Share News

ఇంటర్‌ సెకండియర్‌లోనూ ‘ఇంప్రూవ్‌మెంట్‌’

ABN , Publish Date - Apr 19 , 2026 | 04:52 AM

ఇంటర్మీడియట్‌ రెండో సంవత్సరం విద్యార్థులు సైతం ఇకపై ఇంప్రూవ్‌మెంట్‌ పరీక్షలు రాయవచ్చని ఇంటర్‌ బోర్డు తెలిపింది. ఫస్టియర్‌ తరహాలో సెకెండియర్‌ విద్యార్థులకూ...

ఇంటర్‌ సెకండియర్‌లోనూ ‘ఇంప్రూవ్‌మెంట్‌’

  • పాసైన సబ్జెక్టుల్లో మార్కులు మెరుగుపరుచుకొనే చాన్స్‌

  • ఫెయిల్‌ అయినవారు ఉత్తీర్ణులయ్యే వరకూ సప్లిమెంటరీ

  • ప్రకటించిన ఇంటర్‌ బోర్డు కార్యదర్శి రంజిత్‌ బాషా

అమరావతి, ఏప్రిల్‌ 18(ఆంధ్రజ్యోతి): ఇంటర్మీడియట్‌ రెండో సంవత్సరం విద్యార్థులు సైతం ఇకపై ఇంప్రూవ్‌మెంట్‌ పరీక్షలు రాయవచ్చని ఇంటర్‌ బోర్డు తెలిపింది. ఫస్టియర్‌ తరహాలో సెకెండియర్‌ విద్యార్థులకూ ఈ అవకాశం కల్పిస్తున్నట్లు బోర్డు కార్యదర్శి పి.రంజిత్‌ బాషా శనివారం ఓ ప్రకటనలో వెల్లడించారు. ఇతర రాష్ర్టాల ఇంటర్‌ బోర్డులు అమలుచేస్తున్న విధానాలను పరిశీలించి, సంబంధిత భాగస్వామ్య పక్షాలతో చర్చించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. సప్లిమెంటరీ పరీక్షలతో పాటుగా ఫస్టియర్‌, సెకండియర్‌ విద్యార్థులకు ఉత్తీర్ణత సాధించిన సబ్జెక్టుల్లో మార్కులు మెరుగుపరుచుకోవడానికి అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ప్రాక్టికల్స్‌ పరీక్షలకు ఎలాంటి ఇంప్రూవ్‌మెంట్‌ అవకాశం ఉండదని స్పష్టం చేశారు. ప్రథమ, ద్వితీయ సంవత్సరాల్లో ఫెయి ల్‌ అయిన అభ్యర్థులు పరిమితి లేకుండా ఆయా సబ్జెక్టుల్లో ఉత్తీర్ణులయ్యేవరకూ సప్లిమెంటరీ పరీక్షలు రాసుకోవచ్చని తెలిపారు. ఇంప్రూవ్‌మెంట్‌, సప్లిమెంటరీ పరీక్షలకు రూ.600 ఫీజు తో పాటు ఒక్కో సబ్జెక్టుకు రూ.160 చొప్పున చెల్లించాల్సి ఉంటుందని వివరించారు. ఇటీవల పబ్లిక్‌ పరీక్షలు రాసిన అభ్యర్థులు అదే ఐడీ నంబరుతో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఏప్రిల్‌ 20 నుంచి 27 వరకూ సప్లిమెంటరీ, ఇంప్రూవ్‌మెంట్‌ పరీక్షలకు ఫీజులు చెల్లించవచ్చని పేర్కొన్నారు. ఈ మేరకు విద్యార్థులకు అవకాశం కల్పించాలని, దీనిపై విస్తృత ప్రచారం చేయాలని ఆదేశిస్తూ ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల ప్రిన్సిపాళ్లకు రంజిత్‌ బాషా ఆదేశాలు జారీ చేశారు.


కర్ణాటకలో మూడుసార్లు అవకాశం

ప్రస్తుత విధానంలో ఇంటర్‌ ఫస్టియర్‌ విద్యార్థులకు మాత్రమే ఇంప్రూవ్‌మెంట్‌ రాసుకునే అవకాశం ఉంది. అయితే కర్ణాటక, హరియాణా లాంటి రాష్ర్టాలు రెండో సంవత్సరం విద్యార్థులకూ ఇంప్రూవ్‌మెంట్‌ అవకాశం కల్పిస్తున్నాయి. కర్ణాటకలో మూడుసార్లు అవకాశం ఇచ్చి వాటిలో ఉత్తమ మార్కులను ప్రామాణికంగా తీసుకుంటున్నారు. దీనివల్ల మార్కులను మెరుగుపరచుకునే అవకాశం విద్యార్థులు లభిస్తోంది. జేఈఈ వంటి పరీక్షలు రాయడానికి 12వ తరగతిలో 75 శాతం మార్కులు ఉండాలి. దేశంలోని ఇతర ప్రముఖ విశ్వవిద్యాలయాల్లో అడ్మిషన్లు పొందాలంటే కనీసం 60 శాతం మార్కులు అవసరం. ఇంటర్‌లో మార్కులు తగ్గాయనే కారణంతో విద్యార్థుల ఆత్మహత్యలు పెరుగుతున్నందున పరీక్షలను మరింత సరళీకృతం చేయాలని జాతీయ విద్యా విధానం చెబుతోంది. ఈ నేపథ్యంలో విద్యార్థుల ఆత్మహత్యలు నివారించడంతో పాటు రాష్ట్రం నుంచి మరింతమంది విద్యార్థులు జాతీయ విద్యాసంస్థల్లో అడ్మిషన్లు సాధించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. గతంలోనూ రెండో సంవత్సరం విద్యార్థులు ఇంప్రూవ్‌మెంట్‌ రాసే అవకాశం ఉన్నా అది చాలా సంక్లిష్టంగా ఉంది. విద్యార్థి అన్ని సబ్జెక్టుల్లో వచ్చిన మార్కులు రద్దు చేసుకొని అన్ని పరీక్షలు తిరిగి రాయాలి. ప్రాక్టికల్స్‌కు కూడా మళ్లీ హాజరుకావాలి. ఆ విధానంలో రెండోసారి మార్కులు తక్కువగా వచ్చినా వాటినే ప్రామాణికంగా తీసుకుంటున్నారు. దీంతో గతేడాది 34 మంది సెకండియర్‌ విద్యార్థులు మాత్రమే ఇంప్రూవ్‌మెంట్‌ రాశారు. కొత్త విధానంలో రెండుసార్లు వచ్చిన మార్కుల్లో ఏవి ఎక్కువ ఉంటే వాటినే మెమోలో పొందుపరుస్తారు.

Updated Date - Apr 19 , 2026 | 04:53 AM