Share News

మెరుగుపడ్డా.. వెనుకబాటే

ABN , Publish Date - Apr 17 , 2026 | 04:36 AM

ఇంటర్మీడియట్‌లో రాష్ట్ర విద్యార్థులు భారీగా ఉత్తీర్ణత సాధిస్తున్నారు. ఉత్తీర్ణత శాతమూ పెరుగుతోంది. దాదాపుగా అన్ని మేనేజ్‌మెంట్ల కాలేజీల్లోనూ ఫలితాలు మెరుగుపడ్డాయి. గత 12 ఏళ్ల లో ఫస్టియర్‌లో అత్యధిక స్థాయి ఉత్తీర్ణత శాతం ఈ ఏడాది నమోదైంది.

మెరుగుపడ్డా.. వెనుకబాటే

  • ఇంటర్‌ ఫలితాల్లో అంతంత మాత్రంగానే ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలు

  • ఫస్టియర్‌లో 54 శాతం, సెకండియర్‌లో 68 శాతం ఉత్తీర్ణణ

  • రాష్ట్ర సగటు ఉత్తీర్ణత కంటే చాలా తక్కువ

  • హైస్కూల్‌ ప్లస్‌ల్లో అత్తెసరు ఫలితాలు

  • ఫస్టియర్‌లో 45 శాతం, సెకండియర్‌లో 57 శాతం పాస్‌

  • ఎయిడెడ్‌ కాలేజీల్లోనూ ఇదే పరిస్థితి

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

ఇంటర్మీడియట్‌లో రాష్ట్ర విద్యార్థులు భారీగా ఉత్తీర్ణత సాధిస్తున్నారు. ఉత్తీర్ణత శాతమూ పెరుగుతోంది. దాదాపుగా అన్ని మేనేజ్‌మెంట్ల కాలేజీల్లోనూ ఫలితాలు మెరుగుపడ్డాయి. గత 12 ఏళ్ల లో ఫస్టియర్‌లో అత్యధిక స్థాయి ఉత్తీర్ణత శాతం ఈ ఏడాది నమోదైంది. అయితే గతంలో కంటే ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలు, హైస్కూల్‌ ప్లస్‌లు, ఎయిడెడ్‌ కాలేజీల్లో సదుపాయాలు మెరుగుపడ్డా, ఫలితాల్లో మాత్రం మిగతా మేనేజ్‌మెంట్లు కంటే చాలా వెనుకబడ్డాయి. ఎయిడెడ్‌ కాలేజీలు మినహా మిగిలిన రెండు మేనేజ్‌మెంట్లు ప్రభుత్వ పరిధిలోనే ఉన్నాయి. ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో ఫస్టియర్‌ పరీక్షలు 49,600 మంది రాయగా, వారిలో 26,688 మంది ఉత్తీర్ణులయ్యారు. అంటే 54 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఇది 12 ఏళ్లలోనే అత్యధికం. అయితే ఫస్టియర్‌ రాష్ట్ర సగటు ఏకంగా 77 శాతం ఉంది. మొత్తం పది మేనేజ్‌మెంట్లలో ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల ఉత్తీర్ణత శాతం ఎనిమిదో స్థానంలో ఉంది. ఇక సెకండియర్‌ రాష్ట్ర ఉత్తీర్ణత సగటు ఏకంగా 81 శాతం ఉండగా, ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలు 68 శాతం ఉత్తీర్ణత శాతం సాధించాయి. 43,728 మంది పరీక్షలు రాస్తే 29,533 మంది ఉత్తీర్ణులయ్యారు. సెకండియర్‌ ఉత్తీర్ణతలోనూ ప్రభుత్వ కాలేజీలు ఎనిమిదో స్థానంలోనే నిలిచాయి. ఇక హైస్కూల్‌ ప్లస్‌ల ఫలితాలు మరీ దారుణంగా ఉన్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 364 హైస్కూల్‌ ప్లస్‌లు ఉన్నాయి. ఈ ఏడాది ఫస్టియర్‌లో 5,408 మంది పరీక్షలు రాయగా 2,451 (45శాతం), సెకండియర్‌లో 4,514 మంది రాస్తే 2,561 (57శాతం) మంది ఉత్తీర్ణులయ్యారు. ఈ ఫలితాలు చూస్తే హైస్కూల్‌ ప్లస్‌లలో భవిష్యత్‌ చేరికలపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇక ఎయిడెడ్‌ కాలేజీల్లో ఫస్టియర్‌ 46 శాతం, సెకెండియర్‌ 57 శాతం ఉత్తీర్ణత నమోదైంది.


