Share News

పది శాతం పెంపుతో పాత ఫీజులే!

ABN , Publish Date - Jul 03 , 2026 | 05:49 AM

ఉన్నత విద్య ఫీజుల అంశంపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. విద్యా సంవత్సరం ప్రారంభమవుతున్నప్పటికీ ఇంకా ఫీజులు ఖరారు కాకపోవడంపై..

పది శాతం పెంపుతో పాత ఫీజులే!

  • కొత్త ఫీజుల ఖరారుకు సమయం లేదు

  • అడ్మిషన్లు ఆలస్యం కాకూడదనే ఈ ప్రతిపాదన

  • వచ్చే ఏడాది నుంచే కొత్త ఫీజులు

  • ఉన్నత విద్య ఫీజులపై సర్కారు ఆలోచన

అమరావతి, జూలై 2 (ఆంధ్రజ్యోతి): ఉన్నత విద్య ఫీజుల అంశంపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. విద్యా సంవత్సరం ప్రారంభమవుతున్నప్పటికీ ఇంకా ఫీజులు ఖరారు కాకపోవడంపై పలు ప్రతిపాదనలు పరిశీలిస్తోంది. ఉన్నత విద్య కోర్సులకు ప్రతి మూడేళ్లకోసారి కాలేజీల వారీగా ఫీజులు నిర్ణయిస్తారు. గతంలో నిర్ణయించిన ఫీజుల కాల పరిమితి 2025-26 విద్యా సంవత్సరంతో ముగిసింది. 2026-27 నుంచి కొత్త ఫీజులు అమల్లోకి రావాలి. కాగా ఇప్పటివరకూ ఉన్నత విద్య ఫీజుల సిఫారసు బాధ్యత ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌ పరిధిలో ఉంది. ప్రభుత్వం ఆ కమిషన్‌ను రద్దుచేసి ఫీజుల నియంత్రణ కమిటీని ఇటీవల తీసుకొచ్చింది. అయితే ఆ కమిటీకి సభ్యుల పేర్లు ఖరారైనా, చైర్‌పర్సన్‌ పేరు పరిశీలనలో ఉంది. రెండు రోజుల్లో దీనిపై ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది. అయితే ఒకట్రెండు రోజుల్లో కమిటీ ఏర్పాటైనా ఫీజుల సిఫారసు ప్రక్రియకు కనీసం నెలన్నర నుంచి రెండు నెలల కాలం పడుతుంది. అంతకాలం బీటెక్‌, డిగ్రీ, ఇతర ఉన్నత విద్య అడ్మిషన్లు ఆపే పరిస్థితి ఉండదు. అందుకే అన్ని కాలేజీలకూ 10శాతం ఫీజులు పెంచి ఈ విద్యా సంవత్సరాన్ని కొనసాగిస్తే ఇబ్బందులుండవని విద్యాశాఖ భావిస్తోంది. బీటెక్‌తో పాటు డిగ్రీ, పీజీ, ఇతర అన్ని ఉన్నత విద్య కోర్సులకూ ఇదే వర్తింపజేయాలనుకుంటోంది. కొత్త ఫీజుల కోసం ఆగితే అడ్మిషన్లలో తీవ్ర జాప్యం ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఫీజులను స్వల్పంగా పెంచి ఈ విద్యా సంవత్సరాన్ని కొనసాగించాలనే ప్రతిపాదన తెరపైకి వచ్చింది.

Updated Date - Jul 03 , 2026 | 05:50 AM