Share News

హౌసింగ్‌లో ఆగని దందా!

ABN , Publish Date - Aug 10 , 2026 | 04:14 AM

రాష్ట్ర హౌసింగ్‌ కార్పొరేషన్‌లో అక్రమ వసూళ్ల దందా కొనసాగుతూనే ఉంది. ఉద్యోగుల పునర్నియామక (రీ-ఇండక్షన్‌) ప్రక్రియలో ఓ కీలక అధికారి వసూళ్ల దందాకు తెర లేపారు.

హౌసింగ్‌లో ఆగని దందా!

  • ఉద్యోగుల పునర్నియామక ప్రక్రియలో వసూళ్ల పర్వం

  • రిటైరైన ఏఈలు రూ.50వేలు, డీఈలు రూ.లక్ష చెల్లిస్తేనే రీపోస్టింగ్‌

  • ఈఈలు, ఎస్‌ఈలు, జీఎంలు 2 లక్షల నుంచి 5 లక్షలు కట్టాల్సిందే

  • డబ్బు వసూళ్లకు జిల్లాల వారీగా కమిటీల నియామకం

  • రూ.కోట్లు దండుకోవడానికి కీలక అధికారి పక్కా స్కెచ్‌

అమరావతి, ఆగస్టు 9 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర హౌసింగ్‌ కార్పొరేషన్‌లో అక్రమ వసూళ్ల దందా కొనసాగుతూనే ఉంది. ఉద్యోగుల పునర్నియామక (రీ-ఇండక్షన్‌) ప్రక్రియలో ఓ కీలక అధికారి వసూళ్ల దందాకు తెర లేపారు. ఏఈల నుంచి ఎస్‌ఈల వరకు రీ పోస్టింగ్‌లు ఇవ్వడానికి క్యాడర్ల వారీగా ‘రేట్లు’ నిర్ణయించారు. రాష్ట్రవ్యాప్తంగా 300మందికి పైగా ఇంజనీర్లు, ఉద్యోగుల నుంచి రూ.కోట్లు దండుకోవడానికి పక్కా ప్రణాళిక వేశారని హౌసింగ్‌ వర్గాలే చెబుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా రాష్ట్రంలోని వివిధ కార్పొరేషన్లు, సొసైటీలు, సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగుల పదవీ విరమణ వయసును 60 నుంచి 62 ఏళ్లకు పెంచుతూ రాష్ట్ర క్యాబినెట్‌ గతనెలలో నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు జనరల్‌ సర్వీస్‌ రూల్స్‌ను సవరిస్తూ గృహ నిర్మాణ శాఖ ప్రధాన కార్యదర్శి అజయ్‌ జైన్‌ గతనెల 27న గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేశారు. దాంతో జిల్లాల్లో రెగ్యులర్‌ (ఏఈ, డీఈ, మేనేజర్‌ స్థాయి) ఉద్యోగుల పునర్నియామకాలకు నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని అన్ని జిల్లాల హౌసింగ్‌ హెడ్‌లను ఆదేశిస్తూ జూలై 30న హౌసింగ్‌ కార్పొరేషన్‌ ఎండీ ప్రొసీడింగ్స్‌ ఇచ్చారు. ఈ మేరకు ఆయా జిల్లాల్లో 60 ఏళ్లకు పదవీ విరమణ చేసినా.. పునర్నియామకానికి అర్హులైన 310 మంది ఉద్యోగుల నుంచి అంగీకార లేఖలు తీసుకున్నారు. ఇక ఈఈలు, ఎస్‌ఈలు, జనరల్‌ మేనేజర్‌ స్థాయి అధికారుల పునర్నియామకానికి ప్రభుత్వ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. అంతా సాఫీగా జరిగిపోతున్న సమయంలో కీలక అధికారి రంగంలోకి దిగారు. రిటైరైన ఉద్యోగుల క్యాడర్‌ను బట్టి రేట్లు నిర్ణయించారు. వారినుంచి వసూళ్లకు జిల్లాల వారీగా కమిటీలను కూడా నియమించారు. దీంతో పునర్నినియామక ప్రక్రియ వివాదాస్పదమవుతోందని ఉద్యోగులు వాపోతున్నారు.


అక్రమార్కులకు అందలమా?

22 మందిపై ‘ఆర్టికల్‌ ఆఫ్‌ చార్జెస్‌’ పెండింగ్‌లో..

