Share News

ఉద్యోగాల కల్పనే లక్ష్యం

ABN , Publish Date - Mar 18 , 2026 | 05:02 AM

రాష్ట్రంలో యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పించడమే ఏకైక లక్ష్యం కావాలని, పెట్టుబడులు కార్యరూపం దాల్చేందుకు కృషి చేయాలని అధికారులకు రాష్ట్ర ఐటీ, విద్యా శాఖల మంత్రి లోకేశ్‌ సూచించారు.

ఉద్యోగాల కల్పనే లక్ష్యం

  • ప్రాజెక్టులు గ్రౌండింగ్‌ అయ్యేలా చూడాలి

  • త్వరలో ఉండవల్లి నుంచి సీడ్‌ యాక్సెస్‌ రోడ్‌

  • ఏపీఈడీబీ కార్యాలయం ప్రారంభోత్సవంలో లోకేశ్‌

మంగళగిరి సిటీ, మార్చి 17 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పించడమే ఏకైక లక్ష్యం కావాలని, పెట్టుబడులు కార్యరూపం దాల్చేందుకు కృషి చేయాలని అధికారులకు రాష్ట్ర ఐటీ, విద్యా శాఖల మంత్రి లోకేశ్‌ సూచించారు. మంగళగిరి బైపాస్‌ రోడ్డులోని మయూరి టెక్‌పార్కు ఐదో అంతస్తులో నూతనంగా ఏర్పాటు చేసిన ఏపీ ఎకనమిక్‌ డెవల్‌పమెంట్‌ బోర్డు (ఈడీబీ) కార్యాలయాన్ని మంగళవారం ఆయన ప్రారంభించారు. శిలాఫలకాన్ని ఆవిష్కరించాక కార్యాలయం మొత్తాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఏపీఈడీబీ ఉద్యోగులకు దిశానిర్దేశం చేశారు. గత ప్రభుత్వం ఏపీఈడీబీని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందన్నారు. కూటమి ప్రభుత్వం 20 నెలల కాలంలోనే పెద్దఎత్తున పెట్టుబడులు సాధించిందని చెప్పారు. దేశానికి రూ.వంద పెట్టుబడులు వస్తే అందులో 25 రూపాయలు ఏపీకే వచ్చాయని తెలిపారు. గూగుల్‌, ఆర్సెలార్‌ మిట్టల్‌, టీసీఎస్‌, కాగ్నిజెంట్‌ వంటి ప్రపంచ స్థాయి సంస్థలు ఏపీని ఎంచుకున్నాయని, ఇప్పుడు మనం మరింత వేగం పెంచాల్సిన అవసరం ఉందని చెప్పారు. రిలయన్స్‌ సీజీబీ ప్రాజెక్టుతో పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు వస్తాయన్నారు. ఎన్ని ఉద్యోగాలు కల్పించామన్నదే ముఖ్యమన్నారు. ఉద్యోగాల కల్పనే సింగిల్‌ ఎజెండాగా ఉండాలని స్పష్టం చేశారు. నూతన పెట్టుబడులు ఆకర్షించడంతో పాటు ఇప్పటికే ఒప్పందాలు కుదుర్చుకున్న ప్రాజెక్టుల గ్రౌండింగ్‌ కూడా ప్రధానమని చెప్పారు. ఉద్యోగులు తమకు కేటాయించిన క్లస్టర్లలో నిపుణులుగా మారాలన్నారు. ఒప్పందం కుదుర్చుకున్న ఏ ప్రాజెక్టూ ఇతర రాష్ట్రాలకు వెళ్లకూడదని స్పష్టం చేశారు. అధికారులు, సిబ్బంది ఉన్నతంగా ఆలోచించి రాష్ట్రాభివృద్ధికి తోడ్పడాలని దిశానిర్దేశం చేశారు.


ఈ నెల 23న రెండో స్టీల్‌ సిటీకి శంకుస్థాపన చేస్తున్నామని, ఇంతటితో తృప్తి పడకుండా ఐదు స్టీల్‌ సిటీలు ఎందుకు నిర్మించకూడదు? అనే ఆలోచనతో ముందుకు సాగాలన్నారు. అమరావతి పనులు వేగంగా జరుగుతున్నాయని, ఏప్రిల్‌ చివరి నాటికి ఉండవల్లి నుంచి సీడ్‌ యాక్సిస్‌ రోడ్డు అందుబాటులోకి వస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఎ్‌సఎంఈ, సెర్ప్‌ శాఖల మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌, పరిశ్రమల శాఖ కార్యదర్శి ఎన్‌.యువరాజ్‌, ఏపీఈడీబీ సీఈవో సాయికాంత్‌ వర్మ, ఏపీఐఐసీ చైర్మన్‌ ఎం.అభిషిక్త్‌ కిశోర్‌, జిల్లా కలెక్టర్‌ తమీమ్‌ అన్సారియా, ఉన్నతాధికారులు ఎంటీ కృష్ణబాబు, సౌరభ్‌ గౌర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 18 , 2026 | 05:02 AM