Share News

ఇంటర్‌లో భారీ ఉత్తీర్ణత

ABN , Publish Date - Apr 16 , 2026 | 05:08 AM

ఇంటర్మీడియట్‌ ఫలితాల్లో భారీ ఉత్తీర్ణత నమోదైంది. ఫస్టియర్‌లో 77 శాతం, సెకెండియర్‌లో 81 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు.

ఇంటర్‌లో భారీ ఉత్తీర్ణత

  • ఫస్టియర్‌ 77 శాతం, సెకెండియర్‌ 81 శాతం పాస్‌.. ప్రథమ సంవత్సరంలో 12 ఏళ్లలో ఇదే అత్యధికం

అమరావతి, ఏప్రిల్‌ 15(ఆంధ్రజ్యోతి): ఇంటర్మీడియట్‌ ఫలితాల్లో భారీ ఉత్తీర్ణత నమోదైంది. ఫస్టియర్‌లో 77 శాతం, సెకెండియర్‌లో 81 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. గత 12 ఏళ్లలో ఫస్టియర్‌ ఫలితాల్లో ఇదే అత్యధిక ఉత్తీర్ణత కాగా, సెకెండియర్‌ ఫలితాల్లో రెండో అత్యధికం. ఇంటర్మీడియట్‌ ఫలితాలను మంత్రి లోకేశ్‌ బుధవారం ఎక్స్‌ వేదికగా విడుదల చేశారు. జనరల్‌ కేటగిరీలో ఫస్టియర్‌ విద్యార్థులు 4,71,864 మంది పరీక్షలు రాస్తే 3,61,526 మంది ఉత్తీర్ణులయ్యారు. ద్వితీయ సంవత్సరం పరీక్షలు 4,46,537 మంది రాయగా 3,59,816 మంది ఉత్తీర్ణత సాధించారు. ఒకేషనల్‌ కేటగిరీలో ప్రథమ సంవత్సరంలో 38,443 మందికిగాను 23,569(61శాతం) మంది, ద్వితీయ సంవత్సరంలో 33,852 మందికిగాను 25,151 (74శాతం) మంది ఉత్తీర్ణులయ్యారు. జనరల్‌ కేటగిరీలో ఫస్టియర్‌లో అమ్మాయిలు 81శాతం, అబ్బాయిలు 72శాతం ఉత్తీర్ణత సాధించారు. సెకెండియర్‌ ఫలితాల్లో అమ్మాయిలు 85శాతం, అబ్బాయిలు 76శాతం పాస్‌ అయ్యారు.


గురుకులాలే టాప్‌

మేనేజ్‌మెంట్ల వారీగా చూస్తే ఫలితాల్లో గురుకుల విద్యాసంస్థలే టాప్‌లో నిలిచాయి. ఫస్టియర్‌ ఫలితాల్లో బీసీ సంక్షేమ జూనియర్‌ కాలేజీలు 97శాతం ఉతీర్ణత సాధించాయి. ఆ తర్వాత ఏపీఆర్‌జేసీలు 92శాతం, గిరిజన సంక్షేమ కాలేజీలు 90శాతం, సాంఘికసంక్షేమ కాలేజీలు 87శాతం, కేజీబీవీలు 84శాతం ఉత్తీర్ణత నమోదు చేశాయి. హైస్కూల్‌ ప్లస్‌లు అత్యల్పంగా 45 శాతం, ఎయిడెడ్‌ కాలేజీలు 46శాతం మాత్రమే ఉత్తీర్ణత సాధించాయి. ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో ఏపీఆర్‌జేసీలు అత్యధికంగా 95శాతం ఫలితాలు సాధించాయి. బీసీ సంక్షేమ కాలేజీలు 94 శాతం, గిరిజన సంక్షేమ కాలేజీలు 93 శాతం, సాంఘిక సంక్షేమ కాలేజీలు 92 శాతం ఉత్తీర్ణత నమోదైంది. హైస్కూల్‌ ప్లస్‌లు, ఎయిడెడ్‌ కాలేజీలు 57 శాతంతో అట్టడుగున నిలిచాయి. జూనియర్‌ బైపీసీలో మొదటి, రెండు ర్యాంకులు బీసీ గురుకుల విద్యార్థులకే దక్కాయి. జూనియర్‌ సీఈసీలోనూ ఫస్ట్‌ర్యాంకు సొంతం చేసుకున్నారు. ఏడు గురుకులాల్లో సీనియర్‌ ఇంటర్లో వందశాతం ఫలితాలు సాధించారు. మూడు గురుకులాల్లో జూనియర్‌ ఇంటర్‌లో నూరుశాతం ఉత్తీర్ణత పొందారు. ఇంటర్‌ ఫలితాల్లో బీసీ గురుకులాల విజయభేరీపై మంత్రి సవిత హర్షం వ్యక్తం చేశారు. ఎస్సీ గురుకులాల్లో సీనియర్‌ ఇంటర్లో 3వేల మంది విద్యార్థులు 900కు పైగా మార్కులు సాధించారు. ప్రైవేట్‌ పాఠశాలలకు దీటుగా ఎస్సీ గురుకుల విద్యాసంస్థల విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించారని మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయస్వామి తెలిపారు.


