Share News

1523 పోస్టులతో జాబ్‌ క్యాలెండర్‌

ABN , Publish Date - May 16 , 2026 | 04:04 AM

రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన జాబ్‌ క్యాలెండర్‌ అమలు ప్రక్రియ ప్రారంభమైంది. నిరుద్యోగులకు ఇచ్చిన హామీలో భాగంగా ఈ ఏడాది మార్చి 18న ప్రభుత్వం జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేసింది.

1523 పోస్టులతో జాబ్‌ క్యాలెండర్‌

  • మొదటి విడత నోటిఫికేషన్లు జారీ.. 19 యూనివర్సిటీల్లో 64 నోటిఫికేషన్లు

  • 33శాతం మహిళా కోటా అమలు.. ఎల్లుండి నుంచి జూన్‌ 6 వరకు దరఖాస్తుల ప్రక్రియ

  • ఆరు నెలల్లో పూర్తి చేయాలని నిర్ణయం.. 2023లో ఫీజు కట్టిన వారికీ వెసులుబాటు

అమరావతి, మే 15(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన జాబ్‌ క్యాలెండర్‌ అమలు ప్రక్రియ ప్రారంభమైంది. నిరుద్యోగులకు ఇచ్చిన హామీలో భాగంగా ఈ ఏడాది మార్చి 18న ప్రభుత్వం జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేసింది. 4 విడతల్లో నోటిఫికేషన్లు ప్రకటించనున్నట్లు వెల్లడించింది. దీనిలో తొలి విడతగా యూనివర్సిటీల్లోని పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు వెలువడ్డాయి. శుక్రవారం 19 యూనివర్సిటీలు రెగ్యులర్‌, బ్యాక్‌ లాగ్‌ పోస్టుల భర్తీకి 64 నోటిఫికేషన్లు ప్రకటించాయి. మొత్తం 1,523 పోస్టులను ఈ నోటిఫికేషన్ల ద్వారా భర్తీ చేయనున్నారు. వీటిలో 1,244 రెగ్యులర్‌ పోస్టులు, 279 బ్యాక్‌లాగ్‌ పోస్టులు ఉన్నాయి. ఈ నోటిఫికేషన్లను ఆయా విశ్వవిద్యాలయాలు రెగ్యులర్‌, బ్యాక్‌లాగ్‌, పోస్టుల ఆధారంగా వేర్వేరుగా ప్రకటించాయి. అయితే, దరఖాస్తులకు మాత్రం ఉన్నత విద్యాశాఖ ఉమ్మడి పోర్టల్‌ను రూపొందించింది. http://apuniversitiesrecruitment.apcfss.in ఈ పోర్టల్‌ ద్వారా అభ్యర్థులు దరఖాస్తు చేసుకుని ఫీజు చెల్లించాలి. ఈ నెల 18 నుంచి జూన్‌ 8 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు సమర్పించి, ఫీజు చెల్లించవచ్చు. దరఖాస్తు, ఇతర అవసరమైన సర్టిఫికెట్ల హార్డ్‌ కాపీలను సంబంధిత విశ్వవిద్యాలయాలకు జూన్‌ 15 నాటికి అభ్యర్థులు పంపాలి. ఆ దరఖాస్తులను పరిశీలించి అర్హతల ఆధారంగా అర్హుల ప్రాథమిక జాబితాలను జూన్‌ 22న ప్రకటిస్తారు. వాటిపై అభ్యర్థులు 29 వరకు వినతులు సమర్పించవచ్చు. 30న అర్హుల జాబితాలు ప్రకటిస్తారు. 2023లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఇప్పుడు కూడా దరఖాస్తు చేసుకుంటే అప్పుడు కట్టిన ఫీజును సర్దుబాటు చేస్తారు.


పోస్టుల భర్తీ హారిజంటల్‌ రిజర్వేషన్‌ ప్రాతిపదికన జరుగుతుంది. కాగా, అన్ని పోస్టుల్లోనూ 33శాతం మహిళా కోటాను అమలు చేయనున్నారు. అలాగే, దివ్యాంగులకు 4శాతం, ఎక్స్‌ సర్వీస్‌మెన్‌కు 2శాతం, స్పోర్ట్స్‌ కోటాకు 3శాతం రిజర్వేషన్‌ వర్తిస్తుంది. రోస్టర్‌పై గత వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన జీవో 77ను యథావిధిగా అమలు చేస్తున్నారు. 2023లో ఇచ్చిన నోటిఫికేషన్లను ప్రభుత్వం ఇటీవల ఉపసంహరించుకుంది. దీంతో అప్పట్లో దరఖాస్తు చేసుకున్నవారు ఇప్పుడు కొత్తగా దరఖాస్తు చేసుకోవాలి. ఈ మొత్తం ప్రక్రియను ఆరు నెలల వ్యవధిలో పూర్తిచేసి నియామకాలు చేపట్టనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.


57.44 శాతం పోస్టులు భర్తీ

యూనివర్సిటీలు తాజాగా ప్రకటించిన నోటిఫికేషన్ల ద్వారా మొత్తంగా విశ్వవిద్యాలయాల్లోన 57.44 శాతం మేరకు పోస్టుల భర్తీ జరుగుతుంది. యూనివర్సిటీల్లో మొత్తం 4,343 పోస్టులున్నాయి. ప్రస్తుతం 972 మంది పనిచేస్తున్నారు. ఇప్పుడు 1,523 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ ప్రక్రియ పూర్తయితే 2,495 పోస్టులు నిండుతాయి. ఇంకా 1,848 ఖాళీలు మిగులుతాయి. అంటే సగానికి పైగా పోస్టుల భర్తీ జరుగుతుంది. దీంతో యూనివర్సిటీల్లో బోధన బలోపేతం అవుతుందని, నాణ్యత పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

Updated Date - May 16 , 2026 | 04:11 AM