Share News

కొలువుల జాతర

ABN , Publish Date - Aug 23 , 2026 | 04:14 AM

ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం మరో తీపి కబురు చెప్పింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన జాబ్‌ క్యాలెండర్‌ హామీని నిలబెట్టుకునే దిశగా మరో అడుగు ముందుకు వేసింది.

కొలువుల జాతర

  • 4 విడతల్లో మరో 10,060 పోస్టుల భర్తీ

  • గ్రూప్‌-1.. 149, గ్రూప్‌-2.. 673 ఉద్యోగాలు

  • హోం, విపత్తులు, అగ్నిమాపక శాఖల్లో 2226

  • అన్ని శాఖల్లో ఏఈఈ పోస్టులు 1182

  • పంచాయతీరాజ్‌, మున్సిపల్‌, రెవెన్యూ, విద్యుత్‌, ఆర్థిక, జలవనరులు, సంక్షేమ శాఖల్లోనూ ఖాళీలు

  • ఉద్యోగ నియామకాలకు ప్రభుత్వం అనుమతి

  • జాబ్‌ క్యాలెండర్‌-2026కు గ్రీన్‌ సిగ్నల్‌

అమరావతి, ఆగస్టు 22 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం మరో తీపి కబురు చెప్పింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన జాబ్‌ క్యాలెండర్‌ హామీని నిలబెట్టుకునే దిశగా మరో అడుగు ముందుకు వేసింది. మొత్తం 10,060 పోస్టులు భర్తీ చేయడానికి జాబ్‌ క్యాలెండర్‌-2026కు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ప్రత్యక్ష నియామక పోస్టులను నాలుగు విడతల్లో భర్తీ చేయనుంది. శనివారం ప్రభుత్వం ఈ మేరకు అనుమతిస్తూ జీవో 81 జారీ చేసింది. గ్రూప్‌-1లో 149 ఉద్యోగాలు, గ్రూప్‌-2లో 673 ఉద్యోగాలు భర్తీ చేయనుంది. మొదటి విడతలో 1523 పోస్టుల భర్తీకి ఉన్నత విద్యా శాఖ ఇప్పటికే మే 15న నోటిఫికేషన్‌ విడుదల చేసింది. సెప్టెంబరు-15న రెండో విడత, అక్టోబరు 15న మూడు, నాలుగో విడత నోటిఫికేషన్లు జారీ చేయనుంది. టీచర్‌ పోస్టులు సహా పంచాయతీరాజ్‌, మున్సిపల్‌, రెవెన్యూ, విద్యుత్‌, ఆర్థిక, జలవనరులు, అటవీ, సంక్షేమ శాఖల్లో ఖాళీలు భర్తీ చేయనుంది. హోం, విపత్తులు, అగ్నిమాపక శాఖల్లో 2226, అన్ని శాఖల్లో ఏఈఈ పోస్టులు 1182 నియామకాలు చేపట్టనుంది. గత ఏడాది డీఎస్సీ నిర్వహించి 16 వేలమందికి పైగా టీచర్‌ ఉద్యోగాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. డీఎస్సీపై వైసీపీ నిరాధార ఆరోపణలతో బురదజల్లే ప్రయత్నం చేస్తున్నా... ఇచ్చిన హామీ మేరకు యువతకు మేలు చేయాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ముందుకు వెళుతోంది. తాజాగా జాబ్‌ క్యాలెండర్‌కు అనుమతిస్తూ జారీ చేసిన జీవోలో పేర్కొన్న వివరాల ప్రకారం నోటిఫికేషన్ల షెడ్యూల్‌, ఖాళీల వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

Updated Date - Aug 23 , 2026 | 04:16 AM