ఇంటి గుట్టు!
ABN , Publish Date - Jul 25 , 2026 | 05:11 AM
సాధారణంగా ప్రకృతి విపత్తులు, ఏవైనా అనుకోని ఆపదలు, అసాధారణ పరిస్థితులు ఏర్పడినప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు కొంత మొత్తాన్ని విరాళాలుగా ఇవ్వడం పరిపాటి.
‘హౌసింగ్’లో నయా దోపిడీకి స్కెచ్
ఉద్యోగుల జీతం నుంచి కోటి స్వాహాకు రెడీ
పదవీ విరమణ వయసు పెంపుపై జీవో కోసమంటూ జేఏసీ నాయకుల పథకం
‘మేనేజ్’ చేయాలంటూ వసూళ్ల పర్వం
పైకి మాత్రం ‘సంక్షేమ’ మంత్రం
నేతల ఆగడాలకు హౌసింగ్ ఎండీ వత్తాసు
ఉద్యోగుల 3 రోజుల గ్రాస్ శాలరీ కట్ చేసి జేఏసీ ఖాతాలో వేయాలని ఉత్తర్వులు
తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఉద్యోగులు
రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ ఉద్యోగులు, వారి కుటుంబాల సంక్షేమ కార్యక్రమాల కోసం రెగ్యులర్ ఉద్యోగుల జూలై నెల జీతం నుంచి మూడు రోజుల స్థూల వేతనాన్ని (గ్రాస్ శాలరీ) విరాళాల కింద మినహాయించాలని హౌసింగ్ ఎంప్లాయిస్ జేఏసీ అభ్యర్థించింది. ఉద్యోగుల జీతాల నుంచి ఈ మేరకు ఆ మొత్తాన్ని తీసుకొని జేఏసీకి చెందిన బ్యాంకు ఖాతాలో జమ చేయండి.
- హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ అరుణ్‌బాబు ఉత్తర్వు
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
సాధారణంగా ప్రకృతి విపత్తులు, ఏవైనా అనుకోని ఆపదలు, అసాధారణ పరిస్థితులు ఏర్పడినప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు కొంత మొత్తాన్ని విరాళాలుగా ఇవ్వడం పరిపాటి. బాధితులను ఆదుకునేందుకు అందరితోపాటు ఉద్యోగులు కూడా మానవతా దృక్పథంతో తమ జీతాల్లో నుంచి కొంత మొత్తాన్ని స్వచ్ఛందంగా ఇస్తారు. ఆ మొత్తాన్ని ప్రభుత్వ ఖాతాలో జమ చేసి బాధితుల కోసం ఖర్చు చేస్తారు. కానీ దీనికి పూర్తి భిన్నంగా హౌసింగ్ కార్పొరేషన్‌లో ఉద్యోగుల జీతాల్లో కోత పెడుతున్నారు. అది కూడా ఉద్యోగుల అంగీకారం తీసుకోకుండానే జూలై నెల జీతంలో 3 రోజుల గ్రాస్ శాలరీ కట్ చేయాలని హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ అరుణ్‌బాబు ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారు.
ఉద్యోగుల కష్టార్జితం నుంచి కోత కోసిన ఆ డబ్బు ఏ ఆపన్నులకో విరాళంగా ఇవ్వడానికి కాదు. గతంలో ఎన్నడూ లేనివిధంగా పైకి ఉద్యోగుల సంక్షేమం కోసమని చెబుతున్నా.. లోగుట్టు ఏంటంటే యూనియన్ నాయకుల ‘మేనేజ్’ ఖర్చుల కోసమట! ఉద్యోగుల జేఏసీ కోరిక మేరకు హౌసింగ్ కార్పొరేషన్ ఉద్యోగుల వేతనాల్లో కోత విధిస్తూ సంస్థ ఎండీ పి.అరుణ్‌బాబు ఉత్తర్వులు కూడా జారీ చేశారు. రెగ్యులర్ ఉద్యోగులందరి జీతాల నుంచి 3 రోజుల గ్రాస్ శాలరీని మినహాయించి, జేఏసీ బ్యాంకు ఖాతాలో జమ చేయాలని ఆదేశించారు. సాక్షాత్తూ సంస్థ ఎండీనే అధికారిక ఉత్తర్వులివ్వడంతో ‘కోతలకు’ అన్ని జిల్లాల్లో సిద్ధమయ్యారు.
అసలు మతలబు ఏంటంటే...
