మన సొమ్ముకాదు.. ఎంతైనా ఇచ్చేద్దాం!
ABN , Publish Date - Apr 09 , 2026 | 04:52 AM
ప్రభుత్వ విభాగాలు.. ఏదైనా పని చేయించాలంటే తొలుత టెండర్ నోటిఫికేషన్ ఇచ్చి.. కంపెనీలను ఎంపిక చేయడం అనేది నిబంధన. ఒకవేళ సమయం లేదని భావిస్తే.. తక్కువ మొత్తంలో తీసుకునే కంపెనీలను ఎంపిక చేసుకుని కాంట్రాక్టు అప్పగించాలి.
ఉన్నత విద్యాశాఖలో సాంకేతిక సేవలకు అధిక మొత్తం అందించేలా ఒప్పందం.. టెండర్లు లేకుండా పనికానిచ్చే యత్నాలు
అమరావతి, ఏప్రిల్ 8(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ విభాగాలు.. ఏదైనా పని చేయించాలంటే తొలుత టెండర్ నోటిఫికేషన్ ఇచ్చి.. కంపెనీలను ఎంపిక చేయడం అనేది నిబంధన. ఒకవేళ సమయం లేదని భావిస్తే.. తక్కువ మొత్తంలో తీసుకునే కంపెనీలను ఎంపిక చేసుకుని కాంట్రాక్టు అప్పగించాలి. ప్రభుత్వంలో ఏ శాఖ అయినా ఇదే విధానాన్ని అమలు చేయాలి. కానీ, ఉన్నత విద్యాశాఖ ఈ విధానాన్ని బుట్టదాఖలు చేసి.. ‘మన సొమ్ముకాదుగా.. ఎంతైనా ఇచ్చేద్దాం!.’ అనే రీతిలో వ్యవహరిస్తోంది. అంతేకాదు.. తక్కువ ధరకు పనిచేస్తామన్న కంపెనీని కాదని ఎక్కువ ధర చెల్లించి మరీ ఓ కంపెనీకి పని అప్పగించాలని ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. ఫలితంగా ఉన్నత విద్యాశాఖ నిధులు వృథా అయ్యే ప్రమాదముందని సిబ్బంది చెబుతున్నారు. ఉన్నత విద్యాశాఖ.. అడ్మిషన్లకు సంబంధించి ‘సాంకేతిక సేవలు’ అందించే కంపెనీని ఎంపిక చేయాలని భావించింది. గత ఏడాది డిగ్రీ అడ్మిషన్ల సాంకేతిక సేవల కోసం ‘లెర్నింగ్ స్పైరల్’ కంపెనీని ఎంపిక చేసి పనులు అప్పగించారు. ఒక్కొక్క అడ్మిషన్‌కు రూ.12 చొప్పున ఆ కంపెనీ కాంట్రాక్టు పూర్తిచేసింది. అదే విధానంలో 2026-27 విద్యా సంవత్సరంలోనూ అడ్మిషన్లు చేపట్టేందుకు ఉన్నత విద్యామండలి అదే కంపెనీతో మరోసారి ఒప్పందం చేసుకుంది. కానీ, ఇటీవల ఉన్నత విద్యాశాఖ పునర్ వ్యవస్థీకరణలో భాగంగా కొత్తగా ఏర్పాటైన ఉన్నత విద్య కమిషనరేట్ అడ్మిషన్ల ప్రక్రియను చేపడుతోంది.
అప్పటి నుంచీ లెర్నింగ్ స్పైరల్ కంపెనీని కాదని మరో ప్రముఖ ఆన్‌లైన్ కంపెనీకి అడ్మిషన్ల కాంట్రాక్టు అప్పగించే ప్రయత్నాలు ముమ్మరం చేసింది. అయితే, గతంలో ఇచ్చిన ధర కంటే తక్కువకు ఈ కంపెనీ సేవలు అందిస్తే సమస్య ఉండేది కాదు. కానీ, రెట్టింపు ధర కంటే ఎక్కువ చెల్లించేలా కొత్త కంపెనీకి కాంట్రాక్టు అప్పగించాలని అధికారులు ప్రయత్నిస్తున్నారు. అదికూడా ఎలాంటి పోటీ లేకుండా దానిని ఏకపక్షంగా ఎంపిక చేస్తున్నట్టు తెలిసింది. ఉన్నత విద్యలో ఈఏపీసెట్, ఈసెట్, డిగ్రీ, ఇతర ఉన్నత విద్య కోర్సుల్లో ఏటా సుమారు 6 లక్షల అడ్మిషన్లు ఉంటాయి. వాటికి ఇప్పుడు రెట్టింపు ధర చెల్లించేందుకు కొందరు అధికారులు ప్రయత్నించడంపై ఉన్నత విద్యా శాఖలో విస్మయం వ్యక్తమవుతోంది. కాగా, దీనిపై తుది నిర్ణయం తీసుకోలేదని ఉన్నత విద్యాశాఖ వర్గాలు తెలిపాయి. అలాంటప్పుడు, ఇప్పటికే ఉన్న ఒప్పందం ప్రకారం తక్కువ ధరకు సేవలు అందించే కంపెనీకి పని ఎందుకు అప్పగించలేదనే ప్రశ్న తలెత్తుతోంది. మరోవైపు.. వచ్చే విద్యా సంవత్సరానికి త్వరలో ప్రవేశ పరీక్షలు నిర్వహించబోతున్నందున ఆ వెంటనే అడ్మిషన్లు చేపడతారు. టెండర్లు పిలిచి కంపెనీని ఎంపిక చేసే సమయం లేదనే కారణంగా నామినేషన్ ప్రాతిపదికనే కంపెనీని ఎంపిక చేయాల్సి వస్తోందని మరికొందరు చెబుతున్నారు. ఏదేమైనా నిధులు వృథా కాకుండా చూడాలని సిబ్బంది కోరుతున్నారు.