Share News

రెండేళ్లు గడుస్తున్నా పీఆర్సీ వేయరా?

ABN , Publish Date - Jun 21 , 2026 | 05:13 AM

రెండేళ్లు గడుస్తున్నా వేతన సవరణ కమిషన్‌ వెయ్యరా? అని ఏపీ జేఏసీ చైర్మన్‌ ఎ.విద్యాసాగర్‌ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

రెండేళ్లు గడుస్తున్నా పీఆర్సీ వేయరా?

  • ఐక్య ఉద్యమాలకు వెనుకాడం: విద్యాసాగర్‌

విజయవాడ (గాంధీనగర్‌), జూన్‌ 20 (ఆంధ్రజ్యోతి): రెండేళ్లు గడుస్తున్నా వేతన సవరణ కమిషన్‌ వెయ్యరా? అని ఏపీ జేఏసీ చైర్మన్‌ ఎ.విద్యాసాగర్‌ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దీనిపై ప్రభుత్వం ముందుకు రాకుంటే ఉద్యమం తప్ప మరో మార్గం లేదని, ఐక్య ఉద్యమాలకు వెనుకాబోమని హెచ్చరించారు. ఉద్యోగ సంఘాల జాయింట్‌ యాక్షన్‌ కమిటీ సెక్రటేరియట్‌ సమావేశం విజయవాడలోని ఏన్జీవో హోంలో శనివారం జరిగింది. కూటమి ప్రభుత్వంపై ఉద్యోగులు పెట్టుకున్న ఆశలు నెరవేర్చేలా అడుగులు వేయాలని ప్రభుత్వాన్ని విద్యాసాగర్‌ కోరారు. తక్షణమే ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలన్నారు. పీఆర్సీని వెంటనే నియమించాలని డిమాండ్‌ చేశారు. గత ప్రభుత్వంలో ఉద్యోగులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని, కూటమి ప్రభుత్వంలో కొన్ని కీలక సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకున్నారని తెలిపారు. ఉద్యోగుల ప్రధాన డిమాండ్‌ పీఆర్సీ నియామకంపై ఇప్పటి వరకు ఎటువంటి నిర్ణయం తీసుకోకపోవడం ఆందోళన కలిగిస్తోందని, ఫలితంగా ఉద్యోగులు ఆర్ధికంగా నష్టపోతున్నట్టు చెప్పారు. జేఏసీ రాష్ట్ర సెక్రటరీ జనరల్‌ కె.ఎస్.ఎస్.ప్రసాద్‌ మాట్లాడుతూ పీఆర్సీ, ఇంటీరియమ్‌ రిలీఫ్‌, సరెండర్‌ లీవ్‌ తదితర అంశాలపై దృష్టి సారించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఉద్యోగుల సమస్యలపై జేఏసీ ఆధ్వర్యంలో సీఎస్‌కు వినతిపత్రం అందజేయాలని, జూలై 1 నుంచి 8 వరకు జిల్లా, తాలూకా జేఏసీ ప్రతినిధుల బృందం పార్లమెంట్‌ సభ్యులు, శాసనసభ్యులు, కలెక్టర్లకు వినతిపత్రాలు అందజేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందించకుంటే జూలై 26న జేఏసీ విస్తృత స్ధాయి సమావేశం ఏర్పాటు చేసి కార్యాచరణ చేయాలని తీర్మానించారు.

Updated Date - Jun 21 , 2026 | 05:16 AM