Share News

రెచ్చగొడితే ఉపేక్షించం

ABN , Publish Date - Jul 07 , 2026 | 05:18 AM

రెచ్చగొట్టే భావాలను వ్యాప్తి చేస్తూ రాష్ట్రంలో వర్గాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేసే వారిని ఉపేక్షించే ప్రసక్తే లేదు’ అని హోం మంత్రి అనిత హెచ్చరించారు.

రెచ్చగొడితే ఉపేక్షించం

  • వ్యవస్థీకృత నేరగాళ్లకు ఏపీలో చోటు లేదు

  • శాంతి భద్రతలపై సమీక్షలో హోం మంత్రి అనిత

అమరావతి, జూలై 6(ఆంధ్రజ్యోతి): ‘రెచ్చగొట్టే భావాలను వ్యాప్తి చేస్తూ రాష్ట్రంలో వర్గాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేసే వారిని ఉపేక్షించే ప్రసక్తే లేదు’ అని హోం మంత్రి అనిత హెచ్చరించారు. ఏపీ పోలీస్‌ హెడ్‌ క్వార్టర్స్‌లో డీజీపీ హరీశ్‌ కుమార్‌ గుప్తా, ఇతర ఉన్నతాధికారులతో కలసి శాంతిభద్రతలు, సైబర్‌ నేరాల కట్టడి, మహిళలకు రక్షణ, అమరావతి ప్రాంతంలో ప్రేరేపిత నిరసనలపై ఎస్‌వోపీ రూపకల్పన, ఇతర నేరాలపై పరిస్థితిని సమగ్రంగా చర్చించారు. అన్ని పోలీసు జిల్లాల ఎస్పీలు, కమిషనర్లు, ఐజీలతో పోలీసు పనితీరు, ఎదురవుతున్న సవాళ్లపై వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు. అనంతరం అనిత మాట్లాడుతూ... రాష్ట్రంలో రాజ్యాంగం కల్పించిన భావ ప్రకటనా స్వేచ్ఛ, చట్టబద్ధమైన విమర్శలకు ఆటంకం ఉండదు. అయితే అడ్డూ అదుపు లేకుండా రెచ్చిపోతే చట్టం తనపని తాను చేస్తుంది. రెండేళ్ల కూటమి పాలనలో ఏపీలో మహిళల భద్రత గణనీయంగా పెరిగింది. చిచ్చు పెట్టి విషం చిమ్మే వ్యక్తులపై నిరంతర నిఘా ఉంటుంది’ అని వెల్లడించారు. సమావేశంలో శాంతి భద్రతల ఏడీజీ మధుసూదన్‌రెడ్డి, సీఐడీ డీజీ రవిశంకర్‌ అయ్యన్నార్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 07 , 2026 | 05:18 AM