జూడాలకు 30 శాతం ఉపకార వేతనం పెంచాలి
ABN , Publish Date - Jun 22 , 2026 | 05:40 AM
రాష్ట్ర ప్రభుత్వ వైద్య బోధన ఆస్పత్రుల్లో విద్య అభ్యసించే జూనియర్ డాక్టర్లకు ఉపకార వేతనం పెంచాలని ఆంధ్రప్రదేశ్ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్(ఆబ్జుడా) ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది.
ఆరోగ్య శాఖ మంత్రికి ఆబ్జుడా వినతి
గుంటూరు మెడికల్, జూన్ 21 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వ వైద్య బోధన ఆస్పత్రుల్లో విద్య అభ్యసించే జూనియర్ డాక్టర్లకు ఉపకార వేతనం పెంచాలని ఆంధ్రప్రదేశ్ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్(ఆబ్జుడా) ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. హౌస్ సర్జన్లు, మెడికల్ పీజీ విద్యార్థులు, సూపర్ స్పెషాలిటీ విద్యార్థులతో పాటు సీనియర్ రెసిడెంట్లకు ప్రస్తుతం ఇస్తున్న ఉపకార వేతనాన్ని 30 శాతం పెంచాలని నేతలు కోరారు. గతంలో మూడు పర్యాయాలు స్టైఫండ్ పెంచుతామని గత ఆరోగ్య శాఖ మంత్రి హామీ ఇచ్చినా నేటికీ కార్యరూపం దాల్చలేదన్నారు. జూనియర్ డాక్టర్ల సేవలను గుర్తించి ఉపకార వేతనం పెంపుపై తక్షణం నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఈ మేరకు గత వారం ఆంధ్రప్రదేశ్ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ యు.ఈశ్వర్ శంకర్ (గుంటూరు మెడికల్ కాలేజీ) నేతృత్వంలో ఆబ్జుడా కార్యవర్గ సభ్యులు ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్‌ను కలసి వినతిపత్రం అందజేశారు. వీరి డిమాండ్లపై మంత్రి సానులకూలంగా స్పందించారు. త్వరలోనే తగిన నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు.