ఇంటర్ విద్యార్థులకు కొత్త సిలబస్
ABN , Publish Date - Jun 05 , 2026 | 05:01 AM
ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఈ విద్యా సంవత్సరం (2026-27) నుంచి కొత్త సిలబ్‌సను అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ విద్యా సంవత్సరం నుంచి అమలు
కొత్త ప్రశ్నపత్రాల డిజైన్లు, మోడల్ పేపర్లు ఖరారు
అమరావతి, జూన్ 4 (ఆంధ్రజ్యోతి): ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఈ విద్యా సంవత్సరం (2026-27) నుంచి కొత్త సిలబ్‌సను అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇంటర్ ద్వితీయ సంవత్సరానికి సంబంధించి మొత్తం 14 ప్రధాన సబ్జెక్టులలో సవరించిన నూతన సిలబ్‌సను ఈ ఏడాది నుంచి పూర్తిస్థాయిలో అమలు చేయనున్నారు. ప్రథమ సంవత్సరం సిలబ్‌సలో మోడరన్ లాంగ్వేజెస్ కింద తెలుగు, ఉర్దూ సబ్జెక్టులకు సంబంధించిన అప్‌డేటెడ్ సిలబ్‌సను ప్రవేశపెట్టారు. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, జియోగ్రఫీ వంటి మైనర్ సబ్జెక్టుల సిలబ్‌సను కూడా సవరించారు. ఈ నూతన సిలబ్‌సకు అనుగుణంగా కొత్త ప్రశ్నపత్రాల డిజైన్లు, మోడల్ పేపర్లను ఇంటర్ బోర్డు ఖరారు చేసింది. సవరించిన పరీక్షల బ్లూ ప్రింట్ ఇంటర్ బోర్డు అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతామని, ఇప్పటికే అన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు సమాచారం అందించినట్లు ఇంటర్మీడియట్ విద్యామండలి డైరెక్టర్, సెక్రటరీ పి.రంజిత్ బాషా తెలిపారు. ఆయన గురువారం ఆర్జేడీలు, డీవీఈవోలు, ఆర్‌ఐవోలు, ప్రభుత్వ జూనియర్ కాలేజీల ప్రిన్సిపాళ్లతో వర్చువల్‌గా సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో నూతన సిలబస్ అమలు, విద్యా ప్రమాణాల పెంపు, సంస్కరణల అమలు, విద్యార్థుల అడ్మిషన్లు, స్పాట్ వాల్యుయేషన్ పక్రియలపై కీలకమైన ఆదేశాలు జారీ చేశారు.