కొత్త కోర్టులు ఏర్పాటు చేయండి
ABN , Publish Date - Jul 01 , 2026 | 06:38 AM
జిల్లాల పునర్విభజన తర్వాత తలెత్తిన సాంకేతికపరమైన ఇబ్బందులను పరిష్కరించాలని, జ్యుడీషియల్ జిల్లాల పునర్విభజన, కొత్త కోర్టులను ఏర్పాటు చేయాలని..
సీఎం చంద్రబాబును కోరిన ఏపీ జ్యుడీషియల్ ఆఫీసర్స్ అసోసియేషన్
అమరావతి, జూన్ 30(ఆంధ్రజ్యోతి): జిల్లాల పునర్విభజన తర్వాత తలెత్తిన సాంకేతికపరమైన ఇబ్బందులను పరిష్కరించాలని, జ్యుడీషియల్ జిల్లాల పునర్విభజన, కొత్త కోర్టులను ఏర్పాటు చేయాలని ఏపీ జ్యుడీషియల్ ఆఫీసర్స్ అసోసియేషన్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు విజ్ఙప్తి చేసింది. ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఏపీ జ్యుడీషియల్ ఆఫీసర్స్ అసోసియేషన్ ప్రతినిధులు సీఎం చంద్రబాబును కలిసి వివిధ అంశాలను వివరించారు. జ్యుడీషియల్ అధికారుల సమస్యలు, సంక్షేమం సహా అసోసియేషన్ భవన నిర్మాణానికి స్థలాన్ని కేటాయించాలని, ఆయా కుటుంబాలకు క్యాష్‌లెస్ వైద్య చికిత్సలు, సాఫ్ట్ లోన్ పరిమితి పెంపు, ఇళ్ల స్థలాలు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. ఈ అంశాలపై సీఎం సానుకూలంగా స్పందించారు. వీటిని దశలవారీగా పరిష్కరించేందుకు చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. అసోసియేషన్ అధ్యక్షులు జి.చక్రపాణి, ఉపాధ్యక్షులు శ్రీనివాసరావు, శైలజ, ప్రధాన కార్యదర్శి రమేశ్ నాయుడు, సంయుక్త కార్యదర్శి కృష్ణప్రసాద్, కార్యవర్గ సభ్యురాలు వెన్నెల రాధారాణి సీఎంను కలిశారు.