Share News

పాడుబడుతున్న పారిశ్రామికవాడలు

ABN , Publish Date - Apr 24 , 2026 | 05:06 AM

రాష్ట్రవ్యాప్తంగా కొన్ని దశాబ్దాల క్రితం నగరాలకు దూరంగా పారిశ్రామికవాడలు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం అవి నగరాల మధ్యలోకి వచ్చేశాయి. ఉదాహరణకు విజయవాడ ఆటోనగర్‌ ఒకప్పుడు నగరానికి దూరంగా ఉండగా..

పాడుబడుతున్న పారిశ్రామికవాడలు

  • పరిశ్రమలు తరలిపోవడంతో నిరుపయోగంగా స్థలాలు

  • వినియోగ మార్పిడిపై విజ్ఞాపనల వెల్లువ

  • భారీగా ఆదాయం, అభివృద్ధి కోల్పోతున్న వైనం

  • ప్రత్యామ్నాయాలపై 25న సమావేశం

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

రాష్ట్రవ్యాప్తంగా కొన్ని దశాబ్దాల క్రితం నగరాలకు దూరంగా పారిశ్రామికవాడలు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం అవి నగరాల మధ్యలోకి వచ్చేశాయి. ఉదాహరణకు విజయవాడ ఆటోనగర్‌ ఒకప్పుడు నగరానికి దూరంగా ఉండగా.. ప్రస్తుతం నగరం నడిబొడ్డున ఉంది. పారిశ్రామికవాడల చుట్టుపక్కల ప్రాంతాలు కాలుష్య కాసారాలుగా మారాయి. ఈ పరిస్థితుల్లో పరిశ్రమలు నడపటం కష్టంగా మారింది. పలు పరిశ్రమలు తరలిపోవడంతో స్థలాలు నిరుపయోగంగా మారాయి. మరోవైపు పారిశ్రామికవాడల్లోని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు(ఎంఎ్‌సఎంఈ) చాలా వరకు మూతపడే పరిస్థితిలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో పారిశ్రామికవాడల్లోని స్థలాలను పారిశ్రామిక అవసరాలకే కాకుండా కమర్షియల్‌, రెసిడెన్షియల్‌, బహుళ ప్రయోజనాలకు ఉపయోగపడే విధంగా కన్వర్ట్‌ చేయాలనే విజ్ఞాపనలు వస్తున్నాయి. దీనివల్ల ప్రభుత్వానికి కూడా కన్వర్షన్‌ ఫీజు రూపంలో రిజిస్ట్రేషన్‌ విలువ మీద 25 శాతం మొత్తం సమకూరే అవకాశం ఉంది. నగరాలు, పట్టణ శివార్ల భూములు ఖరీదైనవిగా మారిన నేపథ్యంలో.. ఆటోనగర్లు, పారిశ్రామిక పార్కుల్లోని స్థలాల్ల్లో పారిశ్రామిక కార్యకలాపాలను ఇతర వాణిజ్య సంబంధిత వ్యవహారాలతో అనుసంధానం చేయడానికి ప్రభుత్వం ఒక విధానాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉందని పారిశ్రామిక వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఈ విషయంలో సమగ్ర విధానాన్ని రూపొందించేందుకు పారిశ్రామిక సంఘాలతో చర్చలు ప్రారంభించాలని కోరుతున్నాయి. ఈ నేపథ్యంలో పారిశ్రామిక భూముల కన్వర్షన్‌ విషయంలో సమగ్ర పాలసీ రూపొందించేందుకు కూటమి ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. రాష్ట్రవ్యాప్తంగా నగరాలు, పట్టణాలు, ఇతర ప్రాంతాల్లో ఉన్న పారిశ్రామికవాడలు, పారిశ్రామిక పార్కుల్లోని భూముల వివరాలను జోన్ల వారీగా సేకరించాలని ఏపీఐఐసీ అధికారులకు ఆదేశాలు జారీచేసింది. పరిశ్రమల శాఖ కార్యదర్శి ఎన్‌.యువరాజ్‌ నేతృత్వంలో పరిశ్రమల డైరెక్టర్‌, ఏపీఐఐసీ వైస్‌ చైౖర్మన్‌, ఎండీలతో పాటు లా ఓఎస్డీ, ల్యాండ్స్‌ ఓఎస్డీ, పరిశ్రమల శాఖ జోనల్‌ మేనేజర్లతో ఈ నెల 25న హైబ్రిడ్‌ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఆటోనగర్లు, పారిశ్రామిక పార్కుల్లో భూ వినియోగ మార్పిడి అంశంపై చర్చించనున్నట్లు సమాచారం.


ఇదీ నేపథ్యం..

