Share News

రాత పరీక్షకు ఒకే అర్హత

ABN , Publish Date - Apr 23 , 2026 | 03:40 AM

అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీలో అన్ని విశ్వవిద్యాలయాలకూ ఒకే విధమైన అర్హతలు ఉంటాయని ఉన్నత విద్యాశాఖ స్పష్టం చేసింది.

రాత పరీక్షకు ఒకే అర్హత

  • ఇంటర్వ్యూల్లో అదనపు అర్హతలకు ప్రాధాన్యం

  • అసిస్టెంట్‌ ప్రొఫెసర్ల భర్తీపై ఉన్నత విద్యాశాఖ

  • ఉపకులపతులతో సదస్సు

అమరావతి, ఏప్రిల్‌ 22(ఆంధ్రజ్యోతి): అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీలో అన్ని విశ్వవిద్యాలయాలకూ ఒకే విధమైన అర్హతలు ఉంటాయని ఉన్నత విద్యాశాఖ స్పష్టం చేసింది. ఏపీపీఎస్సీ నిర్వహించే రాత పరీక్షకు ఒకే అర్హత విధానం అమలు చేయనుంది. వర్సిటీల్లో అసిస్టెంట్‌, అసోసియేట్‌, ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీ అంశంపై ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్‌, కమిషనర్‌ భరత్‌గుప్తా బుధవారం మంగళగిరిలో అన్ని వర్సిటీల ఉప కులపతులతో సదస్సు నిర్వహించారు. ఆయా విశ్వవిద్యాలయాల్లో ఉన్న పోస్టుల ఖాళీలు, అవసరం, భర్తీ విధానం, అర్హతలపై సుదీర్ఘంగా చర్చించారు. ఒకే సబ్జెక్టుకు ఒక్కో యూనివర్సిటీ ఒక్కో తరహా విద్యార్హతలు సూచిస్తున్న అంశం సదస్సులో ప్రధానంగా చర్చకు వచ్చింది. దీంతో రాత పరీక్షకు అన్ని యూనివర్సిటీలు ఒకే విద్యార్హతను పెట్టాలని అధికారులు స్పష్టం చేశారు. అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీకి తొలుత ఏపీపీఎస్సీ రాత పరీక్ష నిర్వహిస్తుంది. అందులో ఎంపికైన అభ్యర్థులకు ఆయా వర్సిటీలు ఇంటర్వ్యూలు నిర్వహించి తుది ఎంపిక ప్రక్రియ పూర్తి చేస్తారు. అసోసియేట్‌ ప్రొఫెసర్‌, ప్రొఫెసర్‌ పోస్టులకు రాత పరీక్షలు ఉండవు. నేరుగా ఇంటర్వ్యూలతో వారిని ఎంపిక చేస్తారు. కాగా అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ రాత పరీక్ష విషయంలో ఒక్కో వర్సిటీ ఒక్కో విధానం పాటించడం వల్ల ఏపీపీఎస్సీ నిర్వహించాల్సిన పరీక్షలో దాదాపు 70 రకాల పేపర్లు తయారు చేయాల్సిన పరిస్థితి. దీంతో రాత పరీక్షకు కనీస విద్యార్హత ఒకేవిధంగా ఉండాలని అధికారులు తెలిపారు. ఆ మేరకు రెండు రోజుల్లో సమాచారం పంపాలని వీసీలకు స్పష్టం చేశారు.

Updated Date - Apr 23 , 2026 | 03:40 AM