Share News

లులూకు ఆర్టీసీ స్థలం ఇవ్వడం లేదు

ABN , Publish Date - Apr 09 , 2026 | 05:46 AM

విజయవాడలో ఆర్టీసీ స్థలాన్ని లులూ సంస్థకు కేటాయించడం లేదని అడ్వొకేట్‌ జనరల్‌ దమ్మాలపాటి శ్రీనివాస్‌ బుధవారం హైకోర్టుకు నివేదించారు.

లులూకు ఆర్టీసీ స్థలం ఇవ్వడం లేదు

  • హైకోర్టుకు నివేదించిన అడ్వొకేట్‌ జనరల్‌

  • వివరాలు నమోదు చేసిన ధర్మాసనం

  • ప్రజాహిత వ్యాజ్యం పరిష్కారం

అమరావతి, ఏప్రిల్‌ 8(ఆంధ్రజ్యోతి): విజయవాడలో ఆర్టీసీ స్థలాన్ని లులూ సంస్థకు కేటాయించడం లేదని అడ్వొకేట్‌ జనరల్‌ దమ్మాలపాటి శ్రీనివాస్‌ బుధవారం హైకోర్టుకు నివేదించారు. ఇందుకు సంబంధించిన వివరాలతో మెమో దాఖలు చేశామన్నారు. ఈ వివరాలు పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకూర్‌, జస్టిస్‌ చల్లా గుణరంజన్‌తో కూడిన ధర్మాసనం లులూ సంస్థకు భూ కేటాయింపును సవాల్‌ చేస్తూ విజయవాడకు చెందిన న్యాయవాది సీహెచ్‌ వెంకటేశ్వరరావు దాఖలు చేసిన పిల్‌ను పరిష్కరించింది. విజయవాడలోని ఏపీఎ్‌సఆర్‌టీసీకి చెందిన 4.15 ఎకరాల స్థలాన్ని లులూ సంస్థకు కేటాయించడాన్ని సవాల్‌ చేస్తూ మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు, విజయవాడకు చెందిన న్యాయవాది సీహెచ్‌ వెంకటేశ్వరరావు హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యాలు దాఖలు చేశారు. రాష్ట్రంలోని వివిధ సంస్థలకు భూ కేటాయింపు కోసం బిడ్డింగ్‌ విధానాన్ని అనుసరించాలని 2012లో ప్రభుత్వం తీసుకొచ్చిన పాలసీకి విరుద్ధంగా భూ కేటాయింపులు చేస్తున్నారని పిటిషన్‌లో పేర్కొన్నారు. కాగా, ఏపీ టూరిజమ్‌ ల్యాండ్‌ అలాట్‌మెంట్‌ పాలసీని తీసుకొస్తూ ప్రభుత్వం ఈ ఏడాది మార్చి 11న జారీ చేసిన జీవో 1ని సైతం వడ్డే శోభనాద్రీశ్వరావు సవాల్‌ చేశారు. దానిని విశాఖపట్నంలో లులూ సంస్థకు భూ కేటాయింపును సవాల్‌ చేస్తూ పాకా సత్యనారాయణ వేసిన పిల్‌తో జత చేయాలని ధర్మాసనం ఆదేశించింది.

Updated Date - Apr 09 , 2026 | 05:47 AM