రాష్ట్ర ప్రభుత్వ అధీనంలోని కార్పొరేషన్లు, సొసైటీలు, ప్రభుత్వ రంగ సంస్థల్లో పని చేస్తున్న ఉద్యోగుల పదవీ విరమణ వయసును 60 నుంచి 62 ఏళ్లకు పెంచుతూ ఈ నెల 10న రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నిర్ణయంతో హౌసింగ్ కార్పొరేషన్ ఉద్యోగులకు కూడా మేలు జరగనుంది. దీనికి సంబంధించిన ఉత్తర్వులు ఇంకా విడుదల కావాల్సి ఉంది. అయితే హౌసింగ్ కార్పొరేషన్‌లో ఉద్యోగులకు పదోన్నతులు, బదిలీలు నిర్వహించినప్పుడల్లా భారీస్థాయిలో వసూళ్లకు అలవాటుపడిన ఉద్యోగుల జేఏసీ నాయకులు ఇదే మంచి తరుణంగా రంగంలోకి దిగిపోయారు. భారీ మొత్తంలో సొమ్ము వసూలు చేసేందుకు స్కెచ్ వేశారు. వెంటనే జేఏసీ సమావేశాన్ని ఏర్పాటు చేసేశారు. ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంపునకు క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నా.. జీవో త్వరగా విడుదల చేయించుకోవాలంటే ఆర్థిక శాఖ సహా సంబంధిత శాఖల ఉన్నతాధికారులను ‘మేనేజ్’ చేయాలంటూ వసూళ్ల ప్రతిపాదన పెట్టారు. ఈఈ స్థాయి అధికారులు రూ.20 వేలు, డీఈ స్థాయి అధికారులు రూ.15 వేలు, ఏఈ స్థాయి అధికారులు రూ.10 వేలు చొప్పున చెల్లించాలని జేఏసీ నాయకులు తీర్మానించారు. ఈఈ నెల జీతం రూ.3 లక్షలకు పైగా ఉంటుంది. మూడు రోజుల గ్రాస్ శాలరీ అంటే రూ.30 వేలుపైనే కోత పడుతుంది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ హోదాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు సుమారు 350 మంది ఉన్నారు. అలాగే ఇటీవల పదవీ విరమణ చేసిన ఉద్యోగుల నుంచి కూడా వారి క్యాడర్‌ను బట్టి రేట్లు నిర్ణయించారు. అందరి నుంచి మొత్తం దాదాపు కోటి రూపాయలు వసూలు చేసేందుకు జేఏసీ నాయకులు పక్కా ప్రణాళిక వేశారు.
అయితే ఇందుకు జేఏసీ సమావేశంలోనే కొందరు రిటైర్డ్ అధికారులు, ఉద్యోగులు తీవ్రంగా వ్యతిరేకించారు. ‘పదవీ విరమణ వయసును పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అన్ని కార్పొరేషన్ల ఉద్యోగులకూ వర్తిస్తుంది. త్వరలోనే వాటికి సంబంధించిన ఉత్తర్వులు అందరికీ సమానంగానే విడుదలవుతాయి. అలాంటప్పుడు జీవో కోసం ప్రత్యేకంగా మనం ‘మేనేజ్’ చేయాల్సిన అవసరం ఏముంటుంది?’ అని నిలదీశారు. దీంతో కంగుతిన్న జేఏసీ నాయకులు రూటు మార్చుకున్నారు. హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ అరుణ్‌బాబును ఆశ్రయించారు. జేఏసీ నాయకుల ట్రాప్‌లో పడిన ఎండీ అనాలోచితంగా నిర్ణయం తీసుకున్నారు. జేఏసీ నాయకులు గతంలో కూడా ఇదే విధంగా పెద్ద మొత్తంలో వసూళ్లు చేశారని ఉద్యోగులు విమర్శిస్తున్నారు. పదవీ విరమణ వయసు పెంచాలని కోరుతూ కోర్టులో కేసులు వేశామని, లాయర్లకు ఖర్చుల కోసం 2 రోజుల వేతనాన్ని ఇవ్వాలంటూ 2023లో రూ.36 లక్షలకు పైగా వసూలు చేశారని, ఆ సొమ్మంతా ఏం చేశారో ఎవరికీ లెక్కలు చెప్పలేదని ఉద్యోగులు చెబుతున్నారు. తాజాగా ఎండీ ఉత్తర్వులపై కర్నూలు జిల్లాకు చెందిన ఒక ఈఈ తీవ్రంగా స్పందించారు. ‘నా వ్యక్తిగత కారణాల రీత్యా 3 రోజుల గ్రాస్ శాలరీని జేఏసీకి విరాళంగా ఇవ్వడానికి నేను సుముఖంగా లేను. కాబట్టి నా జూలై నెల జీతం నుంచి వేతనాన్ని మినహాయించవద్దని కర్నూలు జిల్లా హౌసింగ్ హెడ్‌కు తగిన ఆదేశాలు జారీ చేయాల్సిందిగా కోరుతున్నాను’ అని హౌసింగ్ కార్పొరేషన్ ఎండీకి లేఖ రాశారు. ఆయన రాసిన లేఖను ఉద్యోగుల వాట్సాప్ గ్రూపుల్లో కూడా పోస్టు చేశారు. తమ జీతాల్లో కోతలు విధించవద్దని నేరుగా ఎండీనే కలిసి నిరసన తెలియజేయాలని వాట్సాప్ గ్రూపుల్లో ఉద్యోగులు చర్చించుకుంటున్నారు.