మా ఆదేశాలను తేలిగ్గా తీసుకోవద్దు: హైకోర్టు
ABN , Publish Date - Aug 20 , 2026 | 04:47 AM
వివిధ కేసుల్లో కౌంటర్లు, స్థాయి నివేదికలు, మెమోలు దాఖలు చేయాలని కోరుతూ తామిచ్చే ఆదేశాలను అధికారులు తేలిగ్గా తీసుకుంటున్నారని హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది.
అమరావతి, ఆగస్టు 19(ఆంధ్రజ్యోతి): వివిధ కేసుల్లో కౌంటర్లు, స్థాయి నివేదికలు, మెమోలు దాఖలు చేయాలని కోరుతూ తామిచ్చే ఆదేశాలను అధికారులు తేలిగ్గా తీసుకుంటున్నారని హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. అలాంటి అధికారుల పట్ల ఉదారంగా ఉండొద్దని అడ్వొకేట్ జనరల్ (ఏజీ), ప్రభుత్వ న్యాయవాదులకు స్పష్టం చేసింది. చాలా కేసుల్లో కౌంటర్లు దాఖలు చేయని ఘటనలు తమ దృష్టికి తరచూ వస్తున్నాయని తెలిపింది. కేసు విచారణకు వచ్చే ముందురోజు లేదంటే అదేరోజు దాఖలు చేస్తున్నారని, ఇది సరికాదని పేర్కొంది. సకాలంలో కౌంటర్లు, వివరాలు సమర్పించేలా చర్యలు తీసుకోవాలని, అధికారుల పట్ల కఠినంగా వ్యవహరించాలని సూచించింది. ఏజీ స్పందిస్తూ... కౌంటర్ల దాఖలులో జాప్యం ఉద్దేశపూర్వకంగా చేస్తున్నది కాదన్నారు. ఈ విషయంలో మరింత సమన్వయం చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఇకపై సకాలంలో కోర్టుకు వివరాలు అందించేలా అధికారులకు సూచిస్తామన్నారు. ఈ వివరాలు పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం పోలీసు శాఖలో ఖాళీల భర్తీలో జరుగుతున్న జాప్యం, సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు పోలీసుల సంక్షేమం కోసం తీసుకుంటున్న చర్యలపై స్థాయి నివేదిక దాఖలు చేసేందుకు చివరి అవకాశమిస్తూ విచారణను వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లిసాగిల్, జస్టిస్ చల్లా గుణరంజన్‌తో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు ఇచ్చింది.