15శాతం పెంచలేం!
ABN , Publish Date - Aug 21 , 2026 | 04:29 AM
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా స్టైపండ్‌ను 15 శాతం పెంచలేకపోతున్నామని ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ వెల్లడించారు. నిరవధిక సమ్మె చేస్తున్న జూనియర్ డాక్టర్ల సంఘం ప్రతినిధులతో గురువారం ఆయన చర్చించారు.
హౌస్ సర్జన్లకు 5.. పీజీలకు 3శాతం పెంచుతాం
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే
అర్థం చేసుకోండి.. చర్చల్లో ఆరోగ్య మంత్రి
15శాతం పెంచాల్సిందే.. జూనియర్ డాక్టర్ల పట్టు
అమరావతి, గుంటూరు మెడికల్, ఆగస్టు 20 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా స్టైపండ్‌ను 15 శాతం పెంచలేకపోతున్నామని ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ వెల్లడించారు. నిరవధిక సమ్మె చేస్తున్న జూనియర్ డాక్టర్ల సంఘం ప్రతినిధులతో గురువారం ఆయన చర్చించారు. ముందుగా జూనియర్ డాక్టర్లు వారి మూడు ప్రధాన డిమాండ్లను మంత్రికి వివరించారు. వాటిలో స్టైపండ్ పెంపు మినహా మిగిలిన రెండు డిమాండ్ల పట్ల మంత్రి సానుకూలంగా స్పందించారు. జూనియర్ డాక్టర్ల పట్ల సానుభూతి ఉన్నప్పటికీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి వల్ల 15 శాతం పెంచలేకపోతున్నామన్నారు. దీనిపై పునరాలోచన చేసి, వెంటనే విధులకు హాజరుకావాలని కోరారు. ప్రొఫెసర్ల పదవీ విరమణ వయసు పెంపుపై వైద్యులను సంప్రదించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్‌ఎంసీ) మార్గదర్శకాల అమలు, దూర ప్రాంతాల్లోని బోధనాసుపత్రుల్లో ఖాళీలు భర్తీకాని పక్షంలోనే నాన్-క్లినికల్ పోస్టులను ఎంఎస్సీ పీహెచ్‌డీ అర్హత కలిగిన వారితో భర్తీ చేయాల్సి వస్తుందని వివరించారు. స్టైపండ్ పెంపు విషయంలో ఇంటర్న్ (హౌస్ సర్జన్ల)లకు ఈ ఒక్క ఏడాదికి 5 శాతం, వచ్చే ఏడాది నుంచి 3 శాతం పెంచాలని ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. పీజీ, సూపర్ స్పెషాలిటీ వైద్యులకు ఈ ఏడాది 3 శాతం పెంచుతామన్నారు. అసోసియేషన్‌తో మరోసారి చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. జూనియర్ డాక్టర్లు మాత్రం స్టైపండ్ 15 శాతం పెంచాల్సిందేనని పట్టుబట్టి చర్చల నుంచి బయటకు వచ్చేశారు. తమ భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళికను శుక్రవారం మీడియాకు వెల్లడిస్తామని ఆబ్జుడా రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఈశ్వర్ శంకర్ తెలిపారు.
హెల్త్ సెక్రటరీ తీరుపై మంత్రికి ఫిర్యాదు..
హెల్త్ సెక్రటరీ వీరపాండియన్ తీరుపై జూనియర్ వైద్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. చర్చల సమయంలో ఆయన కొంత దురుసుగా ప్రవర్తించారని మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. ‘‘మీరు ఎంత కాలం సమ్మె చేస్తారో చేయండి... నా పవర్ నేను చూపిస్తాను’’ అన్నారని తెలుపగా.. హెల్త్ సెక్రటరీతో మాట్లాడి, సమస్యను సరిచేస్తానని మంత్రి హామీ ఇచ్చారు.
రక్తదానంతో నిరసన!
జూనియర్ డాక్టర్లు చేస్తున్న నిరవధిక సమ్మె గురువారానికి 11వ రోజుకు చేరింది. రాష్ట్రవ్యాప్తంగా గురువారం అన్ని ప్రభుత్వ వైద్య బోధన ఆసుపత్రుల్లో జూనియర్ వైద్యులు స్వచ్ఛంద రక్తదానం చేసి నిరసన తెలిపారు. గుంటూరు జీజీహెచ్‌లో 125 మంది రక్తదానం చేశారు. అనంతరం సమ్మె శిబిరంలో నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన ప్రదర్శన కొనసాగించారు. సమ్మెతో గుంటూరు జీజీహెచ్‌లో ఓపీ, ఐపీ రోగుల సంఖ్య బాగా తగ్గింది. సమస్యల పరిష్కారం పట్ల ప్రభుత్వం ఉదాశీనంగా వ్యవహరిస్తున్నట్లు ప్రభుత్వ వైద్యుల సంఘం నేతలు పలువురు మండిపడ్డారు. స్టైపండ్ పెంపుపై ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటన జూడాలను అవమానించే విధంగా ఉందన్నారు. ఇటీవల భోగాపురం ఎయిర్‌పోర్టు ప్రారంభోత్సవానికి ఖర్చుచేసిన సొమ్ముతో పోలిస్తే.. స్టైపండ్ పెంపు వల్ల ప్రభుత్వంపై పడే భారం చాలా తక్కువే ఉంటుందని అన్నారు. కానీ.. ప్రభుత్వం తమ ఆర్ధిక పరిస్థితి బాగాలేదని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని విమర్శించారు.