Share News

డేటా సెంటర్లకు జోష్‌!

ABN , Publish Date - Apr 23 , 2026 | 04:04 AM

డేటా సెంటర్ల ఏర్పాటును ప్రోత్సహించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. భారీ పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో అర్హత కలిగిన స్ట్రాటజిక్‌ డేటా సెంటర్లకు డీమ్డ్‌ డిస్ట్రిబ్యూషన్‌ లైసెన్సు .....

డేటా సెంటర్లకు జోష్‌!

  • డీమ్డ్‌ డిస్కం లైసెన్స్‌ పాలసీ తీసుకొచ్చిన ప్రభుత్వం

  • 300 మెగావాట్లు పైబడిన డేటా సెంటర్లకు డీమ్డ్‌ డిస్కం హోదా

  • 51 శాతం విద్యుత్తును పునరుత్పాదక వనరుల నుంచే కొనాలి

  • డేటా సెంటర్లను ప్రోత్సహించే లక్ష్యంతో కొత్త పాలసీ

అమరావతి, ఏప్రిల్‌ 22(ఆంధ్రజ్యోతి): డేటా సెంటర్ల ఏర్పాటును ప్రోత్సహించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. భారీ పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో అర్హత కలిగిన స్ట్రాటజిక్‌ డేటా సెంటర్లకు డీమ్డ్‌ డిస్ట్రిబ్యూషన్‌ లైసెన్సు (డీడీఎల్‌) మంజూరు చేసేందుకు నూతన విధానాన్ని ఖరారు చేస్తూ బుధవారం జీవో 32 జారీ చేసింది. విశాఖలో ఏర్పాటుకానున్న గూగుల్‌ డేటా సెంటర్‌కు సీఎం చంద్రబాబు 28న శంకుస్థాపన చేయనున్నారు. దీనికి ‘డీమ్డ్‌ డిస్కం’ హోదా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా ప్రత్యేక పాలసీకి రూపకల్పన చేసి ఉత్తర్వులు జారీ చేసింది. డేటా సెంటర్ల ఏర్పాటుకు రాష్ట్రంలో విస్తృత అవకాశాలున్నాయి. రాయలసీమలో సోలార్‌, విండ్‌ ఎనర్జీ ప్రాజెక్టులు భారీ ఎత్తున ఏర్పాటవుతున్న నేపథ్యంలో డేటా సెంటర్లకు కీలకమైన నిరంతర విద్యుత్‌ అందించడం పెద్దకష్టమేమీ కాదని ప్రభుత్వం భావిస్తోంది. విశాఖలో ఉన్న సబ్‌మెరైన్‌ కేబుల్‌ ల్యాండింగ్‌ పాయింట్లు, పోర్టు కనెక్టివిటీ, అనంతపురం - కర్నూలు ప్రాంతాల్లో ఉన్న అపారమైన సోలార్‌, పవన్‌ విద్యుత్‌ సామర్థ్యం వంటి సానుకూల అంశాలను వాడుకుంటూ ఏపీని డిజిటల్‌ మౌలిక సదుపాయాల హబ్‌గా మార్చాలనే కృతనిశ్చయంతో ఉంది. అందులో భాగంగా డీమ్డ్‌ డిస్కం లైసెన్సు పాలసీని తీసుకొచ్చింది. రానున్న రోజుల్లో మరిన్ని డేటా సెంటర్లను రాష్ట్రానికి ఆకర్షించేందుకు.. 300మెగావాట్ల సామర్థ్యానికి మించిన డేటా సెంటర్లన్నింటికీ డీమ్డ్‌ డిస్కం హోదా ఇవ్వాలని నిర్ణయించింది. ఈ విధానంతో రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు రావడమే కాకుండా ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని ప్రభుత్వం భావిస్తోంది.


పాలసీలో ముఖ్యమైన అంశాలు..

  • 300 మెగావాట్లు, అంతకంటే ఎక్కువ విద్యుత్‌ లోడ్‌ కలిగిన డేటాసెంటర్‌ ప్రాజెక్టులకు మాత్రమే డీమ్డ్‌ డిస్కం లైసెన్సు లభిస్తుంది.

  • ఒకే పెట్టుబడిదారు వివిధ ప్రాంతాల్లో ఉన్న తమ డేటా సెంటర్ల సామర్థ్యాన్ని కలిపి ఈ 300 మెగావాట్ల పరిమితిని చేరుకోవచ్చు.

