సంక్షోభంలోనూ అవకాశాల సృష్టి
ABN , Publish Date - Jun 07 , 2026 | 05:24 AM
అసలైన నాయకత్వం అంటే అనుకూల పరిస్థితుల కోసం ఎదురుచూడడం కాదని.. కష్టకాలంలో, ప్రతికూల, సంక్షోభాల సమయాల్లోనూ అవకాశాలను సృష్టించడమని రాష్ట్ర ఐటీ, ఎలకా్ట్రనిక్స్, విద్యా శాఖ మంత్రి లోకేశ్ పేర్కొన్నారు.
పెట్టుబడులతో యువతకు ఉపాధి కల్పిస్తాం
మాతృభూమి అభివృద్ధి ప్రయాణంలో
ఎన్‌ఆర్‌ఐలూ భాగస్వాములు కావాలి
ఏపీ బ్రాండ్ అంబాసిడర్లుగా ప్రవాసాంధ్రులు
రష్యా ఇండియన్ డయాస్పొరాలో మంత్రి పిలుపు
పలు కంపెనీలు, సంస్థల ప్రతినిధులతో భేటీలు
అమరావతి, జూన్ 6(ఆంధ్రజ్యోతి): అసలైన నాయకత్వం అంటే అనుకూల పరిస్థితుల కోసం ఎదురుచూడడం కాదని.. కష్టకాలంలో, ప్రతికూల, సంక్షోభాల సమయాల్లోనూ అవకాశాలను సృష్టించడమని రాష్ట్ర ఐటీ, ఎలకా్ట్రనిక్స్, విద్యా శాఖ మంత్రి లోకేశ్ పేర్కొన్నారు. పెట్టుబడులతో ఏపీ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో రష్యా పర్యటనకు వచ్చినట్లు చెప్పారు. లోకేశ్ శనివారం మాస్కోలో జరిగిన రష్యా ఇండియన్ డయాస్పొరా సమావేశంలో పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ భారత్-రష్యా బంధం విడదీయరానిదని, ఆనేక కీలక సమయాల్లో భారత్‌తో రష్యా కలసి పనిచేసిందని గుర్తుచేశారు. అంతర్జాతీయ వేదికపై దేశ కీర్తి ప్రతిష్ఠలను ప్రధాని మోదీ పెంచారని ప్రశంసించారు. రెండు దేశాల మధ్య దశాబ్దాలుగా ఉన్న స్నేహాకి మరింత పటిష్ఠం చేశారన్నారు. మాతృభూమి అభివృద్ధి ప్రయాణంలో ఎన్‌ఆర్‌ఐలు భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా లోకేశ్ పిలుపునిచ్చారు. రష్యాలోని ప్రవాస భారతీయులు భారత్‌లో పెట్టుబడులు పెట్టాలని, ప్రవాసాంధ్రులు ఏపీ బ్రాండ్ అంబాసిడర్లుగా పనిచేయాలని కోరారు. రష్యాలో నివసిస్తున్న ప్రవాస భారతీయులు, తెలుగువారిని కలిసేందుకు అవకాశం కల్పించిన మాస్కోలోని భారత రాయబారి కార్యాలయానికి కృతజ్ఞతలు తెలిపారు.
పెట్టుబడుల గమ్యస్థానంగా ఏపీ
భారత్‌లో పెట్టుబడుల గమ్యస్థానంగా ఏపీ నిలుస్తోందని లోకేశ్ పేర్కొన్నారు. రెన్యువబుల్ ఎనర్జీ, ఎలకా్ట్రనిక్స్ మాన్యుఫాక్చరింగ్, డేటా సెంటర్స్, లాజిస్టిక్స్, ఫుడ్ ప్రాసెసింగ్, ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాల్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయన్నారు. రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి అభివృద్ధి ఫలాలు చేరాలని ఆయన ఆకాంక్షించారు. డిజిటల్ పరివర్తన శక్తిని సీఎం చంద్రబాబు ముందే గ్రహించారని, రాష్ట్రంలో ఆయన పెట్టుబడులు, మౌలిక సదుపాయాలు, అవిష్కరణలు, ఉద్యోగాల సృష్టికర్తగా ఉన్నారని పేర్కొన్నారు. ఏపీలో నమో అంటే నాయుడు, మోదీ అని, ఇద్దరూ కలసి అభివృద్ధికి కృష్టి చేస్తున్నారన్నారు.
