హౌసింగ్ ఉద్యోగుల జీతంలో కోత లేదు
ABN , Publish Date - Jul 26 , 2026 | 04:55 AM
‘ఇంటి గుట్టు’ బయటపడటంతో ఉద్యోగుల జీతంలో కోత వేయాలనే నిర్ణయాన్ని రాష్ట్ర గృహనిర్మాణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ పి. అరుణ్‌బాబు ఉపసంహరించుకున్నారు.
పాత ఆదేశాలు రద్దు చేసిన ఎండీ అరుణ్‌బాబు
అన్ని జిల్లాల హౌసింగ్ హెడ్‌లకు మెమో జారీ
అమరావతి, జూలై 25(ఆంధ్రజ్యోతి): ‘ఇంటి గుట్టు’ బయటపడటంతో ఉద్యోగుల జీతంలో కోత వేయాలనే నిర్ణయాన్ని రాష్ట్ర గృహనిర్మాణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ పి. అరుణ్‌బాబు ఉపసంహరించుకున్నారు. హౌసింగ్ ఉద్యోగుల జేఏసీ విజ్ఞప్తి మేరకు తమ సంస్థలోని రెగ్యులర్ ఉద్యోగుల జూలై నెల జీతంలో 3 రోజుల గ్రాస్ శాలరీని మినహాయించి, ఆ మొత్తాన్ని ఉద్యోగుల సంక్షేమ కార్యక్రమాల కోసం జేఏసీ ఖాతాకు జమ చేయాలని అన్ని జిల్లాల హౌసింగ్ హెడ్‌లను ఆదేశిస్తూ ఎండీ ఇటీవల ఆదేశాలు జారీ చేశారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగుల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమంఐది. ఈ వ్యవహారంపై ‘ఇంటి గుట్టు’ శీర్షికతో శనివారం ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన ప్రత్యేక కథనం రాష్ట్రవ్యాప్తంగా దుమారం రేపింది. హౌసింగ్ ఉద్యోగుల పదవీ విరమణ వయసును 62 ఏళ్లకు పెంచుతూ ఇటీవల రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. దానికి సంబంధించిన జీవోలను త్వరగా ఇప్పించుకునేందుకు సంబంధిత శాఖల్లోని ఉన్నతాధికారులను ‘మేనేజ్’ చేసే పేరిట ఉద్యోగుల నుంచి భారీమొత్తంలో వసూలు చేయాలని జేఏసీ నాయకులు నిర్ణయించారు. ఉద్యోగుల సంక్షేమ కార్యక్రమాల కోసం అంటూ క్యాడర్‌ను బట్టి రేట్లు నిర్ణయించి దాదాపు రూ.కోటి వరకు వసూలు చేయాలని స్కెచ్ వేశారు. దీని వెనుక ఉన్న లోగుట్టును ‘ఆంధ్రజ్యోతి’ వెలుగులోకి తెచ్చింది. దీంతో ఉద్యోగుల వేతనంలో కోతలు విధించాలంటూ ఇంతకుముందు ఇచ్చిన ఉత్తర్వును రద్దుచేస్తూ ఎండీ ఆరుణ్‌బాబు శనివారం రాష్ట్రంలోని అన్ని జిల్లాల హౌసింగ్ హెడ్‌లకు సరికొత్త ఆదేశాలు (మెమో) జారీ చేశారు.
ఆ ఈఈకి వార్నింగ్!
ఉద్యోగుల జీతంలో కోత వేయాలని ఇచ్చిన ఆదేశాలపై తీవ్రంగా స్పందించిన కర్నూలు జిల్లాకు చెందిన ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌కు హౌసింగ్ కార్పొరేషన్ ఉన్నతాధికారులు వార్నింగ్ ఇచ్చారు. తన జీతంలో కోత వేయకుండా జిల్లా హౌసింగ్ హెడ్‌కు ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ కార్పొరేషన్ ఎండీకి రాసిన లేఖను ఆయన ఉద్యోగుల వాట్సాప్ గ్రూపుల్లో కూడా పోస్టు చేశారు. అయితే ఆ లేఖ ఎండీకి అందించకుండానే వాట్సాప్ గ్రూప్‌లో పోస్టు చేయడంపై ఉన్నతాధికారులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనకు షోకాజ్ నోటీసు ఇస్తామని హెచ్చరించారు. దీంతో సదరు ఈఈ సంజాయిషీ ఇచ్చినట్లు తెలిసింది.