ఫ్యాన్ తీసేసి.. గొడ్డలి పెట్టుకో
ABN , Publish Date - Apr 12 , 2026 | 04:16 AM
ప్రజలకు మంచి చేస్తామని ఎవరైనా రాజకీయ పార్టీ ఏర్పాటుచేస్తారని, వైసీపీ మాత్రం చంపుతాం...నరుకడమే పార్టీ విధానం అన్నట్టు ఉన్మాదంగా ప్రవర్తిస్తోందని హోంమంత్రి వంగలపూడి అనిత మండిపడ్డారు.
వైసీపీ అంటేనే విధ్వంసం, వినాశనం.. ఎవరైనా మంచి చేయాలని పార్టీ పెడతారు
కానీ నరకడం, చంపడమే వైసీపీ పాలసీ.. తల్లినీ, చెల్లినీ ట్రోలింగ్ చేసినా పట్టని జగన్
‘వీకెండ్ కామెంట్’పై మాత్రం అక్కసు.. జర్నలిజం అంటే రప్పా రప్పా అన్నంత ఈజీ కాదు
రాధాకృష్ణను నీ తండ్రే ఏం చేయలేకపోయారు.. ఇక నువ్వెంత?.. ఇకనైనా మారండి
రౌడీయిజమే చేస్తానంటే తొక్కుకుంటూ వెళ్తాం.. జగన్‌కు హోం మంత్రి అనిత హెచ్చరిక
అమరావతిపై జగన్‌కు కడుపుమంట.. అందుకే రాజధానిపై విషం కక్కుతున్నారు
గత ప్రభుత్వం పనులు కొనసాగించి ఉంటే ఇప్పుడు భారీగా చెల్లించాల్సిన అవసరం లేదు: మంత్రి నారాయణ
విశాఖపట్నం, ఏప్రిల్ 11 (ఆంధ్రజ్యోతి): ప్రజలకు మంచి చేస్తామని ఎవరైనా రాజకీయ పార్టీ ఏర్పాటుచేస్తారని, వైసీపీ మాత్రం చంపుతాం...నరుకడమే పార్టీ విధానం అన్నట్టు ఉన్మాదంగా ప్రవర్తిస్తోందని హోంమంత్రి వంగలపూడి అనిత మండిపడ్డారు. వైసీపీ అంటేనే విధ్వంసం.. వినాశనం అని ధ్వజమెత్తారు. పార్టీ గుర్తుగా ఫ్యాన్‌ను తీసేసి గొడ్డలిని పెట్టుకోవాలని చురకలు అంటించారు. ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ ఎండీ వేమూరి రాధాకృష్ణపై చర్య తీసుకోవడం వైఎస్ రాజశేఖరరెడ్డి వల్లే కాలేదని, ఇక మాజీ సీఎం జగన్ ఎంత అని అనిత వ్యాఖ్యానించారు. విశాఖ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో కత్తి కంటే కలం గొప్పదన్నారు. ‘‘సొంత తల్లి, చెల్లిపై సోషల్ మీడియాలో తన సొంత పార్టీ వారు నీచంగా మాట్లాడినా జగన్ స్పందించలేదు. కానీ, మావిగన్‌పై రాధాకృష్ణ ‘వీకెండ్ కామెంట్’పై మాత్రం అక్కసు వెళ్లగక్కుతున్నారు. నాయకుల ప్రవర్తన, మాటలు ప్రజలకు మేలు చేసేవిగా ఉంటే ఆయన పాజిటివ్‌గా రాస్తారు. తప్పుగా మాట్లాడినా, ఇబ్బందికరమైన వ్యవహారశైలి ఉన్నా దానినే రాస్తారు. ‘మా మనిషి’ అని చెప్పి తప్పుచేసినా వదిలిపెట్టరు. అలా రాయకపోతే అది జర్నలిజం కాదు. తప్పుగా ప్రచురితమైతే నాయకులు వివరణ ఇస్తారు.’’ అని అనిత వివరించారు. పార్టీలు, పత్రికల మధ్య సత్సంబంధాలు ఉండాలన్నారు. కానీ వైసీపీ నేతలు పత్రికా సంపాదకుల్ని లేపేస్తాం.. ‘కొత్త పలుకు’ లేకుండా చేస్తామని బెదిరిస్తున్నారని మండిపడ్డారు. సంపాదకీయం రాయడమంటే..గొడ్డలికి, కత్తికి సాన పెట్టినంత సులువు కాదని, జర్నలిజం అంటే రప్పా రప్పా అన్నంత ఈజీకాదన్నారు. ఆమె ఇంకా ఏమన్నారంటే..
