నేటి నుంచి ఇంటర్ తరగతులు
ABN , Publish Date - Apr 01 , 2026 | 04:58 AM
ఇంటర్మీడియట్ తరగతులు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. గతేడాది నుంచి ఇంటర్మీడియట్ విద్యా సంవత్సరాన్ని ఇంటర్ బోర్డు మార్చింది.
ఫస్టియర్ విద్యార్థులకు బ్రిడ్జి కోర్సు
23 వరకు క్లాసులు, తర్వాత సెలవులు
పుస్తకాలు లేకుండా బోధనెలా: జేఎల్స్
అమరావతి, మార్చి 31(ఆంధ్రజ్యోతి): ఇంటర్మీడియట్ తరగతులు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. గతేడాది నుంచి ఇంటర్మీడియట్ విద్యా సంవత్సరాన్ని ఇంటర్ బోర్డు మార్చింది. జూన్‌కు బదులుగా ఏప్రిల్ 1 నుంచే విద్యా సంవత్సరం ప్రారంభిస్తోంది. ఏప్రిల్ 23 వరకు తరగతులు నిర్వహించి, ఆ తర్వాత వేసవి సెలవులు ఇస్తున్నారు. జూన్ 1న కాలేజీలు తిరిగి ప్రారంభమవుతాయి. అదే విధానంలో ఈ ఏడాది కూడా ఏప్రిల్‌లోనే తరగతులు మొదలవుతున్నాయి. ఈ నెలలో బోధించాల్సిన పాఠ్యాంశాలపై ఇంటర్ బోర్డు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. ఫస్టియర్ విద్యార్థులకు బ్రిడ్జి కోర్సు నిర్వహిస్తారు. వారికి గణితం, ఫిజిక్స్, కెమిస్ర్టీ, బయాలజీ, సివిక్స్ సబ్జెక్టుల్లో ప్రాథమిక అంశాలను బోధిస్తారు. సెకండియర్ విద్యార్థులకు రెండేసి చాప్టర్లు బోధిస్తారు. వేసవి సెలవుల్లో విద్యార్థులు వాటిని చదువుకునేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. అయితే, పాఠ్యపుస్తకాలు లేకుండా బోధన ఎలా సాధ్యం? అని జూనియర్ లెక్చరర్లు(జేఎల్స్) ప్రశ్నిస్తున్నారు. గతేడాది ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులకు సిలబస్ మారింది. పుస్తకాలు లేకుండా ఎలా బోధించాలని జేఎల్స్ అంటున్నారు. ఇంటర్ విద్యా సంవత్సరం మార్పుపై కూడా వారిలో వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
6 నుంచి ఎస్‌ఏ-2 పరీక్షలు
సమ్మేటివ్ అసెస్‌మెంట్-2 పరీక్షలు ఈ నెల 6 నుంచి ప్రారంభం కానున్నాయి. ప్రాథమిక తరగతులకు 6 నుంచి 10వ తేదీ వరకు, 6-10 తరగతులకు 16వ తేదీ వరకు పరీక్షలు జరుగుతాయి. అనంతరం పాఠశాలలకు వేసవి సెలవులు ఇవ్వనున్నారు.