ఫార్మా యూనిట్ నిర్మాణాన్ని పూర్తి చేయండి
విశాఖపట్నాన్ని కామన్‌వెల్త్ ఇండిపెండెంట్ స్టేట్స్/రష్యా మార్కెట్లకు ఎక్స్‌పోర్టు హబ్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని లోకేశ్ ప్రకటించారు. శనివారం మాస్కోలో ఆర్‌ఎంఎం ఫార్మా డైరెక్టర్ ముఖేశ్‌కుమార్‌తో భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ డీప్ వాటర్ పోర్టుల ద్వారా ఫార్మా ఉత్పత్తుల ఎగుమతులను ప్రోత్సహిస్తామని పేర్కొన్నారు. సీఐఎస్ రీజియన్, రష్యా మార్కెట్లలో బలమైన ఎక్స్‌పోర్టు నెట్‌వర్క్ ఉన్న ఆర్‌ఎంఎం ఫార్మా రాష్ట్రాభివృద్ధికి దోహదపడాలని ఆహ్వానించారు. విశాఖను వ్యూహాత్మక లాజిస్టిక్స్ గేట్‌వేగా అభివృద్ధి చేయాలని భావిస్తున్నామని, పెద్దఎత్తున పోర్టు ఆధారిత మౌలిక సదుపాయాలను అందుబాటులోకి తీసుకువస్తున్నామని చెప్పారు. విశాఖలో నిర్మాణంలో ఉన్న ఆర్‌ఎంఎం ఫార్మా యూనిట్‌ను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని కోరారు. విశాఖలో రూ.200 కోట్ల తమ సంస్థ చేపట్టిన యూనిట్ పురోగతిలో ఉందని ముఖేశ్ కుమార్ చెప్పారు. ఈ యూనిట్ ద్వారా 500 మందికి ఉపాధి లభిస్తుందని, 2027 మార్చి నాటికి ఉత్పత్తి ప్రారంభమవుతుందని వెల్లడించారు..
అమరావతి, విశాఖల్లో స్మార్ట్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్
అమరావతి, విశాఖ నగరాల్లో స్మార్ట్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ చేపట్టాలని యాండెక్స్ సంస్థ ప్రతినిధులను లోకేశ్ కోరారు. రష్యన్ పారిశ్రామికవేత్తలు, మేనేజర్లు, ఫండ్ నిర్వాహకుల కన్సార్షియంతో ఏర్పాటైన యాండెక్స్ సంస్థ ఉన్నత స్థాయి బృందంతో సమావేశమయ్యారు. ఏపీ రాజధాని అమరావతి, విశాఖపట్నం ఏఐ డేటా సెంటర్ అంతటా యాండెక్స్ స్మార్ట్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ సిస్టమ్, ప్రిడిక్టివ్ ట్రాన్సిస్ట్ షెడ్యూలింగ్, కంప్యూటరైజ్డ్ పబ్లిక్ సేఫ్టీ అనలిటిక్స్‌ను అమలు చేయడంపై చర్చించారు. లాస్ట్-మైల్ రవాణా ఖర్చులు తగ్గించడానికి, భారతదేశంలో వేగంగా విస్తరిస్తున్న హైపర్-లోకల్ క్విక్ కామర్స్, డెలివరీ ఫ్లీట్‌ల్లోకి యాండెక్స్ అధునాతన వెహికల్ స్టోక్, ప్రిడిక్టివ్ రూటింగ్ సాఫ్ట్‌వేర్‌ను ఇంటిగ్రేట్ చేయడానికి గల అవకాశాలను పరిశీలించాలని కోరారు.
డ్రోన్ దాడుల నడుమే పెట్టుబడుల వేట
రష్యాలోని సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో జరిగిన ‘సెయింట్ పీటర్స్‌బర్గ్ ఇంటర్నేషనల్ ఎకనమిక్ ఫోరం-ఎ్‌సపీఐఈఎఫ్’ సదస్సులో పాల్గొనేందుకు ఈ నెల 2న ఆ దేశానికి వెళ్లిన మంత్రి లోకేశ్‌కు అక్కడ చిత్రమైన పరిస్థితి ఎదురైంది. లోకేశ్ రష్యా వెళ్లిన మరుసటి రోజే జూన్ 3న ఎస్‌పీఐఈఎఫ్ సదస్సుకు హాజరవుతున్న వివిధ దేశాలు, కంపెనీల ప్రతినిధులే లక్ష్యంగా ఉక్రెయిన్ డ్రోన్ల దాడి చేసింది. ఆ పరిస్థితుల్లో సదస్సుకు హాజరుకావడం భద్రతాపరంగా సరైన నిర్ణయం కాదని స్థానిక ఎంబసీ అధికారులు మంత్రికి సూచించారు. అయినా లోకేశ్ ఏ మాత్రం అవకాశం ఉన్నా సదస్సుకు హాజరుకావాల్సిందేనని తెలియజేయడంతో, ఎంబసీ అధికారులు సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుని, చివరికి తగిన జాగ్రత్తలతో సదస్సుకు వెళ్లాలని సూచించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించేందుకు వివిధ దేశాలకు వెళ్లిన లోకేశ్, రష్యాకు వెళ్లడం ఇదే తొలిసారి. భారతదేశం నుంచి ఎస్‌పీఐఈఎఫ్ సదస్సుకు ఏపీ మాత్రమే హాజరైంది.