Share News

ఆర్టీఐ పరిధిలోకి ఆలయాలు, మసీదులు, చర్చిలు

ABN , Publish Date - May 23 , 2026 | 05:16 AM

రాష్ట్రంలోని దేవాలయాలు, వక్ఫ్‌ సంస్థలు, మసీదులు, చర్చిలు వంటి మతపరమైన సంస్థలు సమాచార హక్కు చట్టం- 2005 పరిధిలోకి వస్తాయని ఏపీ సమాచార కమిషన్‌ చరిత్రాత్మక తీర్పును వెలువరించింది.

ఆర్టీఐ పరిధిలోకి ఆలయాలు, మసీదులు, చర్చిలు

అమరావతి, మే 22(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని దేవాలయాలు, వక్ఫ్‌ సంస్థలు, మసీదులు, చర్చిలు వంటి మతపరమైన సంస్థలు సమాచార హక్కు చట్టం- 2005 పరిధిలోకి వస్తాయని ఏపీ సమాచార కమిషన్‌ చరిత్రాత్మక తీర్పును వెలువరించింది. సమాచార కమిషన్‌ చీఫ్‌ ఇన్ఫర్మేషన్‌ కమిషనర్‌ వజ్జా శ్రీనివాసరావు నేతృత్వంలోని బెంచ్‌ ఈ మేరకు కీలక ఆదేశాలు జారీ చేసింది. విశాఖపట్నానికి చెందిన సమాజ సేవకుడు కేఎస్ఎన్‌ పట్నాయక్‌, స్థానిక బురుజుపేటలోని కనకమహాలక్ష్మీ అమ్మవారి దేవస్థానానికి సంబంధించి 2012లో నిర్వహించిన ఉత్సవాల వివరాలను కోరుతూ ఆర్టీఐ చట్టం కింద దరఖాస్తు చేశారు. అయితే ఈ చట్టం పరిధిలోకి రాదంటూ గతంలో హైకోర్టు ఇచ్చిన ఒక తీర్పును ఉటంకిస్తూ కోరిన సమాచారం ఇచ్చేందుకు ఆలయ పబ్లిక్‌ ఇన్ఫర్మేషన్‌ ఆఫీసర్‌ నిరాకరించారు. దీనిపై పట్నాయక్‌ రాష్ట్ర సమాచార కమిషన్‌ను ఆశ్రయించారు. దీనిపై విచారణ చేసిన కమిషన్‌ ఏపీ హిందూ ధార్మిక, దేవాదాయ చట్టం-1987 ప్రకారం దేవాలయాల ట్రస్ట్‌ బోర్డులు, కార్యనిర్వహణాధికారులు.. సిబ్బంది నియామకాలు, ఆలయ ఆస్తుల పర్యవేక్షణ అంతా ప్రభుత్వ నియంత్రణలోనే సాగుతున్నదని పేర్కొంది. వీటి పరిపాలనా వివరాలు సమాచార చట్టం పరిధిలోకి వస్తాయని సృష్టం చేసింది.

Updated Date - May 23 , 2026 | 05:16 AM