిటిషన్‌లు పెండింగ్‌లో పెడుతున్నారు. రైతులు వెళ్లి అధికారులను కలిసినా పరిష్కారం కావడం లేదు. రైతుల సమస్యలను పరిష్కరించాలంటే రీ సర్వే చేయడమో లేక అధికారులే క్షేత్రపర్యటనకు వెళ్లడమో చేయాలి. అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లకుం డా దరఖాస్తులు పెండింగ్‌లో పెట్టడం లేదా పరిష్కరించినట్లుగా పీజీఆర్‌ఎస్‌ రిపోర్టులను తాజాపరుస్తున్నారు. దీంతో జిల్లా స్థాయిలో కలెక్టర్‌కు, రాష్ట్ర స్థాయిలో సీసీఎల్‌ఏ, రెవె న్యూ కార్యదర్శికి, ఇంకా సీఎంకు వెళ్లే రిపోర్టుల్లో 98.99 శాతం సమస్యలన్నీ పరిష్కారమైనట్లుగానే ఉంటున్నాయి. వాటిని చూసి భూ సమస్యలన్నీ పరిష్కారమైపోతున్నాయని, ఇక వివాదాలు లేని రాష్ట్రంగా ప్రకటించవచ్చన్న ఆలోచనలకు పైస్థాయిలో పదునుపెడుతున్నారు. పరిష్కారం అంతా ఆన్‌లైన్‌లోనే.. ఆచరణలో మాత్రం సమస్యలు అలాగే ఉంటున్నాయి!.


మచ్చుకు కొన్ని..

పరిష్కరించకనే.. చేసినట్టు మెసేజ్‌

తిరుపతి రూరల్‌ మండలంలోని ఓ రైతుకు 4 ఎకరాల భూమి ఉంది. రీ సర్వే 1.0 తర్వాత 3 ఎకరాలే ఉన్నట్లుగా చూపించారు. ఆయనకు చెందిన ఎకరం భూమిని మరో రైతు ఖాతాలో కలిపేశారు. బాధిత రైతు కూటమి ప్రభుత్వం నిర్వహించిన గ్రామసభల్లో సమస్య పరిష్కారం కోరుతూ పిటిషన్‌ ఇచ్చారు. పరిష్కారం అయినట్లుగా పలు మెసేజ్‌లు వెళ్లాయి. కానీ ఇంతవరకు ఆ సమస్య పరిష్కారం కాలేదు. ఇప్పటికే రెండుసార్లు కలెక్టరేట్‌లోనూ పిటిషన్‌లు ఇచ్చారు. అయినా సమస్య పరిష్కారం కాలేదు.

వారసత్వ భూమి కోసం పాట్లు

మార్కాపురం జిల్లా కొనకనమిట్ల మండలం గొట్లగట్టులో గోరంట్ల వెంకటస్వామికి వారసత్వంగా వచ్చిన 80 సెంట్ల పట్టా పొలం ఉంది. 60 ఏళ్లుగా ఆయన సాగులోనే ఉంది. వెంకటస్వామి మరణానంతరం భూమిని ఆయన భార్య కృష్ణకుమారి పేరిట రికార్డు మార్చాలి. ఈమేరకు కుటుంబ సభ్యులు అర్జీ ఇచ్చినా, అనూహ్యంగా అది ప్రభుత్వ భూమిగా రికార్డుల్లో మార్చారు. రైతు పేరిట పట్టా ఉన్న భూమిని ప్రభుత్వ భూమిగా ఎప్పుడు మార్చారు? రైతుకు ఎందుకు నోటీసు ఇవ్వలేదో అధికారులు బదులివ్వడం లేదు. కృష్ణకుమారికి ఇదే గ్రామంలో సర్వే 318-2లో 86 సెంట్లు వారసత్వంగా వచ్చింది. 56 ఏళ్లుగా సాగులో ఉన్నారు. తనకు హక్కులు కల్పించాలని రెవెన్యూ చుట్టూ ఏళ్ల తరబడి తిరుగుతున్నా పరిష్కారం లేదు. ఇప్పుడా గ్రామంలో రీ సర్వే సాగుతోంది. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు న్యాయం చేస్తారు?

సమస్య ఒకటి.. సమాధానం మరొకటి

కాకినాడ జిల్లా కరప మండలం యండమూరులో ఓ రైతుకు సర్వే నంబర్‌ 495-1బీ, 493-2లో ఎకరన్నర పొలం ఉంది. గత జగన్‌ ప్రభుత్వంలో నిర్వహించిన రీ సర్వేలో రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లకుండా, రీ సర్వే చేసినట్లుగా రికార్డు రూపొందించారు. ఉన్న పొలంలో 30 సెంట్లు తగ్గించేశారు. దీనిపై ఆ రైతు కూటమి ప్రభుత్వం నిర్వహించిన గ్రామసభ సహా అనేకసార్లు పిటిషన్‌లు ఇచ్చారు. ఆ పిటిషన్‌ ప్రభుత్వానికి అందినట్లు, పరిష్కరించినట్లుగా మెసేజ్‌లు వచ్చాయి. కానీ సమస్య పరిష్కారం కాలేదు. విచిత్రం ఏమంటే.. రీ సర్వే తర్వాత భూమి తగ్గిపోయిందని పిటిషన్‌ పెడితే, మ్యుటేషన్‌కు దరఖాస్తు చేసుకున్నారని, త్వరలో ఆ సమస్య పరిష్కారం అవుతుందని రైతుకు రెండు మెసేజ్‌లు పంపించారు. ఆ తర్వాత మ్యుటేషన్‌ కూడా పూర్తి చేసినట్లు సందేశం పంపించారు. ఇంకా ఆ రైతు ఆఫీసుల చూట్టు తిరుగుతున్నారు. ఇలాంటి రైతులు ఈ గ్రామంలో 50 మందిపైనే భూ సమస్యలతో ఇబ్బందిపడుతున్నారు.

Updated Date - Jun 03 , 2026 | 05:07 AM