ఏసీబీ కోర్టు విచారణ పరిధి దాటింది: హైకోర్టు
ABN , Publish Date - Mar 14 , 2026 | 04:06 AM
మద్యం కుంభకోణం కేసులో వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డి(ఏ-4)కి బెయిల్ మంజూరు చేస్తూ విజయవాడ ఏసీబీ కోర్టు గత ఏడాది ఇచ్చిన తీర్పును రద్దు చేయాలని కోరుతూ సీఐడీ వేసిన పిటిషన్‌ను హైకోర్టు పాక్షికంగా అనుమతించింది.
బెయిల్ ఉత్తర్వుల్లో పలు అంశాల నిలుపుదల
మిథున్‌రెడ్డి బెయిల్ రద్దుకు నిరాకరణ
అమరావతి, మార్చి 13(ఆంధ్రజ్యోతి): మద్యం కుంభకోణం కేసులో వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డి(ఏ-4)కి బెయిల్ మంజూరు చేస్తూ విజయవాడ ఏసీబీ కోర్టు గత ఏడాది ఇచ్చిన తీర్పును రద్దు చేయాలని కోరుతూ సీఐడీ వేసిన పిటిషన్‌ను హైకోర్టు పాక్షికంగా అనుమతించింది. బెయిల్ ఉత్తర్వుల్లో ఏసీబీ కోర్టు తన విచారణ పరిధిదాటి పలు అంశాలను ప్రస్తావించిందని పేర్కొంది. కోర్టు వెల్లడించిన అభిప్రాయాలు కేసు దర్యాప్తునకు ఆటంకం కలిగించేలా ఉన్నాయని.. మిథున్‌రెడ్డి విషయంలో దర్యాప్తు ఇంకా పూర్తికాలేదని, చార్జ్జిషీట్ కూడా దాఖలు చేయలేదని గుర్తు చేసింది. ఈ నేపఽథ్యంలో ఆయన బెయిల్ ఉత్తర్వుల్లో ఏసీబీ కోర్టు ప్రస్తావించిన పలు అంశాల అమలును నిలుపుదల చేస్తున్నట్లు ప్రకటించింది. బెయిల్‌ను రద్దు చేసేందుకు నిరాకరించింది. వ్యాజ్యాన్ని పరిష్కరించింది. ఈమేరకు న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మయి శుక్రవారం ఉత్తర్వులు ఇచ్చారు. ఈ కేసులో ప్రాసిక్యూషన్ తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా, సిద్థార్థ్ అగర్వాల్ వాదనలు వినిపించారు. బెయిల్ ఉత్తర్వుల్లో కేసు దర్యాప్తు ముగిసినట్లు ఏసీబీ కోర్టు పేర్కొందని.. గూగుల్ టేక్ అవుట్ సాంకేతిక ఆధారాన్ని, సీఆర్‌పీసీ సెక్షన్ 161, 164 కింద సాక్షులు ఇచ్చిన వాంగ్మూలాలను, ఆధారాలుగా పరిగణించలేమని ఉత్తర్వుల్లో ప్రస్తావించిందన్నారు. న్యాయాధికారి వైఖరి విస్మయానికి గురి చేస్తోందన్నారు. మిధున్‌రెడ్డి బెయిల్ ఉత్తర్వుల్లోని అంశాలను ఆధారంగా చేసుకొని తమకూ బెయిల్ మంజూరు చేయాలని ఇతర నిందితులు కోరే అవకాశం ఉందన్నారు. ఈ నేపథ్యంలో ఆ అంశాల అమలును నిలుపుదల చేయాలని కోరారు.