పారిశ్రామికాభివృద్ధి కోసం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన నగరాలు, పట్టణాలకు సమీపంలో ఏపీఐఐసీ ద్వారా పారిశ్రామికవాడలను ఏర్పాటు చేశారు. అందులోని స్థలాలను పరిశ్రమల స్థాపన కోసం అప్పటి ప్రభుత్వాలు విక్రయించాయి. ప్రభుత్వం నిర్ణయించిన ధరల ప్రకారం పారిశ్రామికవేత్తలు పూర్తి రుసుము చెల్లించి స్థలాలు కొనుగోలు చేసుకున్నారు. దీంతో టైటిల్స్‌ను కూడా యూనిట్‌ హోల్డర్లకు బదిలీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఆటోనగర్లు, పారిశ్రామిక పార్కులలో ఎక్కువగా ట్రాన్స్‌పోర్ట్‌, కన్‌స్ట్రక్షన్స్‌, ప్యాకేజింగ్‌, అసెంబ్లింగ్‌, ఆటోమోటివ్స్‌, రిపేర్స్‌, సర్వీసెస్‌, స్ర్కాప్‌ తదితర ఎంఎ్‌సఎంఈ యూనిట్లను నెలకొల్పారు. కాలక్రమంలో నగరాలు, పట్టణాలలో జనాభా విపరీతంగా పెరిగిపోవడంతో ఆటోనగర్లు, పారిశ్రామిక పార్కులు, ఎస్టేట్ల చుట్టూ జనావాసాలు వెలిశాయి. దీంతో అప్పుడు ఊరికి 10-15 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆటోనగర్లు, పారిశ్రామిక పార్కులు ఇప్పుడు నగరాలు, పట్టణాల మధ్యలోకి వచ్చేశాయి.

ప్రస్తుత పరిస్థితి ఇదీ..

జనావాసాల మఽధ్యలో చిక్కుకుపోయిన పారిశ్రామికవాడల్లో ఇప్పుడు పరిశ్రమలను కొనసాగించడానికి అవరోధాలు ఏర్పడుతున్నాయి. కొన్ని నడుస్తుండగా, చాలా వరకు మూతపడ్డాయి. అప్పట్లో తక్కువ ధరకు కేటాయించిన ఈ భూములు ఇప్పుడు అత్యంత విలువైనవిగా మారాయి. కొన్నింటిని కమర్షియల్‌, రెసిడెన్షియల్‌, ఇతర లాభదాయక, బహుళ ప్రయోజన అవసరాలకు వినియోగించుకుంటున్నారు. ప్రభుత్వ అనుమతులు తీసుకోకుండా పారిశ్రామిక భూములను అనధికారికంగా ఇతర అవసరాలకు మార్చేసుకోవడంపై వివాదాలు చెలరేగుతున్నాయి. మరికొన్ని పారిశ్రామిక భూములు నిరుపయోగంగా ఉన్నాయి. దీంతో భారీగా ఆదాయం, అభివృద్ధి కోల్పోయే పరిస్థితి.


ప్రభుత్వం చర్చలు ప్రారంభించాలి

గత వైసీపీ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు (జీవో ఎంఎస్‌ నంబర్లు 5, 6) రద్దు చేయాలి. పారిశ్రామిక కార్యకలాపాలను ఇతర వ్యవహారాలతో అనుసంధానించడానికి, పారిశ్రామిక భూముల కన్వర్షన్‌కు ప్రభుత్వం ఒక సమగ్ర విధానాన్ని రూపొందించాలి. పారిశ్రామిక సంఘాలతో చర్చలు ప్రారంభించాలి.

- పొట్లూరి భాస్కరరావు, ఏపీ చాంబర్స్‌ రాష్ట్ర అధ్యక్షుడు

గత ప్రభుత్వంలో ‘సీజీపీ’

పారిశ్రామిక భూములను ఇతర అవసరాలకు వాడుకోవడానికి సమగ్ర భూ వినియోగ మార్పిడి విధానం లేకపోవడంతో గత వైసీపీ ప్రభుత్వం ‘కో-ఆర్డినేటెడ్‌ గ్రోత్‌ పాలసీ (సీజీపీ)’ని రూపొందించింది. రాష్ట్రంలో ఏపీఐఐసీ ఆధ్వర్యంలో అభివృద్ధి చేసిన పాత, కొత్త పారిశ్రామికవాడలు, పార్కుల్లోని ప్లాట్లతో పాటు స్వతంత్ర పారిశ్రామిక యూనిట్ల(సిక్‌ యూనిట్లు)కు చెందిన భూములకు ఈ పాలసీని వర్తింపజేస్తూ ఉత్తర్వులు(జీవో ఎంఎస్‌ నంబర్లు 5, 6) జారీ చేసింది. పారిశ్రామిక భూములను కన్వర్షన్‌ చేసేందుకు.. ఆ భూముల ప్రస్తుత మార్కెట్‌ విలువలో 50 శాతం ఏపీఐఐసీకి ఫీజుగా చెల్లించాలని లేదా దానికి సమానమైన భూమిని ప్రభుత్వానికి తిరిగి ఇవ్వాలని పేర్కొంది. సొంత భూమిలో యూనిట్లు నెలకొల్పినవారు ఆ భూమి మార్కెట్‌ విలువలో 15 శాతం కన్వర్షన్‌ ఫీజుగా చెల్లించాలని నిర్దేశించింది. ఈ సీజీపీ పాలసీని పారిశ్రామికవేత్తలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మార్కెట్‌ రేటు ప్రకారం భూముల విలువలో 50 శాతం కన్వర్షన్‌ ఫీజు చెల్లించాలంటే తమకు మోయలేని ఆర్థిక భారమవుతుందంటూ భూముల కన్వర్షన్‌కు ముందుకు రావడం లేదు. సీజీపీ పాలసీని రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. విజయవాడ ఆటోనగర్‌కు చెందిన పారిశ్రామికవేత్తల సంఘం కోర్టుకు వెళ్లడంతో స్టే విధించింది. కాగా గత వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన ఈ జీవోలను కూటమి ప్రభుత్వం అబియెన్స్‌ (నిలుపుదల)లో పెట్టింది.


