విద్యార్థులు గుర్తింపు ధ్రువీకరణకు ప్రత్యామ్నాయ విధానాలు పరిశీలించండి!
ABN , Publish Date - Jun 16 , 2026 | 03:52 AM
విద్యార్ధుల శరీరంపై ఉన్న పుట్టుమచ్చలను సర్టిఫికెట్లపై నమోదు చేయడం ద్వారా వ్యక్తిగత గోప్యతను హరిస్తున్నారంటూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై..
విద్యాశాఖ అధికారులకు హైకోర్టు ఆదేశం
విద్యార్థినుల పుట్టుమచ్చలు వెతికేందుకు మహిళా సిబ్బందినే ఉపయోగించాలని స్పష్టీకరణ
అమరావతి, జూన్ 15 (ఆంధ్రజ్యోతి): విద్యార్ధుల శరీరంపై ఉన్న పుట్టుమచ్చలను సర్టిఫికెట్లపై నమోదు చేయడం ద్వారా వ్యక్తిగత గోప్యతను హరిస్తున్నారంటూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టు సోమవారం స్పందించింది. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి, కమిషనర్, ప్రభుత్వ పరీక్షల డైరెక్టరేట్‌కు నోటీసులు జారీచేసింది. విద్యార్థుల గుర్తింపు ధ్రువీకరణ కోసం ప్రత్యామ్నాయ విధానాలు పరిశీలించాలని అధికారులకు సూచించింది. విద్యార్థినుల ఒంటిపై పుట్టు మచ్చలు వెతికే సమయంలో మహిళా సిబ్బందినే ఉపయోగించాలని స్పష్టం చేసింది. ఈ విషయంలో విద్యార్థులకు అసౌకర్యం కలిగించడానికి వీల్లేదని తేల్చిచెబుతూ.. విచారణను వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లిసాగిల్, జస్టిస్ ఎన్.జయసూర్య ధర్మాసనం ఉత్తర్వులు ఇచ్చింది. విద్యార్థుల గుర్తింపు ధ్రువీకరణ కోసం వారి ఒంటిపై ఉండే పుట్టుమచ్చల వివరాలను సర్టిఫికెట్లపై ముద్రించడాన్ని రాజ్యాంగ, చట్టవిరుద్ధమైనదిగా ప్రకటించాలని కోరుతూ బి.నాగసాత్విక్ అనే న్యాయవాది పిల్ దాఖలు చేశారు. దీనిపై సోమవారం విచారణ జరగ్గా, నాగ సాత్విక్ వాదనలు వినిపించారు. శరీరంపై ఉండే పుట్టు మచ్చలు, ఇతర గుర్తులను నమోదు చేయడం ద్వారా రాజ్యాంగం ప్రసాదించిన వ్యక్తిగత గోప్యత హక్కును అధికారులు హరిస్తున్నారని నివేదించారు. విద్యాశాఖ తరఫు ప్రభుత్వ న్యాయవాది జి.రామచంద్రరావు వాదనలు వినిపిస్తూ.. విద్యార్థుల గుర్తింపు ధ్రువీకరణ కోసం పుట్టుమచ్చల వివరాలను నమోదు చేస్తున్నారన్నారు. 1969 నుంచి ఈ విధానం అమల్లో ఉందని పేర్కొన్నారు. ధర్మాసనం జోక్యం చేసుకుంటూ.. ప్రస్తుత కాలంలో సర్జరీల ద్వారా పుట్టుమచ్చలు, ఇతర మచ్చలను తొలగిస్తున్నారని గుర్తు చేసింది. దీని కోసం బయోమెట్రిక్ విధానాన్ని అనుసరించవచ్చు కదా? అని ప్రశ్నించింది.