బెయిల్ కోసం నాడు సోనియాతో రాజీ
‘‘సొంత పేపరు నడుపుతున్న జగన్, అందులో తప్పుడు కథనాలే రాయిస్తున్నారు. వారి నుంచి అంతకంటే ఎక్కువ ఆశించలేం కూడా. ఒక్క అవకాశమని ప్రజలను మోసం చేసి, అధికారంలోకి వచ్చిన తరువాత ఐదేళ్లపాటు విధ్వంసం సృష్టించారు. ప్రజల విశ్వాసం కోల్పోయారు. ఒకసారి అవకాశం ఇచ్చిన పాపానికి రాష్ట్రం 20 ఏళ్లు వెనక్కి వెళ్లిపోయింది. ఆ ఐదేళ్ల కాలంలో ప్రజా సంఘాలు, ప్రజలు, ఉద్యోగులు, రాజకీయపార్టీలు, చివరకు పత్రికా విలేకరులపైనా కేసులు పెట్టారు. అందుకే ప్రజలు 151 సీట్ల నుంచి 11 సీట్లకు తగ్గించారు. ఇంత జరిగినా గుణపాఠం నేర్వకుండా రప్పారప్పా అంటూ రోడ్లపైకి వచ్చి భయానక వాతావరణం సృష్టిస్తున్నారు. అప్పట్లో తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని రూ. వేలకోట్ల అక్రమ ఆస్తులు సంపాదించి జైలుకు వెళ్లాడు. తన కేసుల్లో బెయిల్ తెచ్చుకోవడం కోసం కాంగ్రెస్ అధినేత్రి సోనియాతో రాజీ కుదుర్చుకున్నారు. ఇప్పటికీ బెయిల్‌పైనే ఉన్న ఆయన, కోర్టుకు వెళ్లకుండా డిశ్చార్జి పిటిషన్లు వేయిస్తున్నారు. ప్రమాదంలో తండ్రి చనిపోయిన రోజే, అధికారం కోసం జగన్ సంతకాల సేకరణ జరిపారు. జగన్‌ను సీఎం చేయాలని తాను కూడా సంతకం చేశానని అప్పటి మంత్రి, ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ ఇటీవల పేర్కొంటూ, అందుకు ఎంతో బాధపడుతున్నానని చెప్పారు. అధికారం కోసం ఎంతకైనా దిగజారే వ్యక్తి జగన్ అనేది దీన్నిబట్టి తేలిపోతోంది. ఆస్తుల కోసం సొంత తల్లి, చెల్లిని అనేక ఇబ్బందుల పాల్జేశారు.’’