  • లైసెన్సు పొందినవారు తమ ప్రాజెక్టు సరిహద్దుల్లో సొంతంగా విద్యుత్తు పంపిణీ నెట్‌వర్క్‌ అభివృద్ధి చేసుకుని, నిర్వహించుకోవచ్చు. తమకు కావాల్సిన విద్యుత్తును పునరుత్సాదక ఇంధన వనరులు, ఓపెన్‌ యాక్సెస్‌ లేదా పవర్‌ ఎక్స్ఛేంజి వంటి ఏ చట్టబద్ధమైన మార్గం ద్వారానైనా కొనుగోలు చేసుకునే వెసులుబాటు ఉంది. ఈ విద్యుత్తు సరఫరా కేవలం ఆ డేటా సెంటర్‌ పరిధిలోని లోడ్లకు మాత్రమే పరిమితం కావాలి. బయటి వ్యక్తులకు విద్యుత్తును విక్రయించకూడదు.

  • పర్యావరణ హితానికి ప్రాధాన్యతనిస్తూ డేటా సెంటర్లు తమ మొత్తం విద్యుత్తు అవసరాల్లో కనీసం 51 శాతం విద్యుత్తును తప్పనిసరిగా పునరుత్పాదక ఇంధన వనరుల నుంచే పొందాలి. ఈ లైసెన్సుదారు రాష్ట్రం నుంచే కాకుండా దేశం నలుమూలల నుంచి విద్యుత్తును కొనుగోలు చేసే అవకాశం లభిస్తుంది.

  • కొత్తగా వచ్చే గ్రీన్‌ఫీల్డ్‌ డేటా సెంటర్లకు మాత్రమే ఈ లైసెన్సు వర్తిస్తుంది. దీనివల్ల ప్రస్తుత డిస్కం వినియోగదారులు ఎవరూ డీడీఎల్‌కి మారడానికి అవకాశం ఉండదు. తద్వారా డిస్కంల ఆదాయానికి గండి పడకుండా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంది. ఒకవేళ డేటా సెంటర్‌కు అదనంగా బ్యాకప్‌ విద్యుత్తు కావాల్సి వస్తే ఏపీఈఆర్సీ నిబంధనల ప్రకారం డిస్కంల నుంచి స్టాండ్‌బై విద్యుత్తు పొందవచ్చు.


పలు రాష్ట్రాల్లో డీమ్డ్‌ డిస్ట్రిబ్యూషన్‌ లైసెన్స్‌ పాలసీ

డేటా సెంటర్లు, సెజ్‌లు, భారీ పారిశ్రామిక ప్రాంతాల కోసం డీమ్డ్‌ డిస్ట్రిబ్యూషన్‌ లైసెన్సు విధానాన్ని చాలా రాష్ట్రాలు ఇప్పటికే అమలు చేస్తున్నాయి. యూపీ ప్రభుత్వం 2021లోనే డేటా సెంటర్‌ పాలసీ-2021ని తీసుకొచ్చింది. గ్రేటర్‌ నోయిడా వంటి ప్రాంతాల్లో డేటా సెంటర్ల కోసం ప్రత్యేక విద్యుత్తు పంపిణీ ఏర్పాట్లను అనుమతిస్తోంది. మహారాష్ట్రలో పలు సెజ్‌లకు డీడీఎల్‌లు ఇచ్చారు. కర్ణాటకలో మంగళూరు సెజ్‌, ఏఈక్యూయూఎస్‌ సెజ్‌ వంటి సంస్థలు డీమ్డ్‌ డిస్కంల లైసెన్సీలుగా ఉన్నాయి. గుజరాత్‌ గిఫ్ట్‌ సిటీతోపాటు పలు సెజ్‌లకు, అదానీ పోర్ట్స్‌, ముంద్రా సెజ్‌కు డీమ్డ్‌ డిస్క హోదా ఉంది. తమిళనాడు, మధ్యప్రదేశ్‌, హరియాణా కూడా ఈ పాలసీని అమలు చేస్తున్నాయి.

గూగుల్‌కు డీమ్డ్‌ డిస్కం హోదా

విశాఖలో ఏర్పాటు చేస్తున్న గూగుల్‌ డేటా సెంటర్‌ నిరంతరాయంగా నడవాలంటే దానికి 1 గిగావాట్‌ విద్యుత్తు అవసరం. దీన్ని గ్రిడ్‌ నుంచి తీసుకుంటే భారీగా ఖర్చవ్వడమే కాకుండా గ్రిడ్‌ స్థిరత్వంపైనా ప్రభావం పడుతుంది. దీంతో ఈ డేటా సెంటర్‌ సొంతంగా తన విద్యుత్తు అవసరాలను తీర్చుకునే వెసులుబాటు కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు గూగుల్‌ అనుబంధ సంస్థ అయిన రైడన్‌ ఇన్ఫోటెక్‌ ద్వారా డీమ్డ్‌ డిస్ట్రిబ్యూషన్‌ (డీమ్డ్‌ డిస్కం) లైసెన్సు జారీ చేయాలని నిర్ణయించింది. దానికి అనుగుణంగానే తాజా డీమ్డ్‌ డిస్ట్రిబ్యూషన్‌ లైసెన్సు పాలసీని తీసుకొచ్చింది.

Updated Date - Apr 23 , 2026 | 04:04 AM