అయినా ఉద్యోగాల్లో పునర్నియామకానికి సిద్ధం

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పేదల ఇళ్ల నిర్మాణ ప్రక్రియలో... ముఖ్యంగా ఆప్షన్‌-3 ఇళ్ల నిర్మాణ పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్లతో హౌసింగ్‌ కార్పొరేషన్‌ అధికారులు, ఉద్యోగులు కుమ్మక్కై రూ.వేల కోట్లు దుర్వినియోగం చేశారనే అభియోగాలున్నాయి. దీనిపై కూటమి ప్రభు త్వం ఆదేశాలతో విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విచారణ చేపట్టింది. ఇళ్ల నిర్మాణంలో భారీఎత్తున అవినీతి, అక్రమాలు జరిగాయని, కాంట్రాక్టర్లతో పాటు హౌసింగ్‌ ఉన్నతాధికారులు, క్షేత్రస్థాయిలో ఉద్యోగులు సాగించిన అక్రమాల నిగ్గు తేల్చింది. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సిఫారసు చేస్తూ ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. విజిలెన్స్‌ గుర్తించిన ఏఈలు, డీఈలు, డీఈఈలు, ఈఈలు, డీహెచ్‌హెచ్‌లతో పాటు పదవీ విరమణ చేసిన అధికారులకు కూడా హౌసింగ్‌ కార్పొరేషన్‌ ఎండీ గత ఫిబ్రవరిలో షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. వారు ఇచ్చిన సమాధానాలు సంతృప్తికరం గా లేకపోవడంతో.. అన్ని జిల్లాల్లో కలిపి మొత్తం 112 మందిపై క్రమశిక్షణ చర్యలకు ఆదేశిస్తూ (ఆర్టికల్‌ ఆఫ్‌ చార్జెస్‌) ప్రభుత్వం గతనెల 14న ఉత్తర్వులు జారీ చేసింది. అయితే హౌసింగ్‌ కార్పొరేషన్‌ ఉన్నతాధికారులు వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోగా.. వారిలో రిటైరైన ఉద్యోగులను మళ్లీ ఉద్యోగాల్లోకి తీసుకోవడానికి అవకాశం కల్పించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ మేరకు విల్లింగ్‌ లెటర్లు ఇచ్చిన 310 మంది రిటైర్డ్‌ ఉద్యోగుల్లో ‘ఆర్టికల్‌ ఆఫ్‌ చార్జెస్‌’ పెండింగ్‌లో ఉన్న 22మంది కూడా ఉండటంపై హౌసింగ్‌ వర్గాలే ప్రశ్నిస్తున్నాయి. అవినీతికి పాల్పడినవారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సిందిపోయి.. వారిని మళ్లీ ఉద్యోగాల్లోకి తీసుకోవడం ఏవి ుటని పలువురు ప్రశ్నిస్తున్నారు. 62ఏళ్లు దాటిన రిటైర్డ్‌ ఉద్యోగులపై అవినీతి ఆరోపణలు ఉన్నాయనే కారణంతో వారికి పదవీ విరమణ ప్రయోజనాలను ఆపేశారు. పెండింగ్‌లో ఉన్న ‘ఆర్టికల్‌ ఆఫ్‌ చార్జె్‌స’ను మినహాయించి 62ఏళ్ల లోపు ఉన్నవారిని తిరిగి ఉద్యోగాల్లోకి తీసుకునేందుకు అనుమతించినట్టుగానే... తమకు కూడా రిటైర్‌మెంట్‌ బెనిఫిట్స్‌ను చెల్లించాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు.


ముడుపులు చెల్లిస్తేనే రీ పోస్టింగ్‌!

హౌసింగ్‌ కార్పొరేషన్‌లో 60ఏళ్లకు పదవీ విరమణ చేసినా.. 62సంవత్సరాల వరకు విధుల్లో కొనసాగే అవకాశం ఉన్న ఉద్యోగులందరికీ ఇప్పటికే పునర్నియామక ఉత్తర్వులు ఇవ్వాల్సి ఉంది. అయితే ఆ ప్రక్రియ అర్ధంతరంగా నిలిచిపోయింది. రీ-ఇండక్షన్‌కు అర్హులైన ఉద్యోగులు తాము నిర్ణయించిన రేట్ల ప్రకారం.. జిల్లాల్లో పనిచేసే ఏఈ రూ.50వేలు, డీఈ రూ.లక్ష చొప్పున, ఈఈల నుంచి ఎస్‌ఈలు, జనరల్‌ మేనేజర్ల స్థాయి వారైతే రూ.2లక్షల నుంచి రూ.5లక్షల వరకు ముడుపులు చెల్లిస్తేనే రీపోస్టింగ్‌ ఆర్డర్లు వస్తాయని సదరు కీలక అధికారి స్పష్టం చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ప్రభుత్వ నిర్ణయం ప్రకారం తమకు హక్కుగా రావాల్సిన పునర్నియామక ఉత్తర్వుల కోసం రూ.లక్షలు చెల్లించాలనడం సమంజసం కాదని ఉద్యోగులు వాపోతున్నారు. తమ పునర్నియామక ఉత్తర్వుల కోసం కొంతమంది రాజకీయంగా పైరవీలకు దిగడంతో అక్రమ వసూళ్ల వ్యవహారం చర్చనీయాంశంగా మారింది.

Updated Date - Aug 10 , 2026 | 04:18 AM