Share News

కాంట్రాక్టర్లకు అడ్వాన్సులు చెల్లించింది మేం కాదు

ABN , Publish Date - Feb 12 , 2026 | 02:05 AM

వైసీపీ ప్రభుత్వ హయాంలో పేదల ఇళ్ల నిర్మాణం చేపట్టిన కాంట్రాక్టర్లకు ముందుగానే అడ్వాన్సులు చెల్లించిన వ్యవహారంలో తమ పాత్ర ఏమీ లేదని..

కాంట్రాక్టర్లకు అడ్వాన్సులు చెల్లించింది మేం కాదు

  • షోకాజ్‌ నోటీసులపై చర్యలు నిలిపివేయండి

  • హౌసింగ్‌ కార్పొరేషన్‌ ఎండీని కలిసిన ఇంజనీర్లు

  • నెల్లూరు నుంచి మూడు బస్సుల్లో వచ్చి వినతిపత్రం

అమరావతి, ఫిబ్రవరి 11(ఆంధ్రజ్యోతి): వైసీపీ ప్రభుత్వ హయాంలో పేదల ఇళ్ల నిర్మాణం చేపట్టిన కాంట్రాక్టర్లకు ముందుగానే అడ్వాన్సులు చెల్లించిన వ్యవహారంలో తమ పాత్ర ఏమీ లేదని.. క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న హౌసింగ్‌ ఇంజనీర్లు స్పష్టం చేశారు. తమ ప్రమేయం లేకుండానే రాష్ట్ర హౌసింగ్‌ కార్పొరేషన్‌ ప్రధాన కార్యాలయం నుంచి నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి, వారి ఖాతాల నుంచి కాంట్రాక్టర్ల ఖాతాల్లోకి బదిలీ అయ్యేలా ఏర్పాట్లు చేసుకుని చెల్లింపులు చేశారని వివరించారు. గృహనిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, అప్పటి హౌసింగ్‌ కార్పొరేషన్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌, జాయింట్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌, జిల్లాల జాయింట్‌ కలెక్టర్లు, హౌసింగ్‌ ప్రాజెక్టు డైరెక్టర్లు ప్రతి దశలోనూ తమకు జారీ చేసిన సూచనలు, ఆదేశాల మేరకు పేదల ఇళ్ల నిర్మాణ దశలను ఆన్‌లైన్‌లో అప్‌డేట్‌ చేయడం వరకే తమ పాత్ర పరిమితమని వారు వివరించారు. విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ నివేదికను చూపిస్తూ ఉన్నతాధికారులు తమకు షోకాజ్‌ నోటీసులు జారీ చేయడాన్ని వారు తీవ్రంగా ఖండించారు. నెల్లూరు జిల్లాలో ఈ షోకాజ్‌ నోటీసులు అందుకున్న హౌసింగ్‌ ఏఈలు, డీఈలు, డీఈఈలు, ఈఈలు, పదవీ విరమణ చేసిన ఇంజనీర్లు బుధవారం మూడు బస్సుల్లో విజయవాడకు వచ్చి హౌసింగ్‌ కార్పొరేషన్‌ ఎండీ పి.అరుణ్‌బాబును కలిసి మాట్లాడారు. తమకు ఇచ్చిన షోకాజ్‌ నోటీసులపై తదుపరి చర్యలను నిలిపివేయాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. అనంతరం గృహనిర్మాణ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ అజయ్‌ జైన్‌ను కలిసి తమ గోడు వినిపించారు. తమను బాధ్యులను చేస్తూ షోకాజ్‌ నోటీసులు ఇవ్వడం సరికాదని చెప్పారు. షోకాజ్‌ నోటీసులు జారీ అయిన రిటైర్డ్‌ ఇంజినీర్లకు రావలసిన బెనిఫిట్స్‌ను పూర్తిగా ఆపేశారని, వాటిని వెంటనే విడుదల చేయాలని కోరారు. కాగా... క్షేత్రస్థాయిలో విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం సమగ్ర విచారణ చేపట్టి ఇచ్చిన నివేదిక ఆఽధారంగానే తాము షోకాజ్‌ నోటీసులు జారీ చేశామని, వాటికి తగిన వివరణలు ఇస్తే సమస్యలన్నీ తొలగిపోతాయని హౌసింగ్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ అజయ్‌ జైన్‌, ఎండీ అరుణ్‌బాబు వారికి నచ్చజెప్పి పంపించారు.

Updated Date - Feb 12 , 2026 | 02:05 AM