స్టైపెండ్ 12శాతం పెంచలేం
ABN , Publish Date - Aug 25 , 2026 | 05:25 AM
స్టైపెండ్ పెంచాలన్న డిమాండ్‌తో సమ్మెకు దిగిన జూనియర్ డాక్టర్లతో ప్రభుత్వ చర్చలు ఇంకా కొలిక్కి రాలేదు.
ఇంటర్న్‌లకు 10శాతం, సూపర్ స్పెషాలిటీలకు 3శాతం
జూనియర్ డాక్టర్లకు స్పష్టం చేసిన ప్రభుత్వం
అమరావతి, గుంటూరు మెడికల్, ఆగస్టు 24 (ఆంధ్రజ్యోతి): స్టైపెండ్ పెంచాలన్న డిమాండ్‌తో సమ్మెకు దిగిన జూనియర్ డాక్టర్లతో ప్రభుత్వ చర్చలు ఇంకా కొలిక్కి రాలేదు. ఇంటర్న్, పీజీలు, సూపర్ స్పెషాలిటీ వైద్యులతో కలిపి అందరికీ 12 శాతం స్టైపెండ్ ఇవ్వాలని జూడాలు డిమాండ్ చేశారు. జూనియర్ వైద్యుల అసోసియేషన్ ప్రతినిధులు సోమవారం సాయంత్రం మంగళగిరిలోని ఏపీఐఐసీలో మరోసారి ప్రభుత్వంతో చర్చలు జరిపారు. స్టైపెండ్‌ను ఏటా 7 శాతం పెంచాలని కోరారు. అయితే ప్రభుత్వం మాత్రం కేవలం ఇంటర్న్‌లకు మాత్రమే 10 శాతం పెంచడానికి దాదాపు ఆమోదించింది. పీజీలకు, సూపర్ స్పెషాలిటీ వైద్యులకు 3 శాతానికి మించి ఇవ్వలేమని తేల్చిచెప్పింది. ప్రభుత్వం తరఫున చర్చలకు వచ్చిన ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు ప్రభుత్వ పరిస్థితిని జూడాలకు వివరించారు. అయితే ప్రభుత్వ ప్రతిపాదనలపై సభ్యులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపిన జూడాల ప్రతినిధులు చర్చల నుంచి బయటకు వచ్చేశారు. మంగళవారం మరోసారి ఇరువర్గాలూ చర్చించుకునే అవకాశం ఉంది.
కొనసాగుతున్న సమ్మె..
ఆంధ్రప్రదేశ్ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ (ఆబ్జుడా) ఇచ్చిన పిలుపు మేరకు.. ఉపకార వేతనం పెంపు కోరుతూ జూనియర్ డాక్టర్లు చేస్తున్న నిరవధిక సమ్మె సోమవారానికి 14వ రోజుకు చేరింది. గుంటూరు జీజీహెచ్‌తో సహా రాష్ట్రవ్యాప్తంగా జూడాలు విధులు బహిష్కరించి సమ్మె కొనసాగిస్తున్నారు. సోమవారం వర్షంలో సైతం తమ నిరసన ప్రదర్శన కొనసాగించారు. ప్రభుత్వం మొండి పట్టు వీడి తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని కోరారు. ఇప్పటికీ ఆబ్జుడా ప్రభుత్వంతో అర్ధవంతమైన చర్చలకు కట్టుబడి ఉందని, తమ సమస్యకు ఆమోదయోగ్యమైన పరిష్కారం లభించే వరకు నిరవధిక సమ్మె కొనసాగిస్తామని జూనియర్ వైద్యుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డా. ఈశ్వర్ శంకర్ తెలిపారు.
డిప్యుటేషన్‌పై ప్రైవేటు జూనియర్ డాక్టర్లు
జూనియర్ డాక్టర్ల సమ్మెతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు
గుంటూరు మెడికల్, ఆగస్టు 24 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా జూనియర్ డాక్టర్ల సమ్మె కొనసాగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తోంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్రంలోని పలు ప్రైవేటు వైద్య కళాశాలల మెడికల్ పీజీ విద్యార్థులు (జూనియర్ డాక్టర్లు) డిప్యుటేషన్‌పై గుంటూరు ప్రభుత్వ వైద్య బోధనాస్పత్రిలో విధుల్లో చేరారు. ఓపీ, ఐపీ వార్డుల్లో రోగులకు సేవలందించారు. జీఎంసీ (గుంటూరు మెడికల్ కాలేజీ)కి చెందిన 17 మంది సర్వీస్ పీజీ విద్యార్థులతో పాటు ఎన్నారై మెడికల్ కాలేజీ (చినకాకాని) నుంచి 11 మంది, ఆశ్రమ్ మెడికల్ కాలేజీ (ఏలూరు) నుంచి ఇద్దరు గుంటూరు జీజీహెచ్‌లో విధుల్లో చేరారు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం ఈదులపాలెంలోని కాటూరి మెడికల్ కాలేజీకి చెందిన కొందరు మెడికల్ పీజీ విద్యార్థులు జీజీహెచ్‌లో రిపోర్ట్ చేసేందుకు రాగా.. ఇక్కడ సమ్మెలో ఉన్న జీఎంసీ విద్యార్థులు వారిని అడ్డుకున్నారు. దీంతో వారు వెనుదిరిగారు. ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ సూచనల మేరకు అధికారులు సంప్రదింపులు జరపడంతో.. ప్రైవేటు మెడికల్ కాలేజీల జూనియర్ వైద్యులు డిప్యుటేషన్‌పై పలు ప్రభుత్వ వైద్య బోధన ఆస్పత్రుల్లో సేవలందిస్తున్నారు. రెగ్యులర్ డాక్టర్లకు సాయంగా 200 మంది వైద్యులు, జూనియర్ డాక్టర్లు గుంటూరు జీజీహెచ్‌లో పనిచేయడంతో సోమవారం ఓపీ, ఐపీ రోగుల సంఖ్య పెరిగింది.