మావిగన్.. ఓ మానసిక మందు
‘‘మరోసారి జగన్ అధికారంలోకి వస్తే ఏమి జరుగుతుందో ప్రజలకు తెలుసు. అధికారం పోయిన తరువాత పల్నాడు పర్యటనలో పార్టీ కార్యకర్త సింగయ్య మృతిచెందినా పట్టించుకోలేదు. అమరావతి రాజధానికి బదులు మావిగన్ అని జగన్ పేర్కొనడం ఆయన మానసిక స్థితిని తెలియజేస్తోంది. మావిగన్ పేరుతో ఒక మందు మానసిక ఇబ్బందులతో బాధపడే వారికి ఇస్తారు. మేం అంబేడ్కర్ రాసిన రాజ్యాంగాన్ని అనుసరించి పనిచేస్తున్నాం. నూడిల్స్ పాయింట్‌ను పరిశ్రమ అని, గుడ్డు పొదిగితే పారిశ్రామికవేత్తలు వస్తారని మాట్లాడిన మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ కూడా వైసీపీ అధినేత మార్గంలోనే పయనిస్తున్నారు. (సోషల్‌మీడియాలో తనపై ట్రోలింగ్స్‌కు స్పందిస్తూ..) హోం మంత్రినైనా చట్ట ప్రకారమే వ్యవహరిస్తాను. పరిధి దాటం. సోషల్ మీడియాపై కఠినంగా వ్యవహరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గాజువాకలో హత్యకు గురైన మౌనిక తల్లిదండ్రులు నన్ను కలిశారు. ఈ కేసును లోతుగా విచారణ చేస్తున్నాం.’’ అని అనిత తెలిపారు. విలేకరుల సమావేశంలో విశాఖ పార్లమెంటరీ పార్టీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చోడే వెంకట పట్టాభి, లొడగల కృష్ణ ఉన్నారు.
వివేకా పదవి లాక్కోవాలని చూశాడు
‘‘చిన్నాన్న వివేకాందరెడ్డిని చంపించి, తొలుత గుండెపోటుగా ప్రచారంచేసి ఆ తరువాత అప్పటి సీఎం చంద్రబాబుపై నింద మోపారు. 2004లో కడప ఎంపీ వివేకానందరెడ్డిని ఎంపీ పదవికి రాజీనామా చేయాలని ఒత్తిడి తీసుకువస్తే సోనియాగాంధీ అంగీకరించలేదు. వివేకా హత్య వెనుక నిందితులు ఎవరో సీబీఐ విచారణ చేయాలని జగన్ కోరలేదు. తండ్రి హత్య వెనుక నిందితుల వివరాలు వెల్లడించాలని కోరుతూ ఆయన కుమార్తె సునీత రోడ్డెక్కాల్సిన పరిస్థితి కల్పించారు. కోడికత్తి పేరుతో మరో డ్రామా ఆడి 2019 ఎన్నికల్లో లబ్ధి పొందారు. తల్లి, చెల్లికి న్యాయం చేయలేని జగన్, బయటకు వచ్చిన ప్రతిసారీ ‘నా అక్కలు, నా చెల్లెమ్మలు’ అంటూ కపట ప్రేమ ఒలకబోస్తున్నారు. ఐదేళ్ల అధికారంలో విశాఖలో ప్రభుత్వ వైద్యుడు సుధాకర్ మరణం, అమర్‌నాథ్‌గౌడ్ ఉదంతం నుంచి ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవరు సుబ్రహ్మణ్యం హత్య వరకు అనేక విధ్వంసాలకు వొడిగట్టారు.’’
రౌడీయిజాన్ని అణచివేసిన చరిత్ర బాబుది
‘‘అమరావతిని జగన్ నాశనం చేశారు. నాడు 300 మంది రైతుల మరణానికి కారణమయ్యారు. అధికారం పోయినా జగన్‌లో ఏ మార్పూ రాలేదు. పైగా విధ్వంసం, వినాశనానికి సిద్ధమవుతున్నారు. వైసీపీ అంటే విధ్వంసం, వినాశనం పార్టీగా మార్చుకుంటే మంచిది. పార్టీశ్రేణులు తప్పుడు మార్గంలోకి వెళితే మందలించి మంచి దారిలో పెట్టాల్సిన అఽధినేత , తానే విధ్వంసాన్ని ప్రోత్సహిస్తున్నారు. ఇప్పటికైనా జగన్ మారాలి. లేదని రౌడీయిజం చేస్తే తొక్కుకుంటూ వెళ్తాం. జగన్ వంటి చాలామందిని చంద్రబాబు చూశారు. హైదరాబాద్‌లో మత కల్లోలాలను ఆనాడు అణచివేశారు. జగన్ లాంటి వ్యక్తి రౌడీయిజం చేస్తే అణచివేయడం సీఎంకు పెద్ద లెక్కలోకి కాదు.’’