అరగంట ముందే పరీక్షా కేంద్రానికి!
ABN , Publish Date - Feb 23 , 2026 | 04:27 AM
రాష్ట్రవ్యాప్తంగా సోమవారం నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. పరీక్షలు సమర్థవంతంగా నిర్వహించేందుకు ఇంటర్‌బోర్డు ఏర్పాట్లు చేసింది.
నేటి నుంచే ఇంటర్ పరీక్షలు
రాష్ట్ర వ్యాప్తంగా 1,537 పరీక్షా కేంద్రాలు
పరీక్షలు రాయనున్న 10.57 లక్షల మంది విద్యార్థులు
అమరావతి, ఫిబ్రవరి 22(ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా సోమవారం నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. పరీక్షలు సమర్థవంతంగా నిర్వహించేందుకు ఇంటర్‌బోర్డు ఏర్పాట్లు చేసింది. మార్చి 24 వరకు జరిగే ఈ పరీక్షల కోసం 1,537 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. 45 కేంద్రాలను సున్నితమైన కేంద్రాలుగా గుర్తించారు. 10,57,899 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. మొదటి సంవత్సరం విద్యార్థులు 5,31,275 మంది, రెండో సంవత్సరం విద్యార్థులు 5,26,264 మంది ఉన్నారు. పరీక్ష ఉదయం 9 గంటలకు ప్రారంభమై 12 గంటల వరకు ఉంటుంది. విద్యార్థులు పరీక్షా కేంద్రానికి 8.30 గంటలకు చేరుకోవాలి. హాల్ టిక్కెట్ చూపి కేంద్రంలోకి ప్రవేశించాలి. ఇన్విజిలేటర్ ద్వారా పొందిన ఓఎంఆర్ బార్‌కోడ్ షీట్‌లోని వివరాలను సరిచూసుకోవాలి. పరీక్షల నిర్వహణ పరిశీలనలో భాగంగా ఇంటర్మీడియట్ విద్య ఉన్నతాధికారులు, ఇంటర్‌బోర్డు అధికారులు వివిధ హోదాల్లో పరీక్షా కేంద్రాలను సందర్శిస్తారు. వీరితో పాటు జిల్లా పరీక్షల కమిటీ అధికారులు, ప్లయింగ్ స్క్వాడ్ అధికారులు, సిటింగ్ స్క్వాడ్ అధికారులు పరీక్షా కేంద్రాలను తనిఖీ చేస్తారు. పరీక్షా కేంద్రాల్లోకి పెన్, పెన్సిల్, స్కెచ్‌పెన్స్, ఎరెజర్, గణిత పట్టికలు మాత్రమే అనుమతిస్తారు. ఇక, ఇంటర్‌బోర్డు పోలీసు, రెవెన్యూ, పాఠశాల విద్య, వైద్యఆరోగ్యం, పోస్టల్, ఆర్టీసీ, విద్యుత్ శాఖల సమన్వయంతో పరీక్షలను సజావుగా నిర్వహించేందుకు ఇంటర్ బోర్డు అన్ని చర్యలూ తీసుకుంది. పరీక్ష నిర్వహించే ప్రతి గదిలో, పరీక్షా కేంద్రం ప్రాంగణంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఈ విద్యాసంవత్సరంలో చేపట్టిన సంస్కరణల నేపథ్యంలో మొదటి సంవత్సరం గణితం, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఎకనమిక్స్, సివిక్స్, కామర్స్, హిస్టరీ సబ్జెక్టులకు 32 పేజీల సమాధాన పత్రాలు ఇస్తారు. మిగిలిన, బ్యాక్‌లాగ్ సబ్జెక్టులకు, రెండో సంవత్సరం అన్ని సబ్జెక్టులకూ 24 పేజీల బుక్‌లెట్‌ను అందిస్తారు. అడిషనల్ ఆన్సర్ షీట్లు ఇవ్వరు.