Share News

30 శాతానికి ఖరీఫ్‌ సాగు

ABN , Publish Date - Jul 19 , 2026 | 03:43 AM

ఎల్‌నినో ప్రభావం ఉన్నా.. రాష్ట్రంలో ఖరీఫ్‌ సాగు ప్రస్తుతం 30 శాతానికి చేరింది. రాష్ట్రంలో ఖరీఫ్‌ సాధారణ సాగు విస్తీర్ణం 30.84 లక్షల హెక్టార్లు. ఇప్పటికి 9.60 లక్షల హెక్టార్లలో సాగు జరగాల్సి ఉండగా..

30 శాతానికి ఖరీఫ్‌ సాగు

  • ఎల్‌నినో ప్రభావంలోనూ సాధారణ స్థాయిలో పంటలు

  • గతేడాది కంటే లక్ష హెక్టార్లు అధికం

  • కాలువల నీటితో వరి.. వర్షాధారంగా మెట్ట పైర్ల సాగు

  • రానున్న రోజుల్లో సాగునీటి సరఫరాపై సందేహాలు

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

ఎల్‌నినో ప్రభావం ఉన్నా.. రాష్ట్రంలో ఖరీఫ్‌ సాగు ప్రస్తుతం 30 శాతానికి చేరింది. రాష్ట్రంలో ఖరీఫ్‌ సాధారణ సాగు విస్తీర్ణం 30.84 లక్షల హెక్టార్లు. ఇప్పటికి 9.60 లక్షల హెక్టార్లలో సాగు జరగాల్సి ఉండగా.. 8.91 లక్షల హెక్టార్లలో రైతులు సాగు చేపట్టారు. గతేడాది ఇదే సమయానికి 7 లక్షల హెక్టార్లలోనే విత్తనం పడింది. ఈ ఏడాది ప్రతికూల వాతావరణంలోనూ దానికంటే లక్ష హెక్టార్లపైగా పంటలు పడటం విశేషం. నైరుతి రుతుపవన కాలంలో రాష్ట్రవ్యాప్తంగా 580.1 మిల్లీమీటర్ల సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉంది. జూన్‌ 1 నుంచి జూలై 15వ తేదీ నాటికి 166.8 మిల్లీమీటర్ల వాన కురవాల్సి ఉండగా.. 86.3 మిల్లీమీటర్లు మాత్రమే కురిసింది. దీంతో 48.3శాతం వాన లోటు నెలకొంది. ముఖ్యంగా కోనసీమ, ఉభయ గోదావరి, అన్నమయ్య జిల్లాల్లో 60 నుంచి 99 శాతం, మిగతా 24 జిల్లాల్లో 20 నుంచి 59 శాతం వర్షపాతం లోటు కొనసాగుతోంది. గత నెలన్నర రోజుల్లో అడపాదడపా కురిసిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలకు మెట్ట పైర్లు, కృష్ణా, గోదావరి, వంశధార, పెన్నా డెల్టాల కాలువలకు సాగునీటి విడుదల ఫలితంగా రైతులు వరి సాగు చేపట్టారు. డెల్టాలకు ప్రభుత్వం సాగునీటిని విడుదల చేయడంతో వరి సాగుకు అన్నదాతలు సంసిద్ధమయ్యారు. ఈ సీజన్‌లో 15.14 లక్షల హెక్టార్ల వరి సాగు లక్ష్యంలో ఇప్పటి వరకు 3.26లక్షల హెక్టార్లు(22ు) సాగులోకి వచ్చింది. అలాగే, 5.15 లక్షల హెక్టార్ల పత్తి సాగు లక్ష్యంలో 2.75లక్షల హెక్టార్లు(53శాతం) ఇప్పటికే సాగులోకి వచ్చింది. జొన్న, సజ్జ, మొక్కజొన్న, రాగులు, ఇతర తృణ, చిరుధాన్యాల పంటలు 2.21లక్షల హెక్టార్ల లక్ష్యానికిగాను, 70వేల హెక్టార్లలో(32శాతం) విత్తనం పడింది.


కంది, మినుము, పెసర, ఉలవ, రాజ్మా, శనగ వంటి అపరాల పంటలు 3.46లక్షల హెక్టార్లకు గాను 1.22లక్షల హెక్టార్లలో(35శాతం) విత్తనాలు పడ్డాయి. వేరుశనగ, నువ్వులు, ఆముదం, పొద్దుతిరుగుడు, సోయాబీన్‌, కుసుమ, ఇతర నూనె గింజల పంటలు 4.50 లక్షల హెక్టార్లకుగాను 86వేల హెక్టార్లల్లో(19శాతం) విత్తనం పడింది. డెల్టా ప్రాంతాలతో పాటు వ్యవసాయ బోర్డు ఉన్న చోటా రైతులు వరి సాగు చేపడుతున్నారు. గోదావరి నీటిని అక్కడి డెల్టాల కాలువలకు సరఫరా చేస్తుండటంతోపాటు పట్టిసీమ ఎత్తిపోతల ద్వారా కృష్ణా డెల్టాకూ మళ్లిస్తున్నారు. ప్రకాశం బ్యారేజ్‌ నుంచి కృష్ణా డెల్టాకు నీరు ఇస్తుండగా, నాగార్జునసాగర్‌ ప్రాజెక్ట్‌లో నీటిమట్టం గణనీయంగా తగ్గడంతో కుడి కాలువకు నీటి విడుదల అవకాశంపై సందేహం నెలకొందని అధికారులు చెప్తున్నారు. కృష్ణా బేసిన్‌లోని రిజర్వాయర్లలో నీటి మట్టాలు పడిపోతుండటంతో రానున్న రోజుల్లో వరికి నీటి సరఫరాపై నీలినీడలు కమ్ముకునే పరిస్థితి ఉంది. ఎల్‌నినో తీవ్ర ప్రభావం చూపితే ఖరీఫ్‌ పంటలకు గండమని నిపుణులు అంటున్నారు. అందువల్ల ప్రీ-మాన్సూన్‌ డ్రై స్పెల్‌ విధానంలో విత్తనాలు వేయాలని, నీటి వృధాను నివారించి, వర్షాధారంగా పశుగ్రాసాలు, స్వల్పకాలిక పంటలను సాగు చేయాలని సూచిస్తున్నారు.

Updated Date - Jul 19 , 2026 | 03:44 AM