అత్యవసర వైద్యసేవలూ బంద్
ABN , Publish Date - Aug 17 , 2026 | 04:03 AM
ప్రభుత్వ బోధనాస్పత్రుల్లో అత్యవసర వైద్య సేవలను బహిష్కరిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ (అబ్జుడా) రాష్ట్ర శాఖ ప్రకటించింది.
నేటి నుంచి జూనియర్ వైద్యుల సమ్మె ఉధృతం
ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై వైద్యాధికారుల దృష్టి
బోధనాస్పత్రుల్లో వైద్య సిబ్బందికి సెలవులు రద్దు
అమరావతి/ గుంటూరు మెడికల్, ఆగస్టు 16(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ బోధనాస్పత్రుల్లో అత్యవసర వైద్య సేవలను బహిష్కరిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ (అబ్జుడా) రాష్ట్ర శాఖ ప్రకటించింది. వారం రోజులుగా దశల వారీగా ఆందోళనలు చేస్తున్నా, ప్రభుత్వం స్పందించకపోవడంతో సోమవారం ఉదయం నుంచి క్యాజువాల్టీ, ఐసీయూ, శస్త్రచికిత్సలు వంటి అన్ని రకాల అత్యవసర వైద్య సేవలను బహిష్కరించాలని తీర్మానించినట్లు పేర్కొంది. ఈ మేరకు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఈశ్వర్ శంకర్ ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. జూడాలకు స్టైపెండ్ పెంచాలని, ప్రభుత్వ వైద్యుల ఉద్యోగ విరమణ వయసు 62 ఏళ్లకు మించకూడదని, ఎన్‌ఎంసీ నిబంధనలను అనుసరించి బోధన సిబ్బందిగా ఎంఎ్‌ససీ పీహెచ్‌డీ అభ్యర్థుల రిక్రూట్‌మెంట్ 15 శాతం లోపే ఉండాలనే డిమాండ్లతో జూనియర్ డాక్టర్లు సమ్మెకు దిగారు. ఆగస్టు 15 సాయంత్రానికి ప్రభుత్వం నుంచి సంతృప్తికరమైన లిఖితపూర్వక హామీ లేదా నిర్ణయం వస్తుందని ఆశించామని తెలిపారు. నిర్దేశిత గడువులోపు ఎలాంటి స్పందన లేకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో మూడోదశ ఆందోళనలకు దిగుతున్నామని వివరించారు. దీనివల్ల ఎదురయ్యే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని స్పష్టం చేశారు. కాగా, జూనియర్ డాక్టర్లు సమ్మెలో పాల్గొంటున్నందున రోగులకు వైద్యసేవల్లో ఇబ్బందులు లేకుండా ఆరోగ్యశాఖ అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు. బోధనాస్పత్రుల్లో వైద్య సిబ్బందికి మెడికల్ లీవులు మినహా మిగిలిన అన్ని సెలవులు రద్దు చేశారు. వైద్య కళాశాలల నుంచి నాన్ క్లినికల్ వైద్యులను డిప్యుటేషన్‌పై తీసుకుంటున్నారు. క్యాజువాల్టీ, ఇతర విభాగాల్లో పీహెచ్‌సీ వైద్యుల సేవలను వాడుకునేందుకు వారిని డిప్యూటేషన్‌పై బోధనాస్పత్రుల్లో నియమిస్తున్నారు.
సమ్మె నేపథ్యంలో ప్రభుత్వ సాధారణ ఆస్పత్రులపై భారం పడకుండా రిఫరల్స్‌ను తగ్గించాలని అన్ని డీహెచ్‌ఎస్‌లకు డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ కె.వి.ఎన్. చక్రధర్‌బాబు ఆదేశాలు జారీ చేశారు. తప్పనిసరి అయిన అత్యవసర కేసులను మాత్రమే పంపాలని స్పష్టం చేశారు. డీహెచ్‌ఎస్ పరిధిలోని ఆస్పత్రుల్లో పనిచేస్తున్న సీనియర్ రెసిడెంట్లు, డీఆర్‌పీలను వెంటనే రిలీవ్ చేయాలన్నారు. వారు సంబంధిత ప్రభుత్వ వైద్యకళాశాల ప్రిన్సిపాళ్ల వద్ద రిపోర్టు చేయాలని సూచించారు. అలాగే ప్రస్తుతం సెలవులో ఉన్న, అనధికారికంగా విధులకు గైర్హాజరవుతున్న వైద్యులను వెంటనే విధుల్లోకి రప్పించాలని ఆదేశించారు.
ఇతర రాష్ట్రాల కంటే ఏపీలోనే మెరుగు
జూనియర్ వైద్యులతో పలుసార్లు చర్చలు జరిపినట్లు ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు. దేశంలోని మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మెరుగైన స్టైపెండ్ ఇస్తున్నామన్నారు. ఒకేసారి 15శాతం పెంచాలని కోరుతున్నారని, ఆ స్థాయిలో పెంపు సాధ్యం కాదని తేల్చిచెబుతున్నారు. అంత మొత్తం పెంచితే అసిస్టెంట్ ప్రొఫెసర్ల జీతం కంటే వీరికిచ్చే స్టైపెండ్ ఎక్కువగా ఉంటుందని వివరిస్తున్నారు. ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకుని జూనియర్ వైద్యులు విధులకు హాజరు కావాలని కోరుతున్నారు.