విజయవాడలో..

విజయవాడలో పారిశ్రామిక అభివృద్ధి కోసం దాదాపు ఏడెనిమిది దశాబ్దాల క్రితం ఏర్పాటు చేసిన జవహర్‌ ఆటోనగర్‌ దేశంలోనే రెండో అతిపెద్ద పారిశ్రామికవాడగా గుర్తింపు పొందింది. ప్రస్తుతం ఆటోనగర్‌ చుట్టూ నివాస ప్రాంతాలు అభివృద్ధి చెందాయి. వాటి మధ్యలో పరిశ్రమలను కొనసాగించడానికి వీలులేని పరిస్థితులు ఏర్పడ్డాయి. దివాలా తీసిన పరిశ్రమలు, సిక్‌ యూనిట్లు, స్వతంత్ర పారిశ్రామిక (స్టాండ్‌ ఎలోన్‌) యూనిట్లు ఇప్పటికే వేలసంఖ్యలో మూతబడ్డాయి. నానాటికీ జనసాంద్రత, కాలుష్యం పెరిగిపోతుండటంతో అక్కడ ఉన్న కొద్దిపాటి పరిశ్రమలు కూడా నడపటం కష్టంగా మారింది. ఆ పారిశ్రామిక భూముల్లో ఇప్పుడు అపార్ట్‌మెంట్లు, ఇంటిగ్రేటెడ్‌ టౌన్‌షిప్పులు, హోటళ్లు, ఇతర వ్యాపార కేంద్రాలు, రిక్రియేషన్‌ సెంటర్లు తదితర వాణిజ్య కార్యకలాపాలు కొనసాగుతున్నాయి.

విశాఖపట్నంలో..

విశాఖపట్నం సమీపంలోని గాజువాక ఆటోనగర్‌ డి-బ్లాక్‌లో కామన్‌ స్పేస్‌ కోసం కేటాయించిన భూమిని కొంతమంది ప్లాట్లుగా విభజించి అమ్మకానికి పెట్టడం వివాదాస్పదంగా మారింది. ఈ డి-బ్లాక్‌ 924 ఎకరాల విస్తీర్ణంలో ఉండగా.. సామాజిక అవసరాల కోసం కామన్‌ స్పేస్‌ కింద ఐదెకరాలను కేటాయించారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఆ కామన్‌ స్పేస్‌ను ప్లాట్లుగా విభజించి అమ్మకానికి పెట్టడంతో స్థానిక పారిశ్రామికవేత్తల సంఘం కోర్టును ఆశ్రయించింది. వారికి అనుకూలంగా తీర్పు రావడంతో ఆ ప్రక్రియ ఆగిపోయింది. కానీ ఆ ప్లాట్లు అమ్మకానికి ఉన్నట్లు ఏపీఐఐసీ వెబ్‌సైట్‌లో ఇప్పటికీ చూపిస్తోంది. దీంతో పారిశ్రామికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విశాఖలోనే 104 ఏరియా ఇండస్ట్రియల్‌ ఎస్టేట్‌లో పరిశ్రమలకు కోసం కేటాయించిన కొన్ని ప్లాట్లలో చాలాకాలంగా ఆటోమొబైల్‌ షోరూమ్‌లు, సర్వీసింగ్‌ సెంటర్లు తదితర వాణిజ్య కేంద్రాలను ఏర్పాటు చేసుకుని నిర్వహిస్తున్నారు. ఈ పారిశ్రామిక భూములను వాణిజ్య కార్యకలాపాలకు కన్వర్షన్‌ చేయడం నిబంధనలకు విరుద్ధం. అయితే ఆ వాణిజ్య కేంద్రాలు ఎంఎస్ఎంఈ సెక్టార్‌లోనే ఉన్నాయని పారిశ్రామికవేత్తలు చెబుతున్నారు. భూ వినియోగ మార్పిడికి అనుమతి ఇవ్వాలని చాలాకాలంగా ప్రభుత్వాలను కోరుతున్నారు.

Updated Date - Apr 24 , 2026 | 05:06 AM