ప్రథమంలో పెరిగి.. ద్వితీయంలో తగ్గింది

ఉత్తీర్ణతలో ఫస్టియర్‌ ఉత్తీర్ణత భారీగా పెరిగింది. గతేడాది 70 శాతం ఉంటే ఈ ఏడాది 77శాతానికి పెరిగింది. సెకెండియర్‌లో 83 శాతం నుంచి 81 శాతానికి తగ్గింది. కాగా ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల ఫస్టియర్‌ ఫలితాలు కూడా 12 ఏళ్లలో ఇవే అత్యధికం. ఈ ఏడాది 54 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. సెకెండియర్‌ విద్యార్థులు 68శాతం ఉత్తీర్ణత సాధించారు. 2021 కరోనా సమయంలో ఫలితాలను మినహాయిస్తే 12ఏళ్లలో ఇది రెండో అత్యధికం. జిల్లాల వారీగా చూస్తే ఫస్టియర్‌లో 90 శాతంతో కృష్ణాజిల్లా టాప్‌లో నిలిచింది. గుంటూరు 88శాతం, విశాఖపట్నం 85శాతం తర్వాత స్థానాల్లో నిలిచాయి. అన్నమయ్య జిల్లా 62 శాతంతో చివరన ఉంది. రెండో ఏడాది ఫలితాల్లోనూ 92శాతంతో కృష్ణాజిల్లానే టాప్‌లో కొనసాగింది. గుంటూరు 88శాతం, ఎన్టీఆర్‌ 87శాతం తర్వాత స్థానాలు దక్కించుకున్నాయి. అన్నమయ్య జిల్లా 67 శాతంతో ఆఖరున నిలిచింది.

గ్రూపుల వారీగా టాప్‌ మార్కులివే

ఎంపీసీలో ఫస్టియర్‌లో 469 మార్కులు అత్యధికంగా వచ్చాయి. సెకెండియర్‌లో 994 మార్కులు వచ్చాయి. బైపీసీలో ఫస్టియర్‌ 453, సెకెండియర్‌ 993 మార్కులొచ్చాయి. హెచ్‌ఈసీలో ఫస్టియర్‌ 495, సెకెండియర్‌ 983 మార్కులు వచ్చాయి. సీఈసీలో ఫస్టియర్‌ 496,సెకెండియర్‌ 983... ఎంఈసీలో ఫస్టియర్‌ 496, సెకెండియర్‌ 984 మార్కులు వచ్చాయి.


మే 21 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు

సప్లిమెంటరీ పరీక్షలు మే 21 నుంచి జూన్‌ 4వరకు జరుగుతాయని ఇంటర్‌ విద్య కమిషనర్‌ పి.రంజిత్‌ బాషా తెలిపారు. రీకౌంటింగ్‌, రీవెరిఫికేషన్‌ కోసం ఈ నెల 20 నుంచి 27 వరకు దరఖాస్తు గడువు అని పేర్కొన్నారు. సప్లిమెంటరీ పరీక్షలకు కూడా ఈ గడువులోనే దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఫస్టియర్‌ విద్యార్థులకు ఇంప్రూవ్‌మెంట్‌ రాసుకునే అవకాశం ఉందన్నారు. సప్లిమెంటరీ ప్రాక్టికల్స్‌ జూన్‌ 7నుంచి 11 వరకు జరుగుతాయన్నారు. ఎథిక్స్‌ అండ్‌ హ్యూమన్‌ వాల్యూస్‌ పరీక్ష జూన్‌ 5, పర్యావరణ విద్య పరీక్ష జూన్‌ 6న జరుగుతాయన్నారు.


