Share News

హౌసింగ్‌ రిటైర్డ్‌ ఉద్యోగుల పునర్నియామకాలు కొలిక్కి

ABN , Publish Date - Aug 14 , 2026 | 05:01 AM

రాష్ట్ర హౌసింగ్‌ కార్పొరేషన్‌ రిటైర్డ్‌ ఉద్యోగుల పునర్నియామకాల (రీ-ఇండక్షన్‌) ప్రక్రియ ఎట్టకేలకు కొలిక్కి వచ్చింది. ఈ కార్పొరేషన్‌లో 60 ఏళ్లకు పదవీ విరమణ చేసిన..

హౌసింగ్‌ రిటైర్డ్‌ ఉద్యోగుల పునర్నియామకాలు కొలిక్కి

  • మంత్రి ఓఎస్డీ లేఖను పట్టించుకోని ఉన్నతాధికారులు

  • ఎండీ నిర్ణయాల ప్రకారమే రీపోస్టింగ్‌ ఉత్తర్వులు జారీ

అమరావతి, ఆగస్టు 13(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర హౌసింగ్‌ కార్పొరేషన్‌ రిటైర్డ్‌ ఉద్యోగుల పునర్నియామకాల (రీ-ఇండక్షన్‌) ప్రక్రియ ఎట్టకేలకు కొలిక్కి వచ్చింది. ఈ కార్పొరేషన్‌లో 60 ఏళ్లకు పదవీ విరమణ చేసిన వారిని 62 ఏళ్ల వరకూ విధుల్లో కొనసాగించేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసి నెల దాటినప్పటికీ పునర్నియామకాలు చేపట్టకుండా తాత్సారం చేయడంతో ఈ ప్రక్రియ వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. ఉద్యోగులకు రీ పోస్టింగ్‌ ఆర్డర్లు ఇవ్వడానికి కొందరు అక్రమార్కులు క్యాడర్ల వారీగా రేట్లు నిర్ణయించిన వైనంపై ‘ఆంధ్రజ్యోతి’ వరుస కథనాలు ప్రచురించింది. దీంతో హౌసింగ్‌ కార్పొరేషన్‌ ఎండీ పి.అరుణ్‌బాబు వేగంగా స్పందించారు. రాష్ట్రవ్యాప్తంగా పునర్నియామాలకు అర్హులైన 300 మందికి పైగా రిటైర్డ్‌ ఉద్యోగులు, అధికారుల నుంచి సమ్మతి లేఖలు తీసుకున్నారు. ఈ తరుణంలో గృహ నిర్మాణశాఖ మంత్రి పార్థసారథి ఓఎస్డీ ఎన్‌. ప్రకాశరావు అడ్డుతగిలారు. మంత్రి సమీక్ష పూర్తయ్యేవరకు రీ-ఇండక్షన్‌ ప్రక్రియను నిలిపివేయాలంటూ 10న ఆ శాఖ ప్రత్యేక కార్యదర్శి కొర్లపాటి హెప్సిబాకు లేఖ రాశారు. దీనిపై ‘హౌసింగ్‌ రిటైర్డ్‌ ఉద్యోగులకు మంత్రి ఓఎస్డీ షాక్‌!’ శీర్షికతో ‘ఆంధ్రజ్యోతి’ 12న మరో కథనాన్ని ప్రచురించింది. దీంతో స్పందించిన మంత్రి.... హెప్సిబా, ఇతర ఉన్నతాధికారులతో సమీక్షించారు. ఓఎస్డీ లేఖను పట్టించుకోకుండా.. ఎండీ తీసుకున్న నిర్ణయాల ప్రకారమే రిటైర్డ్‌ ఉద్యోగులకు రీ పోస్టింగ్‌ ఆర్డర్లు ఇచ్చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు బుధవారం రాత్రే జిల్లాల వారీగా రిటైర్డ్‌ డీఈఈలకు పునర్నియామక ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా హౌసింగ్‌ రిటైర్డ్‌ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే రాష్ట్రస్థాయిలో ఇంకా ఇద్దరు సీఈలు, ఇద్దరు ఎస్‌ఈలు, 10 మందికి పైగా ఈఈలకు రీపోస్టింగ్‌ ఆర్డర్లు ఇవ్వాల్సి ఉంది.

Updated Date - Aug 14 , 2026 | 05:04 AM