Share News

ఏఐ వినియోగంలో అప్రమత్తం

ABN , Publish Date - Jan 29 , 2026 | 04:03 AM

కృత్రిమ మేధ(ఏఐ) వినియోగంలో దిగువ కోర్టులను రాష్ట్ర హైకోర్టు అప్రమత్తం చేసింది. తీర్పులలో ఏఐ సాధనాలు ఉపయోగించేప్పుడు అత్యంత జాగ్రత్తగా, అప్రమత్తతో వ్యవహరించాలని సూచించింది.

ఏఐ వినియోగంలో అప్రమత్తం

  • దిగువ కోర్టులకు హైకోర్టు సూచన

  • నైతిక విచక్షణ, సాక్ష్యాధారాలను విశ్లేషించే సామర్థ్యం ఏఐకి ఉండదు

  • మానవ మేధస్సుకే ప్రాధాన్యం ఇవ్వాలి

  • ఉనికిలో లేని తీర్పులను సృష్టించిన ఏఐ

  • వాటిని ఉత్తర్వుల్లో ప్రస్తావించిన జడ్జి

  • ఏఐ వల్ల తప్పు జరిగిందని వివరణ

  • సివిల్‌ రివిజన్‌ పిటిషన్‌ కొట్టేసిన హైకోర్టు

అమరావతి, జనవరి 28(ఆంధ్రజ్యోతి): కృత్రిమ మేధ(ఏఐ) వినియోగంలో దిగువ కోర్టులను రాష్ట్ర హైకోర్టు అప్రమత్తం చేసింది. తీర్పులలో ఏఐ సాధనాలు ఉపయోగించేప్పుడు అత్యంత జాగ్రత్తగా, అప్రమత్తతో వ్యవహరించాలని సూచించింది. ఏఐ కంటే మనవ మేధస్సుకే అధిక ప్రాధాన్యం ఇవ్వాలంది. కేవలం సాంకేతికతపై ఆధారపడకుండా, న్యాయపరమైన విచక్షణ ప్రదర్శించాలని స్పష్టం చేసింది. తీర్పులు చట్టబద్ధమైన సూత్రాలకు అనుగుణంగా ఉండేలా చూసుకోవాలంది. ప్రస్తుతం ఏఐ అభివృద్ధి దశలో ఉందని, సమాచారాన్ని సమకూర్చడానికి ఉపయోగపడే సాధనంగానే దానిని చూడాలని పేర్కొంది. ఏఐకి ఎలాంటి స్పృహ, నైతిక విచక్షణ, సాక్ష్యాధారాలను విశ్లేషించే సామర్థ్యం, మానవ ప్రవర్తనలో ఉండే సూక్ష్మ భేదాలను అర్థం చేసుకునే సామర్థ్యం ఉండదని తెలిపింది. ఏఐ సాధనాలు ఉనికిలో లేని తీర్పులను సృష్టిస్తున్నాయని, ఈ విషయం ఆందోళనకరమని తెలిపింది. ఏఐ ఇచ్చిన సమాచారాన్ని యథాతథంగా తీసుకోవద్దని హెచ్చరించింది. ప్రస్తుత కేసులో ట్రయల్‌ కోర్టు న్యాయాధికారి ఇచ్చిన ఉత్తర్వుల్లో ఉనికిలో లేని తీర్పులు ప్రస్తావించినందున ఉత్తర్వులను కొట్టివేయాలని పిటిషనర్లు కోరారని గుర్తు చేసింది. ఉనికిలో లేని తీర్పులను ఉత్తర్వులలో ఉదహరించినంత మాత్రాన అవి చెల్లకుండా పోవని స్పష్టత ఇచ్చింది. ఉత్తర్వులలో న్యాయాధికారి సరైన న్యాయసూత్రాన్నే అన్వయించారని తెలిపింది. ప్రస్తుత కేసులో ట్రయల్‌ కోర్టు అధికార పరిధి దాటి వెళ్లలేదని, అలాగే ఉత్తర్వుల్లో ఎలాంటి చట్టపరమైన లోపాలు లేనందున తాము జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని పేర్కొంది. సివిల్‌ రివిజన్‌ పిటిషన్‌ను కొట్టివేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ రవినాథ్‌ తిల్హరి ఇటీవల తీర్పు ఇచ్చారు.


