‘రియల్’ వ్యాపారం కోసం ఆర్టీఐ పిటిషన్లా?
ABN , Publish Date - Jul 09 , 2026 | 04:22 AM
తనకు సంబంధం లేకపోయినా పదే పదే పిటిషన్లు వేస్తున్న ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారిపై రాష్ట్ర సమాచార కమిషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇకపై ఆర్టీఐ కింద ఏ సమాచారం అడగడానికి వీల్లేదని..
గుంటూరు వ్యాపారి దరఖాస్తులన్నీ కొట్టివేత
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
తనకు సంబంధం లేకపోయినా పదే పదే పిటిషన్లు వేస్తున్న ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారిపై రాష్ట్ర సమాచార కమిషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇకపై ఆర్టీఐ కింద ఏ సమాచారం అడగడానికి వీల్లేదని అతనిపై కమిషనర్ పరవాడ సింహాచలం నాయుడు ఆదేశాలు జారీచేశారు. ఆ వివరాలు..గుంటూరు జిల్లా కాజాకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి సి. శశికుమార్ జిల్లా పరిధిలోని పలు రెవెన్యూ కార్యాలయాల్లో భారీగా ఆర్టీఐ దరఖాస్తులు ఇచ్చారు. అందులో 14 దరఖాస్తులకు సమాచారం ఇవ్వలేదని అప్పీల్ చేశారు. అయితే, తనకు సంబంధం లేని, ప్రజాప్రయోజనంతో ఏమాత్రం ముడిపడిలేని భూముల కేసుల్లో 1-బి రిజిస్టర్, ఆర్ ఎస్‌ఆర్, సప్లిమెంటరీ ఆర్‌ఎ్‌సఆర్, ఇనామ్ ఫెయిర్ రిజిస్టర్, భూములకు సంబంధించి 60 ఏళ్ల జమాబందీ లెక్కలు, సెట్వారీ, ఫసలీ పట్టె, ఇంకా కలెక్టరేట్, ఆర్డీఓ, తహశీల్దార్ ఆఫీసుల మధ్య వివిధ భూములపై జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాలు, అధికారిక కమ్యూనికేషన్, కోర్టుల ఉత్తర్వులు కావాలని దరఖాస్తులు సమర్పించినట్లుగా అధికారులు చెబుతున్నారు. వ్యక్తిగత ప్రమేయం లేని కేసుల్లో పదేపదే ఒకే ఫార్మాట్‌లో ఆర్టీఐ పిటిషన్లు వేస్తున్నారని అధికారులు సమాచార కమిషన్ దృష్టికి తెచ్చారు. ఈ అప్పీల్స్‌ను సమాచార కమిషనర్ సింహాచలం నాయుడు విచారించారు. శశికుమార్ దాఖలుచేసిన 14 అప్పీళ్లను కొట్టివేశారు.
ఆ ఆలయాలకు ఆర్టీఐ వర్తిస్తుంది
ఆంధ్రప్రదేశ్ చారిటబుల్ అండ్ హిందూ రిలిజియస్ ఇనిస్టిట్యూషన్స్ అండ్ ఎండోమెంట్ యాక్ట్-1987 పరిధిలోని ఆలయాలు ఆర్టీఐ పరిధిలోకి వస్తాయని రాష్ట్ర సమాచార కమిషన్ పునరుద్ఘాటించింది. అన్నవరం శ్రీవీరవెంకట సత్యనారాయణ స్వామి ఆలయం నుంచి సమాచారం కోరిన కేసు ఒకటి కమిషన్‌లో 2013 నుంచి పెండింగ్‌లో ఉంది. ఈ కేసు అప్పీల్‌ను రాష్ట్ర సమాచార కమిషనర్ గాజుల ఆదెన్న విచారించారు. ఈ సందర్భంగా పై ఆదేశాలు జారీ చేశారు.