Share News

1.83 లక్షల మందికి మార్కులు మెరుగు

ABN , Publish Date - Jun 19 , 2026 | 05:06 AM

ఇంటర్మీడియట్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరం సప్లిమెంటరీ ఫలితాలను మంత్రి లోకేశ్‌ గురువారం ఎక్స్‌లో విడుదల చేశారు. ఫస్టియర్‌ విద్యార్థులు 94,520 మంది సప్లిమెంటరీ పరీక్షలు రాయగా..

1.83 లక్షల మందికి మార్కులు మెరుగు

  • సెకండియర్‌లో 47,731 మందికి పెరిగిన మార్కులు

  • ఇంటర్‌ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల

  • ఫస్టియర్‌లో 38 శాతం.. సెకండియర్‌లో 55 శాతం ఉత్తీర్ణత

  • 26 వరకు రీకౌంటింగ్‌, రీవెరిఫికేషన్‌కు దరఖాస్తు

అమరావతి, జూన్‌ 18 (ఆంధ్రజ్యోతి): ఇంటర్మీడియట్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరం సప్లిమెంటరీ ఫలితాలను మంత్రి లోకేశ్‌ గురువారం ఎక్స్‌లో విడుదల చేశారు. ఫస్టియర్‌ విద్యార్థులు 94,520 మంది సప్లిమెంటరీ పరీక్షలు రాయగా 35,537 (38శాతం) మంది ఉత్తీర్ణులయ్యారు. 92,418 మంది రెండో సంవత్సరం పరీక్షలు రాయగా.. 50,944 (55శాతం) మంది ఉత్తీర్ణత సాధించారు. ఈ ఏడాది తొలిసారిగా సెకండియర్‌ విద్యార్థులకు కూడా ఇంప్రూవ్‌మెంట్‌కు అవకాశం కల్పించారు. దీంతో సెకండియర్‌ జనరల్‌ విద్యార్థుల్లో 47,731 మంది తమ మార్కులు మెరుగుపరుచుకున్నారు. ఇది వారి ఈఏపీసెట్‌ ర్యాంకులపై ప్రభావం చూపి మెరుగైన ర్యాంకులు వచ్చే అవకాశం ఉంది. ఫస్టియర్‌ విద్యార్థులు 2,29,034 మంది ఇంప్రూమెంట్‌ కోసం పరీక్షలు రాయగా.. 1,35,435 మంది మార్కులు మెరుగుపడ్డాయి. పబ్లిక్‌ పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థులు... ఫెయిలైన సబ్జెక్టులతో పాటు పాసైన వాటిలోనూ కొన్నిటికి ఇంప్రూవ్‌మెంట్‌ రాశారు. వారిలో ఫస్టియర్‌లో అబ్బాయిలు 22,748 (37శాతం), అమ్మాయిలు 19,626 (51శాతం).. సెకండియర్‌లో అబ్బాయిలు 33,774 (57శాతం), అమ్మాయిలు 23,553 (56శాతం) ఉత్తీర్ణత సాధించి, మార్కులు మెరుగుపరుచుకున్నారు. రీకౌంటింగ్‌, రీవెరిఫికేషన్‌కు ఈనెల 19 నుంచి 26 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని ఇంటర్‌ విద్యామండలి తెలిపింది.

Updated Date - Jun 19 , 2026 | 05:08 AM