ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల కాన్సిక్వెన్షియల్ సీనియారిటీ చట్టబద్ధమైనదే
ABN , Publish Date - Jul 19 , 2026 | 04:24 AM
ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులకు పదోన్నతుల్లో కల్పించే రిజర్వేషన్, దాని ఆధారంగా లభించే కాన్సిక్వెన్షియల్ సీనియారిటీ విషయంలో హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది.
లోకో పైలట్ల విషయంలో క్యాట్ ఉత్తర్వులు రద్దు: హైకోర్టు
అమరావతి, జూలై 18 (ఆంధ్రజ్యోతి): ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులకు పదోన్నతుల్లో కల్పించే రిజర్వేషన్, దాని ఆధారంగా లభించే కాన్సిక్వెన్షియల్ సీనియారిటీ విషయంలో హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. రాజ్యాంగబద్ధంగా కల్పించిన పదోన్నతిలో రిజర్వేషన్ ద్వారా పొందిన పదోన్నతులు, వాటి ఆధారంగా వచ్చిన సీనియారిటీ పూర్తిగా చట్టబద్ధమైనవేనని ధర్మాసనం స్పష్టం చేసింది. సీనియారిటీ జాబితాలో ముందు ఉన్నప్పటికీ ఉద్యోగి రిజర్వ్డ్ క్యాటగిరీకి చెందినవారనే కారణంతో ఓపెన్ క్యాటగిరీ పోస్టులకు అనర్హులనడం రాజ్యాంగంలోని ఆర్టికల్ 16(1) కల్పించిన సమానత్వ హక్కును కాలరాయడమేనని పేర్కొంది. ప్రస్తుత కేసుకు సంబంధించి లోకో పైలట్(మెయిల్) క్యాడర్‌లోని 23పోస్టులు అన్ రిజర్వ్డ్ అభ్యర్థుల కోసం నోటిఫై చేసినందున పదోన్నతుల్లో ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులను పరిగణనలోకి తీసుకోవడానికి వీల్లేదన్న జనరల్ అభ్యర్థుల వాదనను తోసిపుచ్చింది. లోకో పైలట్(మెయిల్) పోస్టు ఖాళీలన్నీ అన్ రిజర్వ్డ్ క్యాటగిరీ కిందే ఉన్నప్పటికీ ఆ పోస్టుల ఎంపిక రిజర్వేషన్ ఆధారంగా జరగలేదని, ఫీడర్ కేడర్‌లో ఉన్న సీనియారిటీ ఆధారంగా భర్తీ చేశారని గుర్తు చేసింది. 2024 అక్టోబరు 21న క్యాట్ ఇచ్చిన ఉత్తర్వులు రాజ్యాంగ స్ఫూర్తికి, సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధంగా ఉన్నాయని పేర్కొంటూ వాటిని రద్దు చేసింది. పిటిషనర్లకు కల్పించిన కాన్సిక్వెన్షియల్ సీనియారిటీ చట్టబద్ధమైనదేనని ప్రకటించింది. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ బట్టు దేవానంద్, జస్టిస్ సుభేందు సామంతలతో కూడిన ధర్మాసనం ఇటీవల ఈ మేరకు తీర్పు ఇచ్చింది. దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్‌లో ఎస్సీ, ఎస్టీ వర్గానికి చెందిన కొందరు రైల్వే లోకో పైలట్లు ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ రోస్టర్ ద్వారా లోకో పైలట్(గూడ్స్), లోకో పైలట్(ప్యాసింజర్) క్యాడర్లలో త్వరితగతిన పదోన్నతి(యాక్సిలరేటెడ్ ప్రమోషన్) పొందారు.
దీంతో ఫీడర్ క్యాడర్‌లో తమకంటే ముందు చేరిన జనరల్ క్యాడర్ అభ్యర్థుల కంటే సీనియారిటీ జాబితాలో పై స్థానానికి చేరుకున్నారు. ఈ సీనియారిటీ జాబితా ఆధారంగా 2021లో లోకో పైలట్(మెయిల్) క్యాడర్‌లోని అన్-రిజర్వ్డ్ పోస్టులలో వీరికి పదోన్నతి కల్పించారు. ఈ పదోన్నతులను సవాల్ చేస్తూ జనరల్ క్యాడర్ ఉద్యోగులు క్యాట్‌ను ఆశ్రయించారు. రిజర్వేషన్ ద్వారా వచ్చిన సీనియారిటీ ఆధారంగా ఓపెన్ క్యాడర్ పోస్టులను భర్తీ చేయడాన్ని క్యాట్ తప్పు పట్టింది. సీనియారిటీ జాబితాను తిరిగి రూపొందించాలని కోరుతూ 2024 అక్టోబరులో క్యాట్ ఉత్తర్వులు ఇచ్చింది. క్యాట్ ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఎస్సీ, ఎస్టీ లోకో పైలట్‌లు యు.అప్పారావు, జి.డేవిడ్, కె.సత్యనారాయణ, ఏ.సూర్యనారాయణ, సీహెచ్ వెంకట్రావు హైకోర్టును ఆశ్రయించారు. వ్యాజ్యాలపై విచారించిన ధర్మాసనం... పలు సుప్రీం కోర్టు తీర్పులు, రాజ్యాంగ సవరణలు విశ్లేషించింది. ఎస్సీ, ఎస్టీ లోకో పైలట్‌లకు కల్పించిన ప్రమోషన్లు, కాన్సిక్వెన్షియల్ సీనియారిటీ చట్టబద్ధమైనవేనని ప్రకటిస్తూ క్యాట్ ఉత్తర్వులను రద్దు చేసింది.