Share News

విడాకులకు ‘కూలింగ్‌ పీరియడ్‌’ తప్పనిసరి కాదు

ABN , Publish Date - Jun 26 , 2026 | 03:41 AM

విడాకుల మంజూరు విషయంలో ఓ కేసు విచారణ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. వైవాహిక జీవితంలో తలెత్తిన వివాదాలను పరిష్కరించుకొని..

విడాకులకు ‘కూలింగ్‌ పీరియడ్‌’ తప్పనిసరి కాదు

  • దంపతుల మధ్య రాజీకి అవకాశం లేకుంటే ఆ సెక్షన్‌ను మినహాయించొచ్చు

  • సమస్యలన్నీ పరిష్కరించుకుంటే విడాకుల కోసం ఆర్నెల్లు వేచి ఉండక్కర్లేదు: హైకోర్టు

అమరావతి, జూన్‌ 25 (ఆంధ్రజ్యోతి): విడాకుల మంజూరు విషయంలో ఓ కేసు విచారణ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. వైవాహిక జీవితంలో తలెత్తిన వివాదాలను పరిష్కరించుకొని తిరిగి కలిసి జీవించలేమని భార్యాభర్తలు నిర్ణయానికి వచ్చి, పరస్పర అంగీకారంతో విడాకులు కోరుతున్నప్పుడు ఆరు నెలలు కాలం (కూలింగ్‌ పీరియడ్‌) వేచి ఉండాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ఇరుపక్షాల మధ్య వివాదాలను పరిష్కరించుకున్నారని, రాజీకి అవకాశం లేదని కోర్టు సంతృప్తి చెందితే కూలింగ్‌ పీరియడ్‌ను మినహాయించవచ్చని సుప్రీంకోర్టు పలు తీర్పుల్లో స్పష్టం చేసిందని గుర్తుచేసింది. భార్యా భర్తలు తమ నిర్ణయాన్ని పునఃసమీక్షించుకొని, తిరిగి కలిసి ఉండే అవకాశాలను అన్వేషించడానికి సహేతుక సమయం ఇవ్వడమే హిందూ వివాహ చట్టంలోని సెక్షన్‌ 13(బి)(2) ముఖ్య ఉద్దేశమని పేర్కొంది. దంపతులు చాలాకాలం నుండి వేర్వేరుగా ఉంటూ, సమస్యలన్నీ పరిష్కరించుకొని విడిపోవాలని నిర్ణయించుకున్నప్పుడు.. కూలింగ్‌ పీరియడ్‌ విధించడం వల్ల ఇరుపక్షాల మధ్య మానసిక వేదన మరింత పెరగడమే తప్ప, ఎలాంటి ప్రయోజనం ఉండదని పేర్కొంది. కూలింగ్‌ పీరియడ్‌ గడువు ముగియక ముందే విడాకులు మంజూరుపై విచారణ జరపాలన్న పిటిషనర్ల అభ్యర్థనను నిరాకరిస్తూ ఒంగోలు ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేసింది. వారి పిటిషన్‌ను స్వీకరించి, విడాకుల మంజూరు ప్రక్రియను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని ఫ్యామిలీ కోర్టును ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు ఇటీవల తీర్పు ఇచ్చారు.


ఫ్యామిలీ కోర్టు ఉత్తర్వులు రద్దు

ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన దంపతులు పరస్పర అంగీకారంతో విడాకులు కోరుతూ ఈ ఏడాది జనవరిలో స్థానిక ఫ్యామిలీ కోర్టులో దరఖాస్తు చేశారు. విచారణ జరిపిన కోర్టు నిర్ణయం వెల్లడించేందుకు ఆర్నెల్ల ‘కూలింగ్‌ పీరియడ్‌’ విధిస్తూ వాయిదా వేసింది. అయితే ఇరుపక్షాల మధ్య ఆస్తి పంపిణీ, కుమార్తె సంరక్షణ, శాశ్వత భరణం చెల్లింపు, భర్తపై పెట్టిన క్రిమినల్‌ కేసు ఉపసంహరణ తదితర అం శాల్లో ఒప్పందం కుదిరిన నేపథ్యంలో విడాకుల కేసు విచారణను ముందుకు జరపాలని అనుబంధ పిటిషన్‌ వేశారు. అయితే కూలింగ్‌ పీరియడ్‌ తప్పనిసరని స్పష్టం చేస్తూ ఫ్యామిలీ కోర్టు ఆ పిటిషన్‌ను కొట్టివేసిం ది. ఈ ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ దంపతులు హైకోర్టులో క్రిమినల్‌ రివిజన్‌ పిటిషన్‌ వేశారు. భార్యాభర్తలు విడిపోవాలని నిర్ణయించుకొని, వారి మధ్య సమస్యలన్నింటినీ పరిష్కరించుకున్నప్పుడు.. కూలింగ్‌ పీరియడ్‌ను మినహాయించే విచక్షణాధికారం కోర్టులకు ఉందని వారి తరఫు న్యాయవాది అయేషా అజ్మ వాదించారు. దీన్ని పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి.. హిందూ వివాహ చట్టంలోని సెక్షన్‌ 13(బి)(2) ప్రకారం కూలింగ్‌ పీరియడ్‌ తప్పనిసరి కాదని, అది కేవలం సూచనాత్మకమైనదని సుప్రీంకోర్టు పలు తీర్పుల్లో స్పష్టం చేసిందని గుర్తుచేశారు. ప్రస్తుత కేసులో ఇరుపక్షాల మధ్య జరిగిన వివాదాల పరిష్కారం స్వచ్ఛందంగా జరిగినట్లు స్పష్టవుతోందన్నారు. ఈ నేపథ్యంలో ఒంగోలు ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.

Updated Date - Jun 26 , 2026 | 03:43 AM