ఇదీ కేసు..

ఓ సివిల్‌ వివాదంలో విజయవాడ కోర్టు ఆదేశాల మేరకు అడ్వొకేట్‌ కమిషనర్‌ నివేదిక సమర్పించారు. ఆ నివేదికపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ, దానిని రద్దు చేయాలని గుమ్మడి ఉషారాణి, సునీత అనుబంధ పిటిషన్‌ దాఖలు చేశారు. విచారణ జరిపిన న్యాయాధికారి అడ్వొకేట్‌ కమిషనర్‌ నివేదిక కేవలం సాక్ష్యం మాత్రమేనని, దానిపై అభ్యంతరం ఉంటే ట్రయల్‌ విచారణలో క్రాస్‌ ఎగ్జామినేషన్‌ ద్వారా తేల్చుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అనుబంధ పిటిషన్‌ను కొట్టివేస్తూ ఆగస్టు 19న ఉత్తర్వులు ఇచ్చారు. దీనిలో 4 తీర్పులను ఉదహరించారు. అయితే.. ఈ ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ ఉషారాణి, సునీత హైకోర్టులో సివిల్‌ రివిజన్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్‌ రవినాథ్‌ తిల్హరి విచారణ జరిపారు. ఉషారాణి తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ట్రయల్‌ కోర్టు న్యాయాధికారి ఇచ్చిన ఉత్తర్వుల్లో ప్రస్తావించిన 4 తీర్పులు ఉనికిలో లేవని, ఉత్తర్వులను రద్దు చేయాలని అభ్యర్థించారు. ఈ వివరాలు పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి జస్టిస్‌ రవినాథ్‌ తిల్హరి.. న్యాయాధికారి నుండి నివేదిక కోరారు. దీంతో న్యాయాధికారి నివేదిక ఇచ్చారు. దీనిలో తాను మొదటిసారి ఏఐని వినియోగించానని, అది చూపిన తీర్పులు సరైనవేనని నమ్మి ఉత్తర్వుల్లో చేర్చానని అంగీకరించారు. భవిష్యత్తులో జాగ్రత్తగా ఉంటానని కోర్టుకు తెలిపారు. అయితే, ఉత్తర్వుల్లో వాడిన న్యాయసూత్రం సరైనదేనని, చెల్లుబాటు అవుతుందని పేర్కొన్నారు. నివేదికను పరిశీలించిన న్యాయమూర్తి.. సివిల్‌ రివిజన్‌ పిటిషన్‌ను కొట్టివేశారు.


నిందితుల పరేడ్‌ను అడ్డుకోండి

  • హైకోర్టులో పిల్‌ దాఖలు

వివిధ కేసుల్లో నిందితులను వీధుల్లో నడిపిస్తూ పరేడ్‌ నిర్వహించడం, మీడియా ముందు ప్రవేశపెట్టడాన్ని సవాల్‌ చేస్తూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్‌) దాఖలైంది. సొసైటీ ఫర్‌ ప్రొటెక్షన్‌ ఆఫ్‌ సివిల్‌ ప్రాపర్టీ, ఎన్విరాన్‌మెంటల్‌ సంస్థ అధ్యక్షుడు పరసా సురేశ్‌ కుమార్‌ దీన్ని దాఖలు చేశారు. నిందితులను వీధుల్లో నడిపించడం వారి హక్కులను హరించడమేనని పేర్కొన్నారు. పోలీసుల చర్య సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పులకు విరుద్ధమని తెలిపారు. హోంశాఖ ముఖ్యకార్యదర్శి, డీజీపీ, తూర్పుగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల ఎస్పీలను వ్యాజ్యంలో ప్రతివాదులుగా చేర్చారు.

Updated Date - Jan 29 , 2026 | 04:04 AM