జూనియర్ డాక్టర్ల సమ్మె విరమణ
ABN , Publish Date - Aug 26 , 2026 | 05:04 AM
గత రెండు వారాలకు పైగా సమ్మె చేస్తున్న జూనియర్ డాక్టర్ల అసోసియేషన్(జూడా) తమ సమ్మెను విరమించింది. హైకోర్టు జోక్యంతో సంఘం సానుకూల నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయం పట్ల ధర్మాసనం సంతోషం వ్యక్తం చేసింది.
హైకోర్టు జోక్యంతో సానుకూల నిర్ణయం
వైద్యుల బాధలు అర్థం చేసుకుంటామన్న కోర్టు
డిమాండ్ల పరిష్కారంపై 2 వారాల్లో నిర్ణయం
తీసుకోవాలని ప్రభుత్వానికి ధర్మాసనం ఆదేశం
12 శాతం స్టైపెండ్ కోరుతున్న జూనియర్ డాక్టర్లు
హౌస్ సర్జన్లకు 10 శాతం పెంపునకు సర్కారు ఓకే
అమరావతి, ఆగస్టు 25(ఆంధ్రజ్యోతి): గత రెండు వారాలకు పైగా సమ్మె చేస్తున్న జూనియర్ డాక్టర్ల అసోసియేషన్(జూడా) తమ సమ్మెను విరమించింది. హైకోర్టు జోక్యంతో సంఘం సానుకూల నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయం పట్ల ధర్మాసనం సంతోషం వ్యక్తం చేసింది. తమ సమస్యలను ఎవరూ పట్టించుకోవడం లేదనే కారణంతో జూనియర్ డాక్టర్లు సమ్మెకు దిగి ఉండవచ్చని, వారి బాధను తాము అర్థం చేసుకోగలమని పేర్కొంది. వైద్య వృత్తి చాలా పవిత్రమైందని ధర్మాసనం పేర్కొంది. అనారోగ్యంతో ఉన్న వ్యక్తి ఆసుపత్రిలో వైద్యుడిని చూసిన వెంటనే జబ్బు సగం నయమతుందని, బాగోగులు చూసుకునేందుకు డాక్టర్ ఉన్నారనే నమ్మకం అతనికి ఏర్పడుతుందని తెలిపింది. వైద్య సేవలకు అంతరాయం కలగకుండా నిరసన తెలిపేందుకు ఇతర మార్గాలు, పద్ధతులను అన్వేషించాలని వైద్యులను కోరింది. జూనియర్ డాక్టర్ల సమంజసమైన డిమాండ్లను పరిష్కరించే విషయంలో రెండు వారాల్లో నిర్ణయం తీసుకోవాలని రాష్ట ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్)పై విచారణను మూసివేసింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లిసాగిల్, జస్టిస్ చల్లా గుణరంజన్‌తో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు ఇచ్చింది. జూడాల సమ్మె కారణంగా రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలు, ఆసుపత్రుల్లో అత్యవసర సేవలకు భంగం కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ సామాజిక కార్యకర్త ప్రకాశం జిల్లా, సింగరాయకొండకు చెందిన గూడూరి వెంకట రవీంద్రకుమార్ పిల్ దాఖలు చేశారు. మంగళవారం జరిగిన విచారణలో పిటిషనర్ తరఫు న్యాయవాది ఠాగూర్ యాదవ్ వాదనలు వినిపిస్తూ.. ‘‘జూడాల సమ్మెతో అత్యవసర వైద్య సేవలు నిలిచిపోయాయి.
జాతీయ వైద్య మండలి నిబంధనల ప్రకారం వరుసగా 48 గంటల పాటు విధులకు హాజరుకాకుంటే రిజిస్ట్రేషన్ రద్దు చేయవచ్చు.’’ అని తెలిపారు. అడ్వొకేట్ జనరల్(ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపిస్తూ.. ‘‘స్టైపెండ్ విషయంలో జూనియర్ డాక్టర్లతో చర్చించేందుకు ప్రభుత్వం కమిటీ వేసింది. హౌస్ సర్జన్లకు 10శాతం, పీజీ రెసిడెంట్ డాక్టర్స్, సూపర్ స్పెషాలిటీలకు 3 శాతం చొప్పున స్టైపెండ్ పెంచేందుకు అంగీకరించింది. కనీసం 12 శాతం స్టైపెండ్ పెంచాలని జూడాలు డిమాండ్ చేస్తున్నారు.’’ అని వివరించారు.
అందుకే సమ్మెకు దిగాం!
జూనియర్ డాక్టర్ల సంఘం తరఫు న్యాయవాది భూమా మహర్షిరెడ్డి వాదనలు వినిపిస్తూ.. ‘‘స్టైపెండ్, ఇతర డిమాండ్ల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వానికి అనేక వినతులు సమర్పించారు. ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో సమ్మెకు దిగారు. అత్యవసర వైద్య సేవలకు అందుబాటులో ఉంటున్నారు. ఈ సేవలు నిలిచిపోయాయన్న పిటిషనర్ వాదనలో వాస్తవం లేదు. వైద్యులు.. ఉద్యోగుల నిర్వచనం పరిధిలోకి రారు. వారికి ఎస్మా చట్టం వర్తించదు.’’ అని పేర్కొన్నారు. ఇరు పక్షాల వాదనలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.. సమ్మె పేరుతో వైద్యులు విధులకు దూరంగా ఉండడం సరికాదని పేర్కొంది. విధుల్లోకి రావాలని తాము ఆదేశాలు ఇచ్చే పరిస్థితి తీసుకురావద్దని హెచ్చరించింది. తగిన సూచనలు తీసుకొని తమ ముందుకు రావాలని అసోసియేషన్ తరఫు న్యాయవాదికి ధర్మాసనం స్పష్టం చేసింది. అనంతరం.. అసోసియేషన్ తరఫు న్యాయవాది మహర్షిరెడ్డి వాదనలు కొనసాగిస్తూ.. సమ్మె విరమించాలని జూడాలు నిర్ణయం తీసుకున్నట్లు ధర్మాసనానికి నివేదించారు. ‘‘జూడాల డిమాండ్లను పరిష్కరించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలి. స్టైపెండ్‌ను 30శాతం వరకు పెంచాలని జూడాలు మొదట డిమాండ్ చేశారు. చర్చల అనంతరం 12 శాతానికి దిగి వచ్చారు.’’ అని తెలిపారు.