గురుకులాల్లో అత్యుత్తమ ఫలితాలు

ప్రభుత్వ కాలేజీలు, హైస్కూల్‌ ప్లస్‌ల ఫలితాలకు భిన్నంగా ప్రభుత్వ పరిధిలోనే ఉన్న మిగిలిన మేనేజ్‌మెంట్లు మాత్రం టాప్‌ లేపుతున్నాయి. ఫస్టియర్‌లో బీసీ సంక్షేమ కాలేజీలు ఏకంగా 97 శాతం ఉత్తీర్ణత సాధించి ప్రైవేటు కంటే మెరుగైన ఫలితాలు సాధించాయి. ఆ తర్వాత ఏపీఆర్‌జేసీలు 92 శాతం, గిరిజన సంక్షేమ కాలేజీలు 90 శాతం ఉత్తీర్ణత పొందాయి. ద్వితీయ సంవత్సరంలో ఏపీఆర్‌జేసీలు అత్యధికంగా 95 శాతం ఉత్తీర్ణత సాధిస్తే.. ఆ తర్వాత స్థానాల్లో బీసీ సంక్షేమ కాలేజీలు, గిరిజన సంక్షేమ కాలేజీలు, సాంఘిక సంక్షేమ కాలేజీలు, కేజీబీవీలున్నాయి. గురుకులాలు ఇలాంటి ఫలితాలు నమోదు చేస్తుంటే ప్రభుత్వ కాలేజీలు, హైస్కూల్‌ ప్లస్‌లు మాత్రం ఎందుకు వెనకబడిపోతున్నాయనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రభుత్వ కాలేజీల ఉత్తీర్ణతలో విశాఖపట్నం జిల్లా వెనకబడిపోయింది. ఫస్టియర్‌లో పార్వతీపురం మన్యం జిల్లా 80 శాతంతో టాప్‌లో నిలిచింది. గుంటూరు 71 శాతం, అల్లూరి సీతారామరాజు 69 శాతం ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. విశాఖపట్నం జిల్లా 42 శాతంతో చివరన నిలిచింది. రెండో ఏడాదిలోనూ మన్యం 86 శాతంతో టాప్‌లో ఉంది. ఆ తర్వాత అల్లూరి సీతారామరాజు జిల్లా 79 శాతం, గుంటూరు 77 శాతంతో తర్వాత స్థానాల్లో నిలిచాయి. 56 శాతంతో విశాఖపట్నం జిల్లా చివరన నిలిచింది.


అన్నీ ఉన్నా ఎందుకీ పరిస్థితి?

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ కాలేజీలు చాలావరకు మెరుగుపడ్డాయి. మధ్యాహ్న భోజనం పథకాన్ని పునరుద్ధరించింది. విద్యార్థులకు ఉచితంగా పాఠ్యపుస్తకాలు అందిస్తోంది. పోటీ పరీక్షలకు కోచింగ్‌ ఇప్పిస్తోంది. మౌలిక సదుపాలనూ కల్పించింది. కాలేజీల సమయాన్ని కూడా గంటన్నర పాటు పెంచింది. ఈ చర్యలతో ఫలితాలు మెరుగుపడినా రాష్ట్ర సగటుతో పోలిస్తే ఇప్పటికీ వెనకబడిపోవడంపై ఆశ్చర్యం వ్యక్తం అవుతోంది.

Updated Date - Apr 17 , 2026 | 04:37 AM