Share News

ఏపీలోనూ వివాదాల ‘మార్కింగ్‌’

ABN , Publish Date - Jun 04 , 2026 | 04:37 AM

రాష్ట్రంలో యూనివర్సిటీల పరిధిలోని ఉన్నత విద్య కోర్సుల పరీక్షలన్నీ డిజిటల్‌ చేయాలని ప్రభు త్వం నిర్ణయించింది. ఉన్నత విద్యామండలి, ఏపీ టెక్నలాజికల్‌ సర్వీసెస్‌.....

ఏపీలోనూ వివాదాల ‘మార్కింగ్‌’

  • ఉన్నత విద్యలో ‘కోఎంప్ట్‌ ఎడ్యుటెక్‌’ కలకలం

  • సీబీఎస్ఈలో పేపర్ల గోల్‌మాల్‌ ఈ సంస్థ పనే

  • ఆన్‌స్క్రీన్ మార్కింగ్‌ పేరిట ప్రక్రియ అస్తవ్యస్తం

  • 2019లో టీ-ఇంటర్‌ ఫలితాల్లో వైఫల్యం

  • పేరు మార్చుకుని ఏపీలోకి...

  • ఉన్నత విద్యామండలి వద్దన్నా ‘కోఎంప్ట్‌’ ఎంపిక

  • చక్రం తిప్పిన ఆ ఇద్దరు అధికారులు

  • పాలిటెక్నిక్‌లో పునఃమూల్యాంకనానికి నిర్ణయం

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

రాష్ట్రంలో యూనివర్సిటీల పరిధిలోని ఉన్నత విద్య కోర్సుల పరీక్షలన్నీ డిజిటల్‌ చేయాలని ప్రభు త్వం నిర్ణయించింది. ఉన్నత విద్యామండలి, ఏపీ టెక్నలాజికల్‌ సర్వీసెస్‌(ఏపీటీఎస్‌) 2024 చివర్లో దీనికోసం టెండరు పిలిచాయి. ఈ కాంట్రాక్టును ద క్కించుకునేందుకు టీసీఎస్‌, కోఎంప్ట్‌ ఎడ్యుటెక్‌ అనే సంస్థలు పోటీపడ్డాయి. విద్యార్థులు రాసే 32 పేజీల సమాధాన పత్రాన్ని ఒక్కో పేజీ చించి స్కానింగ్‌ చేస్తామని టీసీఎస్‌ చెప్పింది. అలా చించకుండా బు క్‌లెట్‌ను యథావిధిగా ఉంచి స్కానింగ్‌ చేస్తామని చెప్పడంతో కోఎం్‌ప్టను ఎంపిక చేశారు. ఆ కంపెనీకి నేరుగా ఏపీటీఎస్యే వర్క్‌ ఆర్డర్‌ ఇచ్చింది. ఆ త ర్వాత ఉన్నత విద్యామండలితో ఎంవోయూ చేసుకోవాలి. ఈ దశలో కొందరు అధికారులు మారిపోవడంతో ఆ కంపెనీ మంచిది కాదని, గతంలో ఆరోపణలున్నాయని, పైగా సాంకేతిక అర్హతల విషయంలో లోపాలున్నాయనే కారణాలతో మండలి అధికారులు ఆ కంపెనీతో ఒప్పందానికి నిరాకరించారు. అయితే ఏపీటీఎస్‌ ఇచ్చిన వర్క్‌ ఆర్డర్‌తో కోఎంప్ట్‌ సంస్థ నేరుగా వర్సిటీల చుట్టూ తిరిగి కొన్ని వర్సిటీలను ఒప్పించి కాంట్రాక్టు తీసుకుంది. నిజానికి, 2019లో తెలంగాణ ఇంటర్‌ ఫలితాలను గోల్‌మాల్‌ చేసిన గ్లోబరీనా కంపెనీయే పేరు మార్చుకుని కోఎం్‌ప్టగా మారింది. అందులోని కొందరు పార్టనర్లు మారి గ్లోబరీనాను కోఎం్‌ప్టగా మార్చారు.