రూపమే కాదు.. మార్కులూ ఒక్కటే

వీరఘట్టం/ఎల్‌ఎన్‌పేట, ఏప్రిల్‌ 15(ఆంధ్రజ్యోతి): ఇంటర్‌ ఫలితాల్లో ఓ విచిత్రం చోటుచేసుకుంది. రాష్ట్రంలో రెండు చోట్ల కవలలు ఒకేలా మార్కులు సాధించడం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. పార్వతీపురం మన్యం జిల్లా వీరఘట్టం మండలం రేగులపాడు కేజీబీవీలో ఇంటర్‌ (ఎంపీసీ) ప్రథమ సంవత్సరం చదువుతున్న దూపం చాందిని, చర్మిల 470 మార్కులకు గాను ఇద్దరూ 459 చొప్పున సాధించారు. వీరి తల్లిదండ్రులు కృష్ణారావు, రేణుక శ్రీకాకుళం పట్టణం పీఎన్‌ కాలనీలో నివసిస్తూ.. కూరగాయలు, బండిపై పండ్ల వ్యాపారం చేస్తూ పిల్లలను చదివిస్తున్నారు. ఇద్దరికీ ఒకేలా మార్కులు రావడం చాలా ఆశ్చర్యంగానూ, సంతోషంగానూ ఉందని అధ్యాపకులు ఆనందం వ్యక్తం చేశారు. అలాగే శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళం జిల్లా ఎల్‌ఎన్‌పేట మండలం కోవిలాం గ్రామానికి చెందిన కవలలైన భరత్‌ చరణ్‌, భవ్యశ్రీ విశాఖపట్నంలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్‌ ఎంపీసీ మొదటి సంవత్సరం చదువుతున్నారు. వీరిద్దరికీ 470 మార్కులకు 447 చొప్పున మార్కులు వచ్చాయి. వీరి తల్లిదండ్రులు శంభాన బాలకృష్ణ, రజని గ్రామంలో వ్యవసాయపనులు చేసుకుంటూ పిల్లలను చదివిస్తున్నారు.

Untitled-3 copy.jpg


సార్‌ డబ్బులు పెట్టా.. పాస్‌ అవుతానా?

అధికారులకు ఓ విద్యార్థి ఫోన్‌

ఇంటర్‌ ఫలితాల సందర్భంగా అధికారులకు ఓ విద్యార్థి చేసిన ఫోన్‌ కాల్స్‌ ఆసక్తికరంగా మారాయి. బుధవారం ఉదయం 10.30కు ఫలితాలు విడుదల కాగా 9 గంటల నుంచే ఓ విద్యార్థి ఇంటర్‌ విద్యాశాఖకు చెందిన ఓ అధికారికి అనేకమార్లు ఫోన్లు చేశాడు. ‘సర్‌ ఫస్టియర్‌లో రెండు సబ్జెక్టులు ఫెయిల్‌ అయ్యాను. ఇప్పుడు సెకెండియర్‌ ఫలితాలు వస్తున్నాయి. పాస్‌ అవుతానా లేదా? అనే టెన్షన్‌ తట్టుకోలేకపోతున్నా. ముందే కొంచెం నా రిజల్ట్‌ చెప్పండి సార్‌’ అంటూ ఫోన్‌లో ప్రాధేయపడ్డాడు. అలా ముందుగా ఫలితాలు చెప్పలేమని సదరు అధికారి బదులివ్వగా, ఎలాగైనా చెప్పాలని ఆ విద్యార్థి పదే పదే ఫోన్లు చేశాడు. చివరికి ఫెయిల్‌ అయితే తాను ఏదైనా చేసుకోవాల్సి వస్తుందంటూ కూడా బెదిరింపు ధోరణిలో మాట్లాడాడు. పాస్‌ చేయాలని కోరుతూ రూ. 2500 చొప్పున నగదును రెండు సబ్జెక్టుల సమాధాన పత్రాల మధ్యలో పిన్‌ చేసి పెట్టానని కూడా చెప్పడంతో అధికారులు అవాక్కయ్యారు. తీరా ఫలితాలు విడుదలయ్యాక ఆ విద్యార్థి హాల్‌ టికెట్‌ నంబరు చెక్‌ చేయగా ఐదు సబ్జెక్టులు ఫెయిల్‌ అయ్యాడు. దీంతో వెంటనే అప్రమత్తమైన ఆ అధికారి సంబంధిత జిల్లా ఇంటర్మీడియట్‌ అధికారికి ఫోన్‌ చేసి విద్యార్థి తల్లిదండ్రులతో మాట్లాడించారు. ఆ విద్యార్థి ఎలాంటి తొందరపాటు నిర్ణయం తీసుకోకుండా జాగ్రత్త వహించాలని సూచించారు.

Updated Date - Apr 16 , 2026 | 05:11 AM