వినికిడి లోపం చికిత్సకు అత్యాధునిక వైద్య పరికరాలు
ABN , Publish Date - Apr 18 , 2026 | 03:56 AM
వినికిడి లోపం కలిగిన వారికి అత్యంత ఉన్నత వైద్యాన్ని కూటమి ప్రభుత్వం చేరువ చేస్తోందని ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ వెల్లడించారు. బెరా (బ్రెయిన్ ఏవోక్ట్ రెస్పాన్స్ ఆడియో ...
పలు ఆసుపత్రుల్లో 80 శాతం పనులు పూర్తి
బాధితులకు సర్టిఫికెట్ల జారీకీ వీలు: మంత్రి సత్యకుమార్
అమరావతి, ఏప్రిల్ 17 (ఆంధ్రజ్యోతి): వినికిడి లోపం కలిగిన వారికి అత్యంత ఉన్నత వైద్యాన్ని కూటమి ప్రభుత్వం చేరువ చేస్తోందని ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ వెల్లడించారు. బెరా (బ్రెయిన్ ఏవోక్ట్ రెస్పాన్స్ ఆడియో మెట్రీ), ఇంపిడెన్స్ ఆడియో మెట్రీ, ఫ్యూర్ టోన్ ఆడియో మెట్రీ పరికరాలను అవసరమైన జిల్లా, ప్రాంతీయ ఆసుపత్రుల్లో సమకూరుస్తోందని శుక్రవారం ఆయన ఓ ప్రకటనలో తెలిపారు. వినికిడి లోపం కలిగిన వారికి ఉన్నత వైద్యాన్ని అందించాలంటే ఈ మూడు రకాల వైద్య పరికరాలు ఉండాలని.. అయితే కొన్ని ఆసుపత్రుల్లో ఒకటి ఉంటే మరోకటి లేదని, మరికొన్ని చోట్ల అసలు ఒక్క పరికరం కూడా అందుబాటులో లేదన్నారు. అధికారులు క్షేత్రస్థాయిలో పరిస్థితులపై అధ్యయనం చేశారని, వారి సూచనల మేరకు సుమారు రూ.20 కోట్లతో బెరా, ఇంపిడెన్స్, ప్యూరోటోన్ ఆడియో మెట్రీ పరికరాలను స్థానిక అవసరాలకు అనుగుణంగా ఆసుపత్రుల్లో సమకూరుస్తున్నామని మంత్రి వివరించారు. ఎంపిక చేసిన ఆసుపత్రుల్లో సౌండ్ ప్రూఫ్ రూములను కూడా సిద్ధం చేస్తున్నామని చెప్పారు. వీటిని ఆసుపత్రుల్లో అందుబాటులోనికి తెచ్చే పనులు 80 శాతం వరకూ పూర్తయ్యాయని, మిగిలిన వాటిని మరో నెలలోగా సిద్ధం చేస్తామని వివరించారు. సదరం కింద జరిగే వైకల్య నిర్ధారణ పరీక్షలకు ఈ పరికరాలు బాగా ఉపయోగపడనున్నాయన్నారు. బాధితుల వినికిడి లోపాన్ని సూక్ష్మస్థాయిలో గుర్తించి సర్టిఫికెట్లు జారీ చేసేందుకు వీలవుతుందని వెల్లడించారు. వీటి ఏర్పాటుకు దాదాపు ఒక్కో ఆస్పత్రికి దాదాపు రూ.35 లక్షల వరకూ ఖర్చు చేస్తున్నట్టు మంత్రి వెల్లడించారు.