ఆ ఇద్దరు అధికారుల ఒత్తిడి

గతంలో రాష్ట్ర ఉన్నత విద్యామండలిలో పనిచేసి న ఓ ముఖ్య అధికారి, విద్యాశాఖ మంత్రి పేషీలోని కీలక అధికారి కోఎంప్ట్‌ కంపెనీకి టెండరు కట్టబెట్టే విషయంలో ఒత్తిడి చేసినట్లు తెలిసింది. సాంకేతిక అర్హతల విషయంలో లోపాలున్నాయని మండలి అధికారులు మొత్తుకున్నా, ఆ ఇద్దరూ వినలేదు. దీంతో కొందరు అధికారులు ఆ కంపెనీతో ఒప్పందానికి కుదరదని తేల్చి చెప్పారు. ప్రత్యామ్నాయంగా అప్పట్లో ఉన్నతవిద్యా మండలిలో పనిచేసిన మరో మహిళా అధికారి ద్వారా ప్రక్రియ ముందుకు కొనసాగించినట్లు సమాచారం. ఆ రోజే కోఎంప్ట్‌ కంపెనీని తిరస్కరించి ఉంటే, ఇప్పుడు ఆందోళన చెందాల్సిన అవసరం ఉండేది కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వర్సిటీల అనంతరం పాలిటెక్నిక్‌ పరీక్షల ప్రాసెసింగ్‌ కోసం సాంకేతిక విద్యా బోర్డు కూడా కోఎంప్ట్‌ కంపెనీతోనే ఒప్పందం చేసుకుంది. తాజాగా సీబీఎ్‌సఈ వివాదం తెరపైకి రావడంతో మొత్తం మూల్యాంకనా న్ని పునఃమూల్యాంకనం చేయించాలని ఉన్నత విద్యాశాఖ నిర్ణయించింది. ఆ కంపెనీని బాధ్యతల నుంచి తప్పించే అవకాశం ఉంది.

డిజిటల్‌ మూల్యాంకనం ఇలా...

కూటమి ప్రభుత్వం వచ్చాక ఉన్నత విద్య మూ ల్యాంకనం, ఫలితాలను డిజిటలైజేషన్‌ చేయాలని నిర్ణయించింది. గతంలో మూల్యాంకనం పూర్తిగా మాన్యువల్‌ విధానంలో జరిగేది. బోధనా సిబ్బంది సమాధాన పత్రాలను తీసుకుని చేతితో మూల్యాంకనం చేసేవారు. కొత్త విధానంలో సమాధాన పత్రాలను స్కానింగ్‌ చేసి బోధనా సిబ్బందికి పంపుతున్నారు. వారు కంప్యూటర్‌లో చూసి మార్కులు నమోదు చేస్తున్నారు. ఇంటర్‌లోనూ గతేడాది సప్లిమెంటరీ పరీక్షలకు ఈ విధానం అమలుచేశారు. అయితే సీబీఎ్‌సఈలో స్కానింగ్‌ చేసే సమయంలో కొన్ని పేపర్లు సరిగా స్కాన్‌ కాలేదు. ఒక విద్యార్థి పేపరును మరొక విద్యార్థి పేరుతో పంపారు. కొన్ని పేపర్లు బ్లర్‌ చేశారు. ఫలితంగా లక్షల మంది విద్యార్థుల మార్కుల్లో వ్యత్యాసాలు వచ్చాయి.

తెలంగాణలో ఘోరానికి బాధ్యులు

2019లో తెలంగాణలో 20 మంది విద్యార్థుల ఆత్మహత్యలకు గ్లోబరీనా కంపెనీ కారణమైంది. పరీక్షలు, మూల్యాంకనం అనంతరం ఫలితాల ప్రాసెసింగ్‌లో తప్పులు చేయడంతో ఏకంగా 3 లక్షల మంది విద్యార్థుల ఫలితాలు తారుమారయ్యాయి. దీంతో ఆ కంపెనీని బ్లాక్‌ లిస్టులో పెట్టారు. గ్లోబరీనా బ్లాక్‌లిస్టులోకి వెళ్లడంతో అందులోని కొందరు ఆ తర్వాత కోఎంప్ట్‌ ఎడ్యుటెక్‌ సంస్థను ప్రారంభించారు. ఈ ఏడాది 12వ తరగతి ఫలితాలను అస్తవ్యస్తం చేసి దేశవ్యాప్తంగా వివాదానికి కారణమైంది.

Updated Date - Jun 04 , 2026 | 04:37 AM