Share News

ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి

ABN , Publish Date - Aug 07 , 2026 | 05:16 AM

ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, వాటిని పరిష్కారానికి కృషి చేస్తామని ఏపీ ఎన్జీవో సంఘం, ఏపీ జేఏసీ చైర్మన్‌ అలపర్తి విద్యాసాగర్‌ తెలిపారు.

ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి

  • సీఎం సమక్షంలో జరిగే సమావేశంలో చర్చిస్తాం

  • ఏపీ జేఏసీ చైర్మన్‌ విద్యాసాగర్‌ వెల్లడి

అమరావతి, ఆగస్టు 6(ఆంధ్రజ్యోతి): ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, వాటిని పరిష్కారానికి కృషి చేస్తామని ఏపీ ఎన్జీవో సంఘం, ఏపీ జేఏసీ చైర్మన్‌ అలపర్తి విద్యాసాగర్‌ తెలిపారు. ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల పదవీ విరమణ వయసు 60 నుంచి 62 ఏళ్లకు పెంపుతో సహా ఇతర డిమాండ్లపై త్వరతో సీఎం చంద్రబాబు సమక్షంలో జరగనున్న సమావేశంలో చర్చిస్తామన్నారు. ప్రభుత్వ ఔట్‌ సోర్సింగ్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ రాష్ట్ర కార్యవర్గ సమావేశం గురువారం విజయవాడలోని ఎన్జీవో హోమ్‌లో జరిగింది. ఈ సందర్భంగా అసోసియేషన్‌ నాయకులు తమ సమస్యలు, న్యాయపరమైన డిమాండ్లపై విద్యాసాగర్‌కు వినతిపత్రం అందజేశారు. ఆయన మాట్లాడుతూ.. పీఆర్సీ చైర్మన్‌ నియామకం, ఐఆర్‌ మంజూరు, డీఏ బకాయిలు విడుదల, పెండింగ్‌ బిల్లులు చెల్లింపు, ఉపాధ్యాయులు, కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల సమస్యల పరిష్కారం వంటి విషయాలపై ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన ఉంటుందని ఆశిస్తున్నామని పేర్కొన్నారు. లేనిపక్షంలో తదుపరి కార్యాచరణకు జేఏసీ నాయకులు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. కార్యక్రమంలో గవర్నమెంట్‌ ఔట్‌ సోర్సింగ్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు పాణ్యం వేణు, ప్రధాన కార్యదర్శి అల్లం సురేష్ బాబు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Aug 07 , 2026 | 05:18 AM