రికార్డులన్నీ పునఃపరిశీలించండి
ABN , Publish Date - Jun 11 , 2026 | 04:26 AM
విదేశాలకు వెళ్లి వచ్చిన అర్చకులు ఆలయ గర్భగుడిలో పూజలకు అర్హులు కాదంటూ దేవదాయశాఖ కమిషనర్ ఇచ్చిన సర్క్యులర్‌ను అమలు చేయాలంటూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును హైకోర్టు ధర్మాసనం పక్కనపెట్టింది.
అర్చకుల విదేశీ ప్రయాణం వివాదంపై సింగిల్ జడ్జిని కోరిన హైకోర్టు ధర్మాసనం
వివాదంపై పూర్తి వివరాలు సింగిల్ జడ్జి దృష్టికి తేలేదు
ఆ ఉత్తర్వులు చెల్లుబాటు కావు: ధర్మాసనం
అమరావతి, జూన్ 10(ఆంధ్రజ్యోతి): విదేశాలకు వెళ్లి వచ్చిన అర్చకులు ఆలయ గర్భగుడిలో పూజలకు అర్హులు కాదంటూ దేవదాయశాఖ కమిషనర్ ఇచ్చిన సర్క్యులర్‌ను అమలు చేయాలంటూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును హైకోర్టు ధర్మాసనం పక్కనపెట్టింది. రికార్డులను పరిశీలిస్తే వివాదానికి సంబంధించిన అన్ని వివరాలను సింగిల్ జడ్జి దృష్టికి తీసుకురాలేదని స్పష్టమౌతోందని పేర్కొంది. అలా పొందిన ఉత్తర్వులు చెల్లుబాటుకావని తెలిపింది. ఈ నేపథ్యంలో అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొని ఈ వ్యవహారాన్ని సమగ్రంగా పునఃపరిశీలించాలని సింగిల్ జడ్జిని కోరింది. వివాదాన్ని సింగిల్ జడ్జి వద్దకు రిమాండ్ చేస్తూ అప్పీల్‌ను పరిష్కరించింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టి లిసాగిల్, జస్టిస్ ఎన్.జయసూర్యతో కూడిన ధర్మాసనం ఇటీవల తీర్పు ఇచ్చింది.
వివాదం ఇదీ..
విదేశాలకు వెళ్లి వచ్చిన అర్చకులు గర్భాలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించడానికి వీల్లేదంటూ దేవదాయశాఖ 2010 నవంబరు 10న జారీ చేసిన సర్క్యులర్ మెమో, శృంగేరి శారదా పీఠాధిపతులు జారీ చేసిన ప్రామాణిక ఉత్తర్వులను కచ్చితంగా అమలు చేసేలా దేవదాయశాఖ అధికారులను ఆదేశించాలని కోరుతూ విజయవాడ శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామివార్ల దేవస్థానంలో శ్రీ చక్ర నవావరణ అర్చన పారాయణదారు సుబ్రహ్మణ్య సోమయాజి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన సింగిల్ జడ్జి.. దేవదాయ శాఖ సర్క్యులర్‌లను, అలాగే శృంగేరి శారదా పీఠం జగద్గురువులు శ్రీశ్రీశ్రీ మహాతీర్థ భారతీస్వామి 2024 డిసెంబరు 20న ప్రామాణికం అమలు చేయాలని దేవదాయశాఖ ముఖ్యకార్యదర్శి, కమిషనర్‌ను ఆదేశించారు. ఈ తీర్పును సవాల్ చేస్తూ సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామివారి దేవస్థానం ప్రధాన అర్చకులు గొడవర్తి శ్రీనివాసాచార్యులు ధర్మాసనం ముందు అప్పీల్ వేశారు.
శ్రీనివాసాచార్యుల తరఫు న్యాయవాది ధర్మాసనం ముందు వాదనలు వినిపి స్తూ, దేవదాయశాఖ సర్క్యులర్ అమల్లోకి రాకముం దు కమిషనర్ అనుమతితో 2001-2006 మధ్య పలుమార్లు అప్పీల్‌దారు విదేశాలకు వెళ్లారన్నారు. విదేశాలకు వెళ్లిన కాలానికి జీతం కూడా తీసుకోలేదన్నా రు. ఆ సర్క్యులర్ అప్పీల్‌దారుకు వర్తించదని చెప్పా రు. అలాగే దేవదాయశాఖ ఇచ్చిన ఆ సర్క్యులర్ చట్టవిరుద్ధమైనదిగా ప్రకటించాలని కోరుతూ అప్పీల్‌దారు దాఖలు చేసిన రిట్ పిటిషన్‌పై విచారణ పెండింగ్‌లో ఉందన్నారు. ఈ విషయాలను దేవదాయశాఖ అధికారులు సింగిల్ జడ్జి దృష్టికి తీసుకురాలేదని పేర్కొన్నారు. పూర్తి వివరాలు కోర్టు దృష్టికి తేకుండా సింగిల్ జడ్జి వద్ద సుబ్రహ్మణ్య సోమయాజి ఉత్తర్వులు పొందారని అన్నారు. సింగిల్ జడ్జి తీర్పు అప్పీల్‌దారుపై ప్రభావం పడుతున్నందున అప్పీల్‌ను అనుమతించాలని అభ్యర్థించారు. ఈ వాదనలు పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.. కేసు విచారణపై ప్రభావం చూసే వాస్తవాలు సింగిల్ జడ్జి దృష్టికి తీసుకురాలేదనే విషయం స్పష్టమౌతోందని పేర్కొంది. ఈ వ్యవహారంలో సింగిల్ జడ్జి ఈ ఏడాది మార్చి 30న ఇచ్చిన తీర్పు చెల్లుబాటు కాదని స్పష్టం చేసింది. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొని ఈ వ్యవహారాన్ని సమగ్రంగా పునఃపరిశీలించాలని సింగిల్ జడ్జిని కోరింది.