Share News

తల్లి డిక్లరేషన్‌ చాలు..

ABN , Publish Date - Jun 06 , 2026 | 05:02 AM

దంపతుల మధ్య వివాదం తలెత్తి వేర్వేరుగా జీవిస్తున్న సందర్భంలో మైనర్‌ పిల్లల పాస్‌పోర్ట్‌ కోసం చేసే దరఖాస్తులో తల్లిదండ్రులిద్దరూ సంతకాలు...

తల్లి డిక్లరేషన్‌ చాలు..

  • మైనర్‌కు పాస్‌పోర్ట్‌ జారీ చేయండి: హైకోర్టు ఆదేశం

అమరావతి, జూన్‌ 5(ఆంధ్రజ్యోతి): దంపతుల మధ్య వివాదం తలెత్తి వేర్వేరుగా జీవిస్తున్న సందర్భంలో మైనర్‌ పిల్లల పాస్‌పోర్ట్‌ కోసం చేసే దరఖాస్తులో తల్లిదండ్రులిద్దరూ సంతకాలు చేయాల్సిన అవసరం లేదని హైకోర్టు స్పష్టం చేసింది. మైనర్‌ చిన్నారి సంరక్షణ చూస్తున్న సింగిల్‌ పేరెంట్‌ (తల్లి లేదా తండ్రి) సంతకం చేసి నిర్దిష్ట ఫార్మాట్‌లో డిక్లరేషన్‌ సమర్పిస్తే పాస్‌పోర్ట్‌ జారీ చేయొచ్చని తెలిపింది. మైనర్‌ కుమార్తెకు పాస్‌పోర్ట్‌ జారీ చేయాలంటే భర్త నుంచి విడాకులు తీసుకున్నట్లు లేదా నిర్దిష్టకాలం నుంచి ఆయననుంచి వేరుగా ఉంటున్నట్లు కోర్టు ఇచ్చిన ఉత్తర్వులు సమర్పించాలని ఓ ఒంటరి మహిళను పాస్‌పోర్ట్‌ అధికారులు కోరడాన్ని హైకోర్టు తప్పుబట్టింది. విడాకుల కేసు పెండింగ్‌లో ఉండి.. ఒంటరి మహిళలు తమ మైనర్‌ పిల్లల పాస్‌పోర్ట్‌ కోసం చేసుకొనే దరఖాస్తులో తండ్రి సంతకం అవసరం లేదని సుప్రీంకోర్టుతో పాటు వివిధ హైకోర్టులు స్పష్టమైన తీర్పులిచ్చాయని గుర్తు చేసింది. ప్రస్తుత కేసులో.. పిటిషనర్‌ షబానా ఒంటరి తల్లి నిర్వచనం పరిధిలోకి వస్తున్నందున భర్త సమ్మతితో సంబంధం లేకుండా తన కుమార్తెకు పాస్‌పోర్ట్‌ పొందే అర్హత ఆమెకు ఉందని తెలిపింది. ఆమె దరఖాస్తును పరిగణనలోకి తీసుకొని ఆమె కుమార్తెకు పాస్‌పోర్ట్‌ జారీచేయాలని పాస్‌పోర్ట్‌ అధికారులను ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ బట్టు దేవానంద్‌ ఇటీవల తీర్పు ఇచ్చారు. ఎస్‌పీఎస్‌ఆర్‌ నెల్లూరు జిల్లా, వెంకటాచల సత్రం మండలం, సర్వేపల్లి క్రాస్‌రోడ్‌ ప్రాంతానికి చెందిన షేక్‌ షబానా, భర్త ముల్లా సుహేల్‌ మధ్య విభేదాలు తలెత్తాయి. 2022 నుంచి షబానా తన మైనర్‌ కుమార్తెతో కలిసి భర్తకు దూరంగా ఉంటున్నారు. ఆమె దాఖలు చేసిన వరకట్న వేధింపులు, గృహహింస కేసులు కోర్టులో పెండింగ్‌లో ఉన్నాయి. ఈ క్రమంలో షబానా తన కుమార్తె పాస్‌పోర్ట్‌ కోసం 2025 ఆగస్టులో విజయవాడ ప్రాంతీయ పాస్‌పోర్ట్‌ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నారు. తాను ఒంటరి తల్లిని అని పేర్కొంటూ అవసరమైన డిక్లరేషన్లు సమర్పించారు. అయితే భర్త నుంచి విడాకుల పత్రాలు లేదా జ్యుడీషియల్‌ సెపరేషన్‌లో ఉన్నట్లు కోర్టు ఉత్తర్వులు తీసుకురావాలంటూ పాస్‌పోర్ట్‌ అధికారులు ఆమె దరఖాస్తును హోల్డ్‌లో పెట్టారు. దీంతో షబానా హైకోర్టును ఆశ్రయించారు.

Updated Date - Jun 06 , 2026 | 05:02 AM