ఆ పోస్టుల భర్తీకి ఏం చర్యలు తీసుకున్నారు
ABN , Publish Date - Jun 18 , 2026 | 04:36 AM
లోకాయుక్త, మానవ హక్కుల కమిషన్ (ఏపీహెచ్‌ఆర్సీ), ఏపీ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ), రాష్ట్ర వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్..
పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయండి
సీఎస్‌కు హైకోర్టు ధర్మాసనం ఆదేశం
అమరావతి, జూన్ 17(ఆంధ్రజ్యోతి): లోకాయుక్త, మానవ హక్కుల కమిషన్ (ఏపీహెచ్‌ఆర్సీ), ఏపీ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ), రాష్ట్ర వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ (ఎస్‌సీఆర్‌డీసీ) చైర్‌పర్సన్, సభ్యుల పోస్టుల ఖాళీల భర్తీకి తీసుకున్న చర్యలపై అఫిడవిట్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్)ని హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది. ఖాళీల భర్తీలో జాప్యంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. గత ఏడాది సెప్టెంబరు నుంచి కౌంటర్ దాఖలు చేయకపోవడాన్ని ఆక్షేపించింది. పోస్టుల భర్తీ పురోగతిపై తాజా వివరాలతో అఫిడవిట్ వేసేందుకు సమయం ఇవ్వాలని అడ్వొకేట్ జనరల్(ఏజీ) కోరడంతో విచారణను వాయిదా వేసింది. ఈమేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లిసా గిల్, జస్టిస్ ఎన్.జయసూర్యతో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు ఇచ్చింది. లోకాయుక్త, ఏపీహెచ్‌ఆర్సీ, ఏపీఈఆర్సీ, ఎస్‌సీఆర్‌డీసీ చైర్‌పర్సన్, సభ్యుల పోస్టులను భర్తీ చేసేలా ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో పలు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లు బుధవారం విచారణకు రాగా ఏజీ దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపిస్తూ... నియామకాల ప్రక్రియ వివిధ దశల్లో ఉందన్నారు. పూర్తి వివరాలతో కౌంటర్ వేస్తామని, రెండువారాల సమయం ఇవ్వాలని కోరారు. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది వైవీ రవిప్రసాద్ వాదనలు వినిపిస్తూ... 2024 అక్టోబరులో లోకాయుక్త పోస్టుకు హైకోర్టు సీజే సిఫార్సు చేసిన పేర్లను ప్రభుత్వం పక్కనపెట్టి, చట్టానికి సవరణ చేసిందన్నారు. దీంతో సీజే సిఫార్సులు చెల్లకుండా పోతాయని ప్రభుత్వం భావిస్తోందన్నారు. చట్టసవరణకు ముందే సీజే చేసిన సిఫార్సులు చెల్లుబాటు అవుతాయన్నారు. చట్ట సవరణను కూడా తాము సవాలు చేశామన్నారు. న్యాయవాది తాండవ యోగేశ్ వాదనలు వినిపిస్తూ... మానవ హక్కుల కమిషన్ పోస్టును మూడు వారాల్లో భర్తీ చేస్తామని ప్రభుత్వం ఇటీవల కోర్టుకు నివేదించిందని, పోస్టు భర్తీకి ఇప్పటివరకు మూడు సార్లు నోటిఫికేషన్ జారీ చేసినా ఎలాంటి పురోగతి లేదని తెలిపారు.