3-4 రోజుల్లో ఇంటర్ ఫలితాలు!
ABN , Publish Date - Apr 14 , 2026 | 05:23 AM
ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలను మూడు, నాలుగు రోజుల్లో విడుదల చేసేందుకు ఇంటర్ బోర్డు కసరత్తు చేస్తోంది. మూల్యాంకనం ఇప్పటికే పూర్తి కాగా...
అమరావతి, ఏప్రిల్ 13 (ఆంధ్రజ్యోతి): ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలను మూడు, నాలుగు రోజుల్లో విడుదల చేసేందుకు ఇంటర్ బోర్డు కసరత్తు చేస్తోంది. మూల్యాంకనం ఇప్పటికే పూర్తి కాగా, అనంతర ప్రక్రియ కూడా ఓ కొలిక్కి వచ్చింది. దీంతో ఫలితాలను విడుదల చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు సమాచారం. కాగా, ఈ విద్యా సంవత్సరం నుంచి ఇంటర్మీడియట్‌లో ప్రవేశపెట్టిన కొత్త విధానం ప్రకారం 1359 మంది మొదటి సంవత్సరం విద్యార్థులు ‘అదనపు సబ్జెక్టు’ ఆప్షన్‌ను ఎంపిక చేసుకున్నారు. ఈ సబ్జెక్టు మార్కులను ఇంటర్ బోర్డు విడిగా చూపించనుంది. విద్యార్థులకు ఇచ్చే రెగ్యులర్ మార్కుల మెమోలో ఈ మార్కులు కలపరు. ఇంటర్మీడియట్ విద్యలో చేపట్టిన సంస్కరణల్లో భాగంగా 2025-26 విద్యా సంవత్సరం నుంచి ‘అదనపు సబ్జెక్టు’ అనే ఆప్షన్ వచ్చింది. కావాలనుకుంటే ఎంపీసీ వి ద్యార్థులు బయాలజీని, బైపీసీ విద్యార్థులు గణితంను ఎంపిక చేసుకొని, రెగ్యులర్ సబ్జెక్టులతో పాటు దీన్నీ చదువుకోవచ్చు. దీంతో రాష్ట్రవ్యాప్తం గా 1359 మంది విద్యార్థులు ఈ అదనపు సబ్జెక్టు ఎంపిక చేసుకున్నారు.
జూనియర్ లెక్చరర్ ఫలితాలు విడుదల
ఇంటర్మీడియట్ విద్యలో జూనియ ర్ లెక్చరర్ పోస్టుల భర్తీకి నిర్వహించిన పరీక్షల ఫలితాలను ఏపీపీఎస్సీ విడుదల చేసింది. ఒక ఒడియా, మూడు కెమిస్ర్టీ, రెండు బోటనీ, ఒక సివిక్స్ సబ్జెక్టు పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేసి తుది ఫలితాలు విడుదల చేసినట్లు తెలిపింది.