స్టైపెండ్ పెంపుపై ప్రత్యేక కమిటీ
ABN , Publish Date - Aug 26 , 2026 | 05:06 AM
జూనియర్ డాక్టర్ల(జూడా) డిమాండ్లపై రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా ఉందని మంత్రి సత్యకుమార్ మరోసారి తెలిపారు. జూడా సంఘం ప్రతినిధులు మంగళవారం సచివాలయంలో మంత్రిని కలిశారు.
కమిటీ హెడ్‌గా హెల్త్ సెక్రటరీ వీరపాండియన్
జూనియర్ డాక్టర్ల డిమాండ్లపై సర్కారు సానుకూలం
సంఘం ప్రతినిధులతో మంత్రి సత్యకుమార్ భేటీ
ప్రభుత్వంపై నమ్మకం ఉంది: ప్రెసిడెంట్ ఈశ్వర్
సమ్మెను తాత్కాలికంగా ఆపుతున్నట్లు ప్రకటన
అమరావతి, ఆగస్టు 25(ఆంధ్రజ్యోతి): జూనియర్ డాక్టర్ల(జూడా) డిమాండ్లపై రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా ఉందని మంత్రి సత్యకుమార్ మరోసారి తెలిపారు. జూడా సంఘం ప్రతినిధులు మంగళవారం సచివాలయంలో మంత్రిని కలిశారు. తాము సమ్మెను విరమించినట్లు మంత్రికి తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్ర ఆర్థిక పరిమితులను దృష్టిలో ఉంచుకుని.. ఇతర రాష్ట్రాల్లో జూనియర్ వైద్యులకు అందుతున్న స్టైపెండ్, ఇతర ప్రయోజనాలను పరిశీలించి తగిన నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. తమిళనాడు, కర్ణాటక, కేరళ, తెలంగాణలో అందుతున్న స్టైపెండ్ తదితర అంశాలను రాష్ట్రంలో అమలవుతున్న విధానంతో పోల్చి ఇప్పటికే కూలంకషంగా చర్చించామన్నారు. జూడాలు స్టైపెండ్ పెంచాలని, వైద్యుల రిటైర్మెంట్ వయసు పెంచకూడదని డిమాండ్ చేసిన విషయాన్ని గుర్తుచేశారు. వైద్యుల రిటైర్మెంట్ వయసు పెంపుపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. స్టైపెండ్ పెంపు అంశంపై ప్రత్యేకంగా కమిటీని ఏర్పాటు చేశామన్నారు. ఆరోగ్యశాఖ సెక్రటరీ వీరపాండియన్ నేతృత్వంలో కమిటీ పని చేస్తుందని చెప్పారు.
సానుకూలంగా స్పందించాలి
తమ డిమాండ్లపై ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయడం పట్ల జూడా సంఘం అధ్యక్షుడు డాక్టర్ ఈశ్వర్ హర్షం వ్యక్తం చేశారు. మంత్రిని కలిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. హైకోర్టు ఆదేశాలను తప్పకుండా పాటిస్తామని తెలిపారు. 16 రోజులుగా జూడాలు తమ సమస్యలపై సమ్మె చేస్తున్నారని గుర్తుచేశారు. కోర్టు సూచనల మేరకు ప్రభుత్వం నుంచి సానుకూల నిర్ణయం వస్తుందనే నమ్మకం ఉందన్నారు. ఇదిలావుంటే, తమ సమ్మెను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్టు మంగళవారం రాత్రి సంఘం ప్రకటించింది. బుధవారం ఉదయం నుంచి జూడాలు విధులకు హాజరుకానున్నట్టు తెలిపింది.