Share News

పేద విద్యార్థికి అండ

ABN , Publish Date - Jul 09 , 2026 | 03:23 AM

ప్రభుత్వ వసతి గృహాలు, గురుకులాల్లో చదువుతున్న విద్యార్థులకు చెల్లించే డైట్‌ చార్జీలను 10 శాతం పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

పేద విద్యార్థికి అండ

  • 10 శాతం డైట్‌ చార్జీలు పెంపు: సీఎం

  • రెండో త్రైమాసికం నుంచే అమలు

  • నిధులు లేవు, వచ్చే ఏడాది ఇద్దామన్నా ఒప్పుకోని సీఎం.. ఇవ్వాల్సిందేనని స్పష్టీకరణ

  • హాస్టళ్లు కాదు.. ఇక గురుకులాలనే నిర్మిద్దాం

  • ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల్లోని మెరిట్‌ విద్యార్థులకు శిక్షణా కేంద్రాలు

  • రూ.100 కోట్లతో హాస్టళ్లు, రెసిడెన్షియల్‌ స్కూళ్లకు మరమ్మతులు

  • సంక్షేమశాఖలపై చంద్రబాబు సమీక్ష

అమరావతి, జూలై 8(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ వసతి గృహాలు, గురుకులాల్లో చదువుతున్న విద్యార్థులకు చెల్లించే డైట్‌ చార్జీలను 10 శాతం పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సచివాలయంలో సంక్షేమ శాఖలపై సమీక్షిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నిర్ణయం ప్రకటించారు. ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందులున్నాయని... వచ్చే ఏడాది నుంచి పెంచుదామని ఆర్థికశాఖ అధికారులు సూచించగా, లేదు.. ఈ ఏడాది రెండో త్రైమాసికం నుంచే డైట్‌ చార్జీలను పెంచాలని సీఎం స్పష్టం చేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల జీవితాల్లో విద్య ద్వారానే మార్పు వస్తుందని, దీనికి తగినట్లుగానే వారికి అన్ని రకాల అవకాశాలు అందాలన్నారు. మెరుగైన విద్య, మౌలిక సదుపాయాలతోపాటు పోషకాహారాన్నీ అందించాల్సిన అవసరముందన్నారు. సంక్షేమ శాఖలకు చెందిన విద్యాసంస్థల్లో చదివే విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని, దీనికోసం పెద్దఎత్తున గురుకులాల నిర్మాణం చేపట్టాలని ఆదేశించారు. ప్రభుత్వ విద్యా సంస్థలను కార్పొరేట్‌కు దీటుగా తీర్చిదిద్దాలన్నారు. ‘‘హాస్టళ్ల స్థానంలో గురుకులాల నిర్మాణం చేపట్టేందుకు పెద్దపీట వేయాలి. రెసిడెన్షియల్‌ స్కూళ్లలో నెట్‌ జీరో విధానాన్ని అమలుచేయడం వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయో విశ్లేషించాలి. బయో డైవర్సిటీ పార్కుల తరహాలో గురుకులాలను నిర్వహించాలి. అక్కడ మెరుగైన వసతులు, మౌలిక సదుపాయాలు ఉండేలా చూడాలి. అన్నీ రెసిడెన్షియల్‌ స్కూళ్లు, హాస్టళ్లకు మెయింటినెన్స్‌ గ్రాంట్‌ ఇవ్వాలి. దీనికోసం రూ.100 కోట్లు కేటాయిస్తున్నాం. హాస్టళ్లు, గురుకులాల్లో చదివే విద్యార్థులను ఉన్నతవిద్య, పోటీ పరీక్షలకు సిద్ధం చేయాలి. ఐఐటీ, ఎన్‌ఐటీ, నీట్‌ తదితర పోటీ పరీక్షల్లో ప్రతిభ కనబరిచేలా శిక్షణ ఇప్పించాలి. విద్యతో సమానంగా శిక్షణ ఉండాలి.


ఉత్తమ ఉపాధ్యాయులను నియమించి, నాణ్యమైన శిక్షణ ఇప్పించాలి. హాస్టళ్లు, గురుకులాల్లో ప్రతిభ కనబరిచే ఇంటర్‌ విద్యార్థులకోసం ప్రత్యేక శిక్షణ కేంద్రాలను ఏర్పాటుచేయాలి. ఈ మేరకు పైలట్‌ ప్రాజెక్టు కింద కొన్ని ప్రత్యేక శిక్షణ కేంద్రాలు ప్రారంభించాలి. ఐటీఐ, పాలిటెక్నిక్‌ కళాశాలలను మ్యాపింగ్‌ చేసి, నైపుణ్యం పెంచి పారిశ్రామిక అవసరాలకు తగినట్టు తయారుచేయాలి. హాస్టళ్లు, గురుకులాలు, ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థుల ఆరోగ్యాన్ని పర్యవేక్షించేలా వైద్య విభాగాన్ని ఏర్పాటు చేయాలి. సంక్షేమ హాస్టళ్లను ఎన్‌ఆర్‌ఐలు దత్తత తీసుకునేలా వారితో సంప్రదింపులు జరపాలి. సంక్షేమ హాస్టళ్లు, రెసిడెన్షియల్‌ స్కూళ్లు, ఆశ్రమ పాఠశాలల్లో పూర్వ విద్యార్థుల నెట్‌వర్కింగ్‌ చేయాలి. రెసిడెన్షియల్‌ స్కూళ్లలో స్వచ్ఛందంగా ముందుకొచ్చి విద్యా, వైద్యసేవలు అందించే వాళ్లకు అవకాశం కల్పించాలి’’ అని చంద్రబాబు సూచించారు. పేదలు, బలహీనవర్గాలకు సంక్షేమం అందించడమే కాదు..వారి జీవనోపాధిని మెరుగుపరిచి మరింత ఆదాయాలు సమకూర్చేందుకు అన్నీ మార్గాలను అన్వేషించాలని సీఎం కోరారు. ప్రభుత్వం నుంచి అందించే సంక్షేమం, మెప్మా, డ్వాక్రా పథకాల ద్వారా ఉపాధి కల్పించడంతో పాటు పీ4 ద్వారా సాయం అందాలన్నారు.


ఎంతైనా ఖర్చు చేస్తాం : మంత్రి డోలా

వైసీపీ హయాంలో హాస్టళ్లు, గురుకులాలు సమస్యలకు నిలయంగా ఉండేవని, రెండేళ్లలోనే పరిస్థితిని సమూలంగా మార్చివేశామని సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి అన్నారు. పేద విద్యార్థుల కోసం ఎంతైనా ఖర్చు చేస్తామన్నారు. డైట్‌ చార్జీలు పెంచడంపై మంత్రి హర్షం వ్యక్తం చేశారు. చంద్రబాబుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

Updated Date - Jul 09 , 